Monday, January 20, 2025

కూల్చివేతలు ప్రతీకారం తీర్చుకునేవిగా ఉండొద్దు

- Advertisement -
- Advertisement -

Demolitions are not revenge: Supreme Court

యూపీ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిన సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తోన్న బుల్డోజర్ విధానంపై గురువారం సుప్రీం కోర్టు కీలక సూచనలు చేసింది. రాష్ట్రంలో కూల్చివేతలు చట్టానికి లోబడి ఉండాలని, అవి ప్రతీకారం తీర్చుకునేవిధంగా ఉండకూడదని స్పష్టం చేసింది. ఇటీవల ఆ రాష్ట్రంలో జరిగిన ఘర్షణల్లో భాగంగా నిందితుల ఇళ్లు కూల్చివేయడంపై పిటిషన్ దాఖలైంది. దానిపై వాదనలు విన్న సుప్రీం,ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అయితే ఈ ఇళ్ల కూల్చివేతలు నిలిపివేయాలని మాత్రం ఆదేశాలు ఇవ్వలేదు. చట్ట విరుద్ధంగా కట్టిన ఇళ్లని చెప్తూ కూల్చివేతకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ జమియత్ ఉలామా ఇ హింద్ సంస్థ సుప్రీంను ఆశ్రయించింది. చట్టబద్ధమైన ప్రక్రియకు విరుద్ధంగా కూల్చివేతలు జరగకుండా చూసేలా కోర్టు యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరింది. ముందస్తుగా నోటీసులు ఇవ్వాలి. ఇప్పుడు జరుగుతున్నది చట్టవిరుద్ధంగా ఉంది. ఒక వర్గాన్ని లక్షంగా చేసుకుని జరుపుతున్న దాడిలా ఉంది అంటూ పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. దీనిపై కోర్టు స్పందించింది. కూల్చివేత ప్రక్రియ చట్టానికి లోబడి మాత్రమే ఉండాలి.

అది ప్రతీకారం తీర్చుకునే విధంగా ఉండకూడదు. అయితే తాము కూల్చివేతలపై స్టే ఇవ్వలేము. చట్టం ప్రకారం వెళ్ల మని మాత్రమే చెప్పగలం అని వ్యాఖ్యానించింది. అలాగే దీనిపై యూపి ప్రభుత్వం మూడు రోజుల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. బీజేపీ నేతలు నుపుర్‌శర్మ , నవీన్ కుమార్ జిందాల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. అనంతరం వివిధ ప్రాంతాల్లో అల్లర్లు జరిగాయి. వాటిపై ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్ హింసాత్మక ఘటన వెనుక ప్రధాన నిందితుడిగా భావిస్తున్న జావేద్ అహ్మద్ నివాసాన్ని అక్రమ కట్టడంగా పేర్కొంటూ స్థానిక అధికారులు ఆదివారం దానిని కూల్చివేశారు. అనుమతి తీసుకోకుండా నిర్మించడంపై మే 10 న నోటీసు ఇచ్చి రెండు వారాల సమయం ఇచ్చామనీ, గడువు లోగా ఎలాంటి పత్రాలు సమర్పించక పోవడంతో కూల్చివేత చర్యలు చేపట్టామనీ అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News