సిటీబ్యూరో : డెంటిస్ట్ వైశాలి కిడ్నాప్ కేసులో శనివారం పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటి వరకు వైద్యురాలిని వివాహం చేసుకునేందుకు కిడ్నాప్ చేసినట్లు అందరూ భావిస్తుండగా తాము ఇదివరకే పెళ్లి చేసుకున్నట్లు నవీన్ రెడ్డి చెప్పడంతో ఒక్కసారిగా కేసు మరో మలుపు తిరిగింది. కిడ్నాపర్ల నుంచి బయటపడిన యువతి తాను నవీన్‌రెడ్డిని వివాహం చేసుకోలేదని, తాము స్నేహితులమని, ప్రేమించుకోలేదని స్పష్టం చేసింది. కానీ నవీన్‌రెడ్డి తల్లి నారాయణమ్మ వాళ్లిద్దరు ప్రేమించుకున్నారని, వివాహం చేసుకుంనేందుకు సిద్ధమయ్యారని తెలిపింది. ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్నెగూడ యువతి కిడ్నాప్ కేసులో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డితోపాటు అతడికి సహకరించిన 31మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుంచి కిడ్నాప్‌కు ఉపయోగించిన రెండు కార్లు, సిసి కెమెరాలు, నిందితులు వాడిని ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డెంటల్ డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో 32 మందిని అరెస్టు చేసినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. అరెస్టు చేసిన నిందితులను రిమాండ్‌కు తరలించామని, మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామని, కొందరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని తెలిపారు. ఆరు గంటల్లోనే యువతిని రక్షించామని తెలిపారు. నిందితులపై గతంలో కేసులు ఉంటే పిడి యాక్ట్ పెడతామని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా నిందితులను త్వరగా శిక్షపడేలా చూస్తామని తెలిపారు.
నాగారం భానుప్రకాష్, రాథోడ్ సాయినాథ్, ఎన్. కార్తీక్, ప్రసాద్, హరి, ఆర్ అవినాష్, రాజు, సోను కుమార్ పాశ్వాన్, మహ్మద్ ఇర్ఫాన్, నీలేష్‌కుమార్ యాదవ్, బిట్టుకుమార్ పాశ్వాన్, నిఖిల్, అనిల్, మహేష్‌కుమార్ యాదవ్, మహ్మద్ రిజ్వాన్, జావేద్ హుస్సేన్, మహ్మద్ ఇక్బాల్, సతీష్, బిశ్‌జిత్, యోగిందర్, గోపిచంద్, యశ్వంత్‌రెడ్డి, మహేష్, మణిదీప్, సిద్దూ, శివరాల రామేష్, మలిగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, జాదవ్ రాజేందర్, మేరసాని సాయినాథ్, దామెరగడ్డ శశికిరణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులపై 147, 148, 307, 324, 363, 427, 506, 452, 380రెడ్ విత్ 149 ఐపిసి కింద కేసులు నమోదు చేశారు. దాడిలో దాదాపుగా 40 మంది వరకు పాల్గొన్నారని పోలీసుల విచారణలో తెలిసింది. మిగతా వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
దాడికి ముందు మందు పార్టీ…
డెంటల్ డాక్టర్ వైశాలి ఇంటిపై దాడి చేసే ముందు నవీన్‌రెడ్డి అందరిని మందు పార్టీ పేరుతో తన ఆఫీసుకు పిలిపించుకున్నాడు. టీ స్టాల్‌లో పనిచేసే సిబ్బందితోపాటు బీహార్‌కు చెందిన 9 మంది, అస్సాంకు చెందిన ఒకరిని పిలిపించుకున్నాడు. వచ్చిన వారికి మద్యం ఏర్పాటు చేశాడు, మద్యం తాగిన తర్వాత వారందరినీ కారులో వైశాలి ఇంటికి తీసుకుని వెళ్లి దాడి చేశాడు. కిడ్నాప్ చేసిన తర్వాత అందరూ వివిధ మార్గాల్లో అక్కడి నుంచి పారిపోయారు.
హిందూ సంప్రదాయం ప్రకారం మా పెళ్లి జరిగింది : నవీన్‌రెడ్డి
హిందూ సంప్రదాయం ప్రకారం వైశాలితో తన వివాహం 2021, ఆగస్టు 4వ తేదీన బాపట్ల జిల్లా వలపర్ల దేవాలయంలో జరిగిందని నవీన్ రెడ్డి పోలీసులకు తెలిపారు. బిడిఎస్ పూర్తయ్యేవరకు తమ పెళ్లి ఫొటోలు బయటకు రావద్దని వైశాలి కండీషన్ పెట్టిందని తెలిపాడు. వైశాలి కుటుంబ సభ్యులు తనతో డబ్బులు ఖర్చు పెట్టించారని ఆరోపించాడు. వైశాలి తల్లిదండ్రులు బిడిఎస్ పూర్తయిన తర్వాత వివాహం చేస్తానని మాట ఇచ్చి తప్పారని ఆరోపించారు. నా డబ్బులతో వైశాలి కుటుంబ సభ్యులను వైజాగ్, అరకు, వంజంగి, కూర్గ్, మంగళూరు, గోకర్ణా, గోవాకు తీసుకుని వెళ్లాలనని తెలిపాడు. వైశాలి పేరు మీదు వోల్వో కారు తీసుకున్నానని, దామోదర్ రెడ్డి పేరు మీద రెండు కాఫీ షాపులను రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినట్లు తెలిపాడు.
నా కొడుకు చేసింది తప్పే : నవీన్‌రెడ్డి తల్లి
తన కుమారుడు అమ్మాయిని కిడ్నాప్ చేయడం తప్పేనని న వీన్ రెడ్డి తల్లి నారాయణమ్మ తెలిపారు. నా కుమారుడు ఎంతో కష్టపడి జీవితంలో పైకి వచ్చాడని, వైశాలి తన కు మారుడు రెండేళ్ల నుంచి స్నేహంగా ఉన్నారని తెలిపింది. వైశాలి చాలాసార్లు మా ఇంటికి వచ్చిందని, కరోనా సమయంలో ఆమెను తన కుమారుడు కారులో కాలేజీలో దింపేవాడని చెప్పింది. వైశాలిని వివాహం చేసుకుంటానని నవీన్ చెప్పేవాడని తెలిపింది. తన వ్యాపారానికి సంబంధింని డ బ్బులు కూడా వైశాలి తండ్రి దామోదర్ రెడ్డికి ఇచ్చేవాడని తెలిపింది. కిడ్నాప్ విషయం తెలియడంతో నవీన్‌రెడ్డి తండ్రి కోటి రెడ్డి అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. తల్లి నారాయణ మ్మ కూడా ఆహా రం తీసుకోకపోవడంతో ఇంటి వద్దే కుటుంబ సభ్యులు చికిత్స చేయిస్తున్నారు.