కూల్చివేత నిర్వహణ సంస్థ ధీమా
నోయిడ: దేశ రాజధాని సమీపంలోని నోయిడలో సూపర్‌టెక్‌కు చెందిన ట్విన్ టవర్స్ నిర్మాణం ఒక ఇంజనీరింగ్ అద్భుతమైతే వాటి కూల్చివేత అంతకు మించిన ఇంజనీరింగ్ నైపుణ్యంగా పరిగణించాల్సి ఉంటుందని ఎడిఫైస్ ఇంజనీరింగ్ సంస్థ అధినేత ఉత్కర్ష్ మెహతా వ్యాఖ్యానించారు. ఈ నెల 28న దాదాపు 100 మీటర్ల ఎత్తైన ట్విన్ టవర్స్ కూల్చివేత బాధ్యతను ఎడిఫైస్ ఇంజనీరింగ్ సంస్థ నిర్వర్తించనున్నది. కేవలం 9 మీటర్ల దూరంలో ఉన్న ఇతర నివాస టవర్లకు ఎటువంటి ముప్పు వాటిల్లకుండా సురక్షితంగా ట్విన్ టవర్లను కూల్చివేసే అత్యంత క్లిష్టమైన బాధ్యతను ముంబైకు చెందిన ఎడిఫైస్ ఇంజనీరింగ్ దక్షిణాఫ్రికాకు చెందిన జెట్ డెమాలిషన్స్ భాగస్వామ్యంతో నిర్వర్తించనున్నది. ట్విన్ టవర్ల కూల్చివేత అత్యంత సురక్షితంగా జరుగుతుందని 150 శాతం నమ్ముతున్నామని మెహతా తెలిపారు.
అయితే సమీపంలోని భవనాలకు ఎటువంటి హాని జరగదని, కేవలం కొద్దిపాటి గోడలకు పగుళ్లు ఏర్పడే అవకాశం మాత్రం ఉన్నదని ఆయన తెలిపారు. కూల్చివేత సందర్భంగా ఇతర భవనాలకు ఎటువంటి నష్టం జరిగినా తమకు రూ. 100 కోట్ల బీమా ఉందని, అయితే దాన్ని క్లెయిమ్ చేసుకునే అవసరం రాదని భావిస్తున్నామని ఆయన చెప్పారు. 2020లో కేరళలోని కోచ్చిలో 18 నుంచి 20 అంతస్తులు ఉన్న నాలుగు ఆకాశ హర్మాలను సురక్షితంగా కూల్చివేసిన అనుభవం ఈ సంస్థలకు ఉంది. కాగా..నోయిడ ట్విన్ టవర్స్ కూల్చివేతను పురస్కరించుకుని వాటి సమీపంలోని ఎమరాల్డ్ కోర్ట్, ఎటిఎస్ విలేజ్‌కు చెందిన 5 వేల మందికి పైగా నివాసులను ఆదివారం ఉదయం 7 గంటల కల్లా అక్కడ నుంచి తరలించనున్నారు. దాదాపు 2,700 వాహనాలను అక్కడ నుంచి తొలగించనున్నారు. 150 నుంచి 200 వరకు నివాసులు తమ పెంపుడు జంతువులైన పిల్లులు, కుక్కలను కూడా అక్కడ నుంచి తరలించనున్నారు. ట్విన్ టవర్స్ కూల్చివేత కోసం 3,700 కిలోలకు పైగా పేలుడు సామగ్రిని ఉపయోగించనున్నారు.