మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక అవసరాలు తీరకుండా అడ్డుపుల్లలు వేయడంలో కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ)లు పోటీలుపడుతున్నట్లుగా పరిస్థితులు ఉన్నాయనే విమర్శలున్నాయి. న్యాయంగా, చట్టబద్దంగా నిధులను సేకరించుకునే కార్యక్రమాలకు కూడా ఆర్‌బిఐ అడ్డంకులు సృష్టిస్తోందని, ఆర్ధికంగా తెలంగాణ రాష్ట్రాన్ని దెబ్బకొట్టడానికి కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బిఐలు కలిసికట్టుగా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నాయనే విషయం దేశవ్యాప్తంగా బహిర్గతమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్రాన్ని వేధించడమే పనిగా పెట్టుకొందని కొందరు సీనియర్ అధికారులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టుకొని ప్రతీ నెలలో కనీసం రెండు లేక మూడుసార్లు వేలంలో పాల్గొని నిధులను సమీకరించుకొంటాయి. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాలకున్న అప్పుల శాతాలను పరిగణనలోకి తీసుకొని ఆర్‌బిఆర్ ఏయే రాష్ట్రాలు బాండ్ల వేలంలో పాల్గొనవచ్చునో ఖరారు చేస్తూ ఒక వారం రోజులు ముందుగానే ప్రకటిస్తుంది.
అంతేగాక ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం ప్రకారం ఎక్కువగా అప్పులు చేసిన రాష్ట్రాలకు అనుమతులు ఇవ్వకుండా 20 శాతానికి లోబడి మాత్రమే అప్పులు చేసిన రాష్ట్రాలకే న్యాయంగా అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఆర్‌బిఐ 54 శాతం అప్పులు చేసి పీకల్లోతు ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిన రాష్ట్రాలకు కూడా సెక్యూరిటీ బాండ్ల వేలంలో పాల్గొనే అవకాశాలు ఇస్తూనే వస్తోందని ఆ అధికారులు వివరించారు. కానీ తెలంగాణ వంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఎంతో సమర్ధవంతంగా, ప్రజారంజకంగా పరిపాలన సాగిస్తున్న రాష్ట్రానికి మాత్రమే బాండ్ల వేలంలో పాల్గొనే అవకాశాలు ఇవ్వకపోవడం బాధగా ఉందని అంటున్నారు. కేవలం రాజకీయపరమైన వత్తిళ్ళకు తలొగ్గిన ఆర్‌బిఐ పెద్దలు తెలంగాణ రాష్ట్రానికి వరుసగా అన్యాయం చేస్తూనే ఉన్నారని అధికారవర్గాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.
ఎఫ్‌ఆర్‌బిఎం చట్టాన్ని ఉల్లంఘించి శక్తికి మించి, తమ తాహతుకు మించి అప్పులు చేసిన జమ్ముకాశ్మీర్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి అనేక రాష్ట్రాలకు ఇబ్బడి ముబ్బడిగా రుణాల సేకరణకు అనుమతులు ఇస్తూ వస్తున్న ఆర్‌బిఐ తెలంగాణ రాష్ట్రానికి మాత్రం అనుమతులు ఇవ్వడంలేదని, ఇది ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వ పెద్దలు రాజకీయంగా కక్షసాధించుకునే కార్యక్రమంలో భాగంగానే తెలంగాణకు అనుమతులు ఇవ్వడంలేదని వాదిస్తున్నారు. ఈనెల 14వ తేదీన నిర్వహించిన బాండ్ల వేలంలో కూడా తెలంగాణ రాష్ట్రానికి అనుమతులు ఇవ్వలేదని, అదే విధంగా మంగళవారం (21వ తేదీ) జరిగిన వేలంలో కూడా తెలంగాణ రాష్ట్రానికి అనుమతులు ఇవ్వలేదని వివరించారు. వాస్తవానికి పంజాబ్ రాష్ట్రం 54 శాతం అప్పులున్నాయని దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, కేరళ, కర్ణాటక, గుజరాత్ వంటి రాష్ట్రాలన్నీ 25 శాతానికి పైబడి గరిష్టంగా 45 శాతం వరకూ అప్పులు చేసి పీకల్లోతు కష్టాల్లో ఉన్నాయని తెలిపారు.
కానీ తెలంగాణ రాష్ట్రానికి కేవలం 23.8 శాతం మాత్రమే అప్పులున్నాయని, అతి తక్కువ అప్పులున్న రాష్ట్రంగా ఆర్‌బిఐ రికార్డులే స్పష్టం చేస్తున్నప్పటికీ సెక్యూరిటీ బాండ్ల వేలంలో పాల్గొనే అవకాశాలు ఇవ్వకపోవడం బాధాకరమని ఆ అధికారులు వివరించారు. మంగళవారం (21వ తేదీ) నాడు నిర్వహించిన సెక్యూరిటీ బాండ్ల వేలంలో ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, గుజరాత్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, సిక్కిం, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలన్నింటికీ కలిపి 19,237 కోట్ల రూపాయలను రుణాలుగా సేకరించుకునేందుకు అనుమతులు ఇవ్వడం, వేలం నిర్వహించి ఆయా రాష్ట్రాల ఖజానాకు ఆర్‌బిఐ తరలించింది కూడా. కానీ తెలంగాణ రాష్ట్రానికి ఈ ఫిబ్రవరి నెలలో వరుసగా అనుమతులు ఇవ్వకుండా ఆర్‌బిఐ సతాయిస్తూ వస్తోందని ఆ అధికారులు వివరించారు.
తెలంగాణ రాష్ట్రానికి 2022-23వ ఆర్ధిక సంవత్సరంలో 2.56 లక్షల కోట్ల రూపాయలను బడ్జెట్‌ను ప్రవేశపెట్టుకోగా అందులో సుమారు 54 వేల కోట్ల రూపాయల నిధులను న్యాయంగా, చట్టబద్దంగా సెక్యూరిటీ బాండ్ల వేలంలో పాల్గొని సేకరించుకొంటామని పేర్కొన్నామని, ఆ బడ్జెట్‌కు కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బిఐలకు పంపించి ఆమోదం పొందామని, కానీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే 2022-23 ఆర్ధిక సంవత్సరం ప్రారంభం నుంచే అంటే 2022 ఏప్రిల్ నెల నుంచే కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బిఐ లు తెలంగాణ రాష్ట్రాన్ని వేధించడమే పనిగా పెట్టుకొన్నాయని, అప్పట్నుంచి ఇప్పటి వరకూ బాండ్ల వేలంలో పాల్గొనకుండా అనేక అడ్డంకులు సృష్టిస్తూ వస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అడపా దడపా అనుమతులు ఇచ్చి పూర్తిస్థాయిలో నిధులను రాకుండా మొక్కుబడిగా కేవలం 19 వేల కోట్లకు పరిమితం చేశారని తెలిపారు. అందుకే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధులు కొరత ఏర్పడినప్పటికీ వెనుకంజ వేయకుండా, నిరాశను లోనుకాకుండా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఆర్ధిక సంస్కరణలు, ఆదాయ సముపార్జనకు అనుసరించిన ప్రత్యామ్నాయ మార్గాలు సత్ఫలితాలు ఇవ్వడంతోనే ప్రభుత్వం విజయవంతంగా ముందుకు సాగుతోందని వివరించారు.
వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను అవసరమైన నిధులు, ప్రభుత్వ పాలనాపరమైన ఖర్చులు, పెన్షనర్లు, ఉద్యోగులకు జీతభత్యాలకు ఇలా అన్ని రకాల ఖర్చులకు నెలకు సగటున సుమారు 16 వేల కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయని, రాష్ట్ర ప్రభుత్వం సొంత ఆదాయ మార్గాల నుంచి నెలకు సగటున 12 వేల కోట్ల రూపాయల నిధులు ఖజానాకు వస్తాయని, మిగిలిన నాలుగు వేల కోట్ల రూపాయల లోటును సెక్యూరిటీ బాండ్ల వేలం నుంచిగానీ, ఇతరత్రా ఆదాయ మార్గాల నుంచి నిధులను సేకరించుకొంటామని వివరించారు. ఇలా కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బిఐలు పనిగట్టుకొని తెలంగాణ రాష్ట్రానికి రుణాలను సేకరించుకునేందుకు అనుమతులు ఇవ్వకుండా అడ్డుతగులుతున్నాయని వివరించారు.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బిఐలు పద్దతిని మార్చుకొని పట్టుదలలకు పోకుండా తెలంగాణ రాష్ట్రానికి సహకరించాలని కోరారు. అంతేగాక తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంతో చైతన్యవంతులని, రాష్ట్రాన్ని ఆర్ధికంగా దెబ్బకొట్టడానికి కేంద్రం అనుసరిస్తున్న తప్పుడు మార్గాలన్నింటినీ అర్ధంచేసుకొన్నారని, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి తగిన గుణపాఠం చెప్పడానికి తెలంగాణ ప్రజలు సమయం కోసం ఎదురు చూస్తున్నారని ఆ అధికారులు వివరించారు. కాకుంటే ఆ జాతీయపార్టీకి తెలంగాణ ప్రజల నాడి అర్ధంకావడంలేదని, అందుకే తాము చేస్తున్న అన్యాయాలు తెలంగాణ ప్రజలకు అర్ధంకావనే ధోరణితో ఆ జాతీయపార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్ధికంగా దెబ్బకొట్టడానికి కేంద్రం చేస్తున్న కుట్రలన్నీ హైదరాబాద్ నుంచి గ్రామీణ ప్రాంతాల్లో రచ్చబండల వరకూ తెలిసిపోయాయని ఆ అధికారులు వివరించారు.