Wednesday, January 22, 2025

దా’రుణ’ కక్ష

- Advertisement -
- Advertisement -

తెలంగాణపై పరాకాష్ఠకు చేరిన కేంద్రం వివక్ష

రూ.3వేల కోట్ల అప్పు కోసం సెక్యూరిటీ బాండ్ల వేలంలో పాల్గొనడానికి అనుమతి నిరాకరణ

మే 31న ఆర్‌బిఐలో జరగనున్న
సెక్యూరిటీ బాండ్ల వేలం
పాల్గొనడానికి ఎపి, గోవా, గుజరాత్, హర్యానా, కేరళ, మహారాష్ట్ర,
మణిపూర్, మేఘాలయ,
తమిళనాడు, బెంగాల్‌కు అనుమతి
అన్నింటా అభివృద్ధి పథంలో
దూసుకుపోతూ కేంద్రం ప్రశంసలు
అందుకుంటున్న తెలంగాణకు
అనుమతి నిరాకరణ రాజకీయ
కక్షతో ప్రజల ముందు టిఆర్‌ఎస్‌ను
దెబ్బతీయడానికే అనుమతి
నిరాకరించినట్లు భావిస్తున్న రాష్ట్ర
ఆర్థిక శాఖ వర్గాలు లక్షల కోట్లల్లో
అప్పులు చేస్తున్న కేంద్రం
తెలంగాణను అడ్డుకోవడం పట్ల
పరిశీలకుల దిగ్భ్రాంతి

మన తెలంగాణ/హైదరాబాద్ : రాజకీయపరమైన కక్షసాధింపుల్లో భాగంగానే తెలంగాణపై కేంద్రం విషం కక్కుతుందనే విమర్శలు తారస్థాయిలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆర్థ్ధిక మూలాలపైన దెబ్బకొట్టి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు కాకుండా, ప్రభుత్వ పాలన సజావుగా సాగకుండా చేస్తే ప్రజల్లో టిఆర్‌ఎస్ పార్టీకి చెడ్డపేరు వస్తుందనే కుటిల ఎత్తుగడలతోనే కేంద్రంలోని బిజెపి అడ్డగోలుగా వ్యవహరిస్తోందని మరోసారి రుజువు అయిందని రాష్ట్ర ఆర్థిక శాఖ వర్గాలు విమర్శిస్తున్నాయి. నిన్న, మొన్నటివరకూ ఇలాంటి విమర్శలను రాజకీయ నాయకులు చేసేవారని, కేంద్రం వ్యవహరిస్తున్న తీరును తాము ప్రత్యక్షంగా చూస్తున్నాం గనుక అలాంటి విమర్శలు వస్తోందని కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ఈనెల 31వ తేదీన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ)లో జరగాల్సిన సెక్యూరిటీ బాండ్ల వేలంలో రూ.3వేల కోట్లను అర్జించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాల్గొనాల్సి ఉండగా, అందుకు ఆర్‌బిఐ అనుమతి నిరాకరించింది. ఆర్థ్ధిక నిర్వహణలో, ప్రభుత్వ పాలనలో, ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం అమలులో, నిధుల సేకరణలో, అభివృద్ధి- సంక్షేమ కార్యక్రమాల అమలు, వాటికి నిధులను వెచ్చిస్తున్న విధానాల పరంగా రాష్ట్రాన్ని కీర్తించిన ఆర్‌బిఐ నేడు తెలంగాణను ఆర్థ్ధికంగా ఇబ్బందుల్లో పడేసే విధంగా వ్యవహరించడానికి ముమ్మాటికీ రాజకీయపరమైన ఒత్తిళ్లే కారణమని వారు అభిప్రాయపడుతున్నారు.

మునుపెన్నడూ లేనివిధంగా ఆర్‌బిఐ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి తెలంగాణ ప్రభుత్వం సెక్యూరిటీ బాండ్ల వేలంలో పాల్గొనేందుకు అనుమతించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఆర్థ్ధిక నిర్వహణలోగానీ, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో గానీ అట్టడుగుస్థానాల్లో ఉన్న రాష్ట్రాలకు సెక్యూరిటీ బాండ్ల వేలంలో పాల్గొనేందుకు అనుమతులు ఇచ్చిన ఆర్.బి.ఐ. తెలంగాణ రాష్ట్రానికి అవకాశం ఇవ్వకపోవడం ముమ్మాటికీ వేధించడమేనని అంటున్నారు. 2021-22వ ఆర్ధిక సంవత్సరానికి అసెంబ్లీలో మంత్రి టి.హరీష్ రావు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోనే ఏయే అభివృద్ధి పథకాలకు ఎన్నెన్ని నిధులు కేటాయించాము, ఏయే సంక్షేమ పథకాలకు ఎలాంటి కేటాయింపులు జరిపామనే అంశాలను బహిరంగపరిచామని, అవన్నీ స్పష్టంగా తెలిసిన ఆర్.బి.ఐ. గడచిన ఏడేళ్ళుగా నిధులకు ఎలాంటి అడ్డంకులు సృష్టించలేదని, ఆ పథకాలకు ఉన్నపళంగా నిధులను నిలిపివేస్తే తెలంగాణ ప్రభుత్వానికి ఆర్ధిక ఇబ్బందులు ఉంటాయని తెలిసినప్పటికీ ఆర్.బి.ఐ. అడుగడుగునా అకారణంగా అడ్డుపుల్లలు వేయడం శోచనీయమని వ్యాఖ్యానిస్తున్నారు.

నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలకు, ఇతర అభివృద్ధి- సంక్షేమ పథకాలకు ఈ ఏడాది సుమారు 53,970 కోట్ల రూపాయల నిధులను అప్పుల రూపంలో సమీకరించుకొంటామని బడ్జెట్‌లోనే స్పష్టంచేశామని, అయినప్పటికీ ఆర్.బి.ఐ.ఇలా అడుగడుగునా అడ్డుపడటం దారుణమని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈనెల 31వ తేదీన సెక్యూరిటీ బాండ్ల వేలంలో పాల్గొనేందుకు 11 రాష్ట్రాలకు అనుమతించిన ఆర్.బి.ఐ.తెలంగాణ రాష్ట్రానికి అనుమతించలేదు. ఆంధ్రప్రదేశ్, గోవా, గుజరాత్, హర్యానా, కేరళ, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, రాజస్థాన్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలకు ఆర్.బి.ఐ. వేలంలో పాల్గొనేందుకు అనుమతులు ఇచ్చింది. ఈ 11 రాష్ట్రాలన్నీ కలిపి 21,450 కోట్ల రూపాయల రుణాల సమీకరణకు సెక్యూరిటీ బాండ్లు వేలానికి పెడుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయంగా బహుళ ప్రాచుర్యం పొందిన తెలంగాణ రాష్ట్రంలోని అభివృద్ధి, సంక్షేమ పథకాలను నీరుగార్చేందుకే కేంద్రంలోని బి.జే.పి. ప్రభుత్వం వెంటాడి వేటాడి వేధింపులకు గురిచేస్తున్నట్లుగానే ఉందని వారు మండిపడుతున్నారు.

ప్రపంచంలో అప్పులు చేయని దేశమే లేదని, చివరకు అగ్రరాజ్యమని చెప్పుకొంటున్న అమెరికాకు ట్రిలియన్ డాలర్లలో అప్పులున్నాయని, మన దేశం కూడా లక్షల కోట్లల్లో అప్పులు చేసిందని, దేశంలోని ప్రతి రాష్ట్రమూ అప్పులు చేస్తూనే ఉన్నాయని, ఇలా వాస్తవ పరిస్థితిని పక్కనబెట్టి ఒక్క తెలంగాణ రాష్ట్రమే అప్పులు చేయకూడదని షరతులు పెడితే ఎలా? అని ఆ అధికారులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన నేరమేమిటి?, టి.ఆర్.ఎస్.పార్టీపై కోపముంటే దాన్ని రాజకీయంగా పరిష్కరించుకోవాలిగానీ ఇలా ప్రభుత్వంపై పగపెంచుకుంటే కోట్లాది మంది తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం, ఆర్.బి.ఐ.లు గ్రహించకపోవడం దురదృష్టకరమని తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇకనైనా ఆర్.బి.ఐ.గానీ పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్, ఆర్.ఈ.సి. వంటి ఆర్ధిక సంస్థలు ఎలాంటి రాజకీయపరమైన వత్తిళ్ళకు లొంగకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ముందుగా చేసుకొన్న ఒప్పందాల ప్రకారం రుణాలు ఇవ్వాలని ఆ సీనియర్ అధికారులు ప్రాధేయపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News