ఆరు రోజుల్లో 82 నిర్మాణాలపై చర్యలు
66 కట్టడాల కూల్చివేత, 16సీజ్, హెచ్‌ఎండిఎ పరిధిలో అధికారుల కొరడా
మనతెలంగాణ/హైదరాబాద్ : హెచ్‌ఎండిఏ పరిధిలో ఆరు రోజులుగా అక్రమ నిర్మాణాల కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. అందులో భాగంగా శనివారం (ఆరోరోజు) నాలుగు మున్సిపాలిటీల పరిధిలో హెచ్‌ఎండిఏ, డిస్ట్రిక్ట్ టాస్క్‌ఫోర్స్ టీమ్‌ల ఆధ్వర్యంలో అక్రమ భవనాల కూల్చివేతను అధికారులు చేపట్టారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఎ) పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల పరిధిలో ఈ అక్రమ నిర్మాణాల కూల్చివేతలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి.
ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో (3) అక్రమ నిర్మాణాలు, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో (4), ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలో (2), నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో (13) అక్రమ నిర్మాణాలపై హెచ్‌ఎండిఎ, డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీమ్‌లు చర్యలు చేపట్టాయి. గత సోమవారం నుంచి అక్రమ నిర్మాణాలపై హెచ్‌ఎండిఎ, డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీమ్‌ల దాడుల పరంపర కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ ఆరు రోజుల్లో 82 అక్రమ నిర్మాణాలపై అధికారులు చర్యలు తీసుకున్నారు. వాటిలో 66 ఆక్రమ నిర్మాణాలను కూల్చివేయగా, మరో (16) అక్రమ నిర్మాణాలను అధికారులు సీజ్ చేశారు.శనివారం హెచ్‌ఎండిఏ, టాస్క్‌ఫోర్స్ యంత్రాంగం సీజ్ చేసిన వాటిల్లో ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలో ఒక రెడీమిక్స్ సిమెంట్ ప్లాంట్‌తో ఒక క్రషర్ ప్లాంట్ ఉన్నాయి. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో ఒక పెట్రోల్ బంక్ కూడా ఉంది.