Saturday, December 21, 2024

శ్యామల చెరువులో అక్రమ నిర్మాణాల కూల్చివేత

- Advertisement -
- Advertisement -

హసన్‌పర్తి: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ పరిధిలోని 55వ డివిజన్ భీమారం గ్రామంలోని శ్యామల చెరువులో ప్రభుత్వ చెరువు శిఖం లోపల అక్రమంగా నిర్మాణం చేసిన ప్రహరీ , ఇళ్లను మున్సిపాలిటీ అధికారులు గురువారం కూల్చివేత ప్రారంభించారు. మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు తమ సిబ్బంది, ఇరిగేషన్, పోలీసు అధికారులతో కలిసి చెరువు లోపల అక్రమంగా నిర్మాణాలు చేసిన కట్టడాలను ఒక్కొక్కటిగా కూల్చివేతకు రంగం సిద్ధం చేసుకున్నారు. కొందరు వ్యక్తులు ఒక ఎకరం భూమిని కబ్జాచేసి అక్రమంగా బెడ్డు నిర్మాణం చేసిన దానిని మొదటగా మున్సిపల్ సిబ్బంది జేసీబీ సాయంతో కూలగొట్టే ప్రయత్నం చేయగా ఆ బెడ్డు జేసీబీతో సైతం కూలనంత గట్టిగా కాంక్రీట్ సిమెంటుతో నిర్మాణం చేశారు.

శ్యామల చెరువు శిఖం భూమికి పూర్తిస్థాయి శాశ్వత హద్దులు ఏర్పాటుచేయాలని పలుమార్లు భీమారం గ్రామస్థులు కలెక్టర్‌కు విన్నవించగా కలెక్టర్ ఆదేశాలతో మున్సిపల్ కమిషనర్ చర్యలు చేపట్టారు. నీటి పారుదల శాఖాధికారులు గత రెండు నెలల క్రితం శ్యామల చెరువు 67.22 గుంటల భూమిలో 30 ఎకరాలు కబ్జాకు గురైందని సర్వే నివేదికను కలెక్టర్‌కు అందచేశారు. చెరువు కట్టకు 100 ఫీట్ల బఫర్ జోన్ కలదు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు బఫర్ జోన్ ఆక్రమించి ప్రహరీ గోడ నిర్మాణాలు చేపట్టారు. నీటి పారుదల శాఖ సర్వే నివేదిక ఇచ్చారు. మూడు శాఖలు కలిసి ఈ ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టారు.

చెరువు శిఖంలో ఉన్న ప్రతీ నిర్మాణాన్ని కూల్చివేస్తామని మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు శ్రీనివాస్, రోజారెడ్డిలు తెలిపారు. చెరువు ఎఫ్‌టీఎల్ లోపల ఉన్న అక్రమ నిర్మాణాలను సంబంధిత వ్యక్తలకు నోటీసులు ఇచ్చి కూలగొడతామన్నారు. వీరి వెంట కాకతీయ యూనివర్సిటీ ఎస్సై సతీష్, పోలీసు సిబ్బంది, ఇరిగేషన్, మున్సిపల్ చైన్ మన్ అరుణ్, పలువురు గ్రామస్థులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News