కంటి సర్జరీ కోసం 3 నెలలు బెయిల్ పొడిగింపు
బొంబాయి హైకోర్టు ఉత్తర్వులు
ముంబయి: ఎల్గార్ పరిషద్ మావోయిస్టు సంబంధాల కేసులో శాశ్వత మెడికల్ బెయిల్ కోరుతూ విప్లవ కవి వరవరరావు దాఖలు చేసిన పిటిషన్‌ను బొంబాయి హైకోర్టు బుధవారం తోసిపుచ్చింది. అయితే క్యాటరాక్ట్ ఆపరేషన్ చేసుకోవడానికి వీలు కల్పిస్తూ మూడు నెలలపాటు తాత్కాలిక బెయిల్‌ను పొడిగించింది. ఆ తర్వాత తలోజా జైలులో లొంగిపోవాలని జస్టిస్ ఎస్‌బి షుక్రె, జస్టిస్ జిఎ సనప్‌ల ధర్మాసనం 83 సంవత్సరాల వరవరరావును ఆదేశించింది. బెయిల్ కాలంలో తాను ముంబయిలో కాకుండా హైదరాబాద్‌లో ఉండేందుకు అనుమతించాలని కోరుతూ వరవరరావు చేసుకున్న దరఖాస్తును ధర్మాసనం కొట్టివేసింది.
నవీ ముంబయిలో ఉన్న తలోజా జైలులో వైద్య సౌకర్యాలు కొరవడ్డాయని, అక్కడ పరిశుభ్రత కూడా చాలా తక్కువగా ఉందని వరవరరావు తరఫు న్యాయవాది ఆనంద్ గ్రోవర్ చేసిన వాదనను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ధర్మాసనం తెలిపింది. తలోజా జైలుతోపాటు రాష్ట్రంలోని ఇతర జైళ్లలో వైద్య సదుపాయాల పరిస్థితిపై రహస్య నివేదికను సమర్పించాలని మహారాష్ట్ర డిజిపి(కారాగారాలు)ని హైకోర్టు ఆదేశించింది. ఈ ఏడాది ఏప్రిల్ 30లోగా ఈ నివేదికను తమకు సమర్పించాలని కోర్టు డిజిపిని ఆదేశించింది. ఎల్గార్ పరిషద్ కేసు విచారణను వేగవంతం చేయాలని, విచారణ ప్రక్రియను రోజువారీ నిర్వహించాలని ప్రత్యేక ఎన్‌ఐఎ కోర్టును కూడా హైకోర్టు ఆదేశించింది.