Wednesday, January 22, 2025

రాజస్థాన్‌లో 300 ఏళ్ల నాటి శివాలయం కూల్చివేత..

- Advertisement -
- Advertisement -

Demolition of a 300-year-old Shiva temple in Rajasthan

మన తెలంగాణ/హైదరాబాద్ : రాజస్థాన్‌లో 300 సంవత్సరాల చరిత్రగల శివాలయాన్ని కూల్చివేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని మతాలకు స్వేచ్ఛ ఉండాలనే అంశాన్ని తమ పార్టీ విశ్వసిస్తుందని ఆయన స్పష్టం చేశారు. శివాలయం కూల్చివేతపై ప్రజలకు కాంగ్రెస్, బీజేపీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదివారం అసద్ విలేకరులతో మాట్లాడుతూ, రాజస్థాన్‌లోని ఆళ్వార్‌లో ఉన్న 300 సంవత్సరాల చరిత్రగల శివాలయాన్ని కూల్చేశారని, ఈ విషయంలో తమకు సంబంధం లేదని కాంగ్రెస్ చేతులు దులిపేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాజ్‌గఢ్ మునిసిపాలిటీ పరిధిలో ఉందని, ఈ మునిసిపాలిటీ పాలక వర్గం బీజేపీదేనని కాంగ్రెస్ వాదిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ శివాలయం కూల్చివేతను తాను ఖండిస్తున్నానని … మునిసిపల్ బోర్డు బిజెపి నేతృత్వంలో ఉందని, అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉందని ఆయన దుయ్యబట్టారు. శివాలయాన్ని కూల్చేయాలన్న మునిసిపల్ బోర్డు నిర్ణయాన్ని కాంగ్రెస్ నేతృత్వంలోని రాజస్థాన్ ప్రభుత్వం ఆమోదించిందని అసద్ ఫైరయ్యారు. ఈ కూల్చివేతపై ప్రజలకు కాంగ్రెస్, బిజెపి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

కాగా.. అల్వార్ జిల్లా సరాయ్ మొహల్లాలో 300 ఏళ్ల నాటి శివాలయాన్ని బుల్డోజర్‌తో కూల్చేశారు. స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ ఈ కూల్చివేత జరిగింది. దీనిపై కేసు నమోదు చేయాలని నగర్ పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్, రాజ్‌గడ్ ఎంఎల్‌ఎలకు ఫిర్యాదు అందాయి. ఈ ఘటనకు సంబంధించి బిజెపి నేత అమిత్ మాల్వియా ట్వీట్ చేశారు. కూల్చివేతకు సంబంధించిన ఓ వీడియోను ఆయన ట్వీట్ చేశారు. కరౌలీ, జహంగిర్‌పురి ఘటనలపై మొసలి కన్నీరు కార్చిన కాంగ్రెస్.. హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని, ఇదే ఆ పార్టీ ఆచరిస్తున్న లౌకికతత్వం అని విమర్శించారు. ఏప్రిల్ 18న ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా ఈ అధికారులు .. రాజ్‌గడ్ పట్టణంలో 85 మంది హిందువులకు చెందిన పక్కా ఇళ్లను, షాపులను బుల్డోజర్లతో నేలమట్టం చేసిందని వివరించారు. కాగా, బిజెపి ఆరోపణలపై కాంగ్రెస్ రియాక్ట్ అయింది. బిజెపి వాదనలు పచ్చి అబద్ధాలని రాజస్తాన్ మంత్రి ప్రతాప్ సింగ్ కచారియవాస్ తెలిపారు. రాజ్‌గడ్ అర్బన్ బాడీస్ బోర్డు చైర్మన్ ఒక బిజెపి సభ్యుడు అని, ఆలయాలు, ఇళ్లను నేలమట్టం చేయాలన్న ప్రతిపాదన ఆయన చేసినవేనని పేర్కొన్నారు. చైర్మన్ సమక్షంలోనే ఆ శివాలయాన్ని ధ్వంసం చేశారని, ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈ కూల్చివేతలను ఆపేయాలని కోరుతున్నప్పటికీ వారు ఆపలేదని తెలిపారు. అంతేకాదు, న్యాయపరమైన చిక్కులేమీ లేకుంటే తాము ఆ ఆలయాన్ని పునర్నిర్మిస్తామని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News