Sunday, December 22, 2024

ఫీవర్.. టెర్రర్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో డెంగ్యూ విజృంభిస్తోంది. క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. జనవరి నుంచి ఇప్పటి వరకు వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం మొత్తం 5,372 డెంగీ కేసులు నమోదవడం చూస్తే భయాందోళనకు గురిచేస్తోంది. ప్రధానంగా పది జిల్లాల్లో డెంగ్యూ తీవ్రత ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. వాటిని హైరిస్క్ జిల్లాలుగా గుర్తించారు. వీటిలో హైదరాబాద్‌లో అత్యధికంగా 1, 852 డెంగీ కేసులు నమోదయ్యాయి. సూర్యాపేటలో 471, మేడ్చల్‌లో 426, ఖమ్మంలో 375, నల్లగొండలో 315,

నిజామాబాద్‌లో 286, రంగారెడ్డిలో 232, జగిత్యాలలో 185, సంగారెడ్డిలో 160, వరంగల్‌లో 110 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్రంలో డెంగీ, మలేరియా, చికున్‌గున్యా కేసుల వివరాలను రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయం సోమవారం విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 81,932 మందికి పరీక్షలు నిర్వహించగా, 6.5 శాతం డెంగ్యూ పాజిటివ్‌గా నమోదయ్యిందని తెలిపింది. కాగా లెక్కలోకి రాని డెంగీ కేసులు ఎక్కువగానే ఉన్నట్టు పరిస్థితిని తెలుస్తోంది. దోమల వ్యాప్తితో రోగాలు పెరుగుతున్నాయని, దోమ కాటుకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

కొనసాగుతున్న వైరల్ జ్వరాల విజృంభణ
రాష్ట్రంలో వైరల్ జ్వరాలు విజృంభణ కొనసాగుతోంది. నగరాలు, గ్రామాలు అనే తేడా లేకుండా దాదాపు ఇంట్లో జ్వర బాధితులు ఉంటున్నారు. వైద్యశాఖ లెక్కల ప్రకారం ఇప్పటివరకు 2,65,324 మంది జ్వర బాధితులున్నట్లు గుర్తించారు. ఈ ఏడాది జూలై 23 నుంచి ఈనెల 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా వైద్యశాఖ నిర్వహించిన ఇంటింటా సర్వేలో మొత్తం 1,42,78,723 గృహాలను సందర్శించి, మొత్తం 4,40,06,799 మందిని స్క్రీనింగ్ చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. అందులో 2,65,324 మంది జ్వర బాధితులున్నట్లు రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయం తెలిపింది. అలాగే చికెన్‌గున్యా కేసులు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి.

ఈ ఏడాది జనవరి నుంచి ఈనెల 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా 152 చికున్‌గున్యా కేసులు నమోదైనట్లు తెలిపింది. మొత్తం 2,673 మంది నమూనాలను పరీక్షించగా అందులో 5 శాతం చికెన్ గున్యా పాజిటివ్ కేసులు నమోదైనట్లు పేర్కొంది. రాష్ట్రంలో చికున్‌గున్యా హైరిస్క్‌లో ఉన్న జిల్లాల్లో జాబితాలో హైదరాబాద్, వనపర్తి, మహబూబ్‌నగర్ ఉన్నాయి. అదేవిధంగా ఈ ఏడాది జనవరి నుంచి ఈనెల 25 వరకు 191 మలేరియా కేసులు నమోదయ్యాయని ప్రజారోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం 23,19,283 మంది బాధితుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించగా, 0.008 శాతం మలేరియా పాజిటివ్‌గా నమోదైనట్లు తెలిపింది.

ఆసుపత్రులకు క్యూ కడుతున్న రోగులు
జర్వం, జలుబు, గొంతునొప్పి, దగ్గు, వాంతులు, విరేచనాలతో జనం ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ …ఏ హాస్పిటల్ చూసినా వైరల్ ఫీవర్ బాధితులతో కిక్కిరిసిపోతోంది. ప్రతి ఇంటి నుంచి ఒక్కరైనా వైరల్ ఫీవర్ బాధితులుంటున్నారు. వర్షాకాలం.. కొన్ని రోజులుగా వాతావరణం ముసురుగా ఉండటంతో విషజ్వరాల సంఖ్య భారీగా పెరిగిపోయింది. పది రోజులుగా పలు రకాల జ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఇక ఇన్ పేషెంట్‌గా చేరుతున్న వారి సంఖ్య రోజుకు 30 నుంచి 40 వరకు ఉంటోంది. వీరిలో ఎక్కువగా హెపటైటిస్, చికెన్ గున్యా, డెంగ్యూ, విషజర్వాల బాధితులు ఉంటున్నారు. ఫీవర్ హాస్పిటల్, ఉస్మానియా, గాంధీ, నీలోఫర్ హాస్పిటళ్లతోపాటు పీహెచ్‌సీలు, బస్తీ దవాఖానాలతో పాటు ప్రైవేట్ క్లినిక్‌లు, నర్సింగ్ హోమ్..

ఇలా ఎక్కడ చూసినా ఇప్పుడు వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న వారే కనిపిస్తున్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌తోపాటు జ్వర బాధితుల ఇంటి సమీపంలోని క్లినిక్‌లు, నర్సింగ్ హోమ్‌లు, ప్రైవేట్ హాస్పిటళ్లలోనూ చికిత్స తీసుకుంటున్నారు. ముఖ్యంగా పిల్లలు, మహిళలు, వృద్ధులు, గర్భిణులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అన్ని ఆసుపత్రులు, పిహెచ్‌సిలు, క్లినిక్స్‌లలో ఓపీలు కిటికిటలాడుతున్నాయి. ప్రతి హాస్పిటల్ రోజు ఉండే సాధారణ ఓపీ దాదాపు రెట్టింపు అయ్యింది. పెరిగిన ఓపీ మొత్తం కూడా వైరల్ ఫీవర్స్ బాధితులే ఎక్కువగా ఉంటున్నారని వైద్యులు చెబుతున్నారు. దగ్గు, జలుబు, గొంతునొప్పి, జ్వరం వంటి లక్షణాలు ఉంటే ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News