మనతెలంగాణ/ హైదరాబాద్: నగర శివారు మున్సిపాలిటీల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. సోమవారం జిల్లా టాస్క్‌ఫోర్స్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఎ) సంయుక్తంగా మణికొండ, తూంకుంట మున్సిపాలిటీల పరిధిలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలు, సీజ్ చర్యలు చేపట్టారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాల్‌గూడ సర్వే నంబర్ 115లో ఎలాంటి అనుమతులు లేకుండా స్లిట్ + ఐదు అంతస్తుల భవనం స్లాబ్ లను టాస్క్ ఫోర్స్ సిబ్బంది తొలగించారు. నెక్నాంపూర్‌లో 277 చదరపు గజాల స్థలంలో అక్రమంగా నిర్మించిన గ్రౌండ్ + ఐదు అంతస్తుల (జి+5) భవనంతో పాటు 250 చదరపు గజాల స్థలానికి గ్రౌండ్ + రెండు అంతస్తులకు అనుమతిని తీసుకుని దానిపై అక్రమంగా మరో మూడు అంతస్తులు, పెంట్ హౌస్ నిర్మాణాలు ఉన్న భవనం పైఅంతస్తుల స్లాబ్ లను టాస్క్ ఫోర్స్ కూల్చివేసింది. తూంకుంట మున్సిపాలిటీ పరిధిలో ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారం సంస్థ ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన క్లబ్ హౌస్, ఫామ్‌హౌస్‌లను జిల్లా టాస్క్‌ఫోర్స్ అధికారులు సోమవారం సీజ్ చేశారు. ఇప్పటి వరకు జిల్లా టాస్క్‌ఫోర్స్, హెచ్‌ఎండిఎ అధికారులు 119 అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకున్నారు.