పుదుచ్చేరి : ప్రతిష్టాత్మకమైన దేవ్‌ధర్ ట్రోఫీ వన్డే టోర్నమెంట్‌లో సౌత్‌జోన్ టీమ్ ఫైనల్‌కు చేరుకుంది. మంగళవారం జరిగిన ఐదో, చివరి లీగ్ మ్యాచ్‌లో సౌత్‌జోన్ ఏడు వికెట్ల తేడాతో సెంట్రల్ జోన్‌ను ఓడించింది. సౌత్‌కు ఇది వరుసగా ఐదో విజయం కావడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన సెంట్రల్ జోన్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. యశ్ దూబే ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. మిగతా వారిలో ఓపెనర్ శివమ్ చౌదరి (34), ఉపేంద్ర యాదవ్ (27), రింకు సింగ్ (26) పరుగులు చేశారు.
చివర్లో శివమ్ మావి 3 ఫోర్లు, మూడు సిక్సర్లతో వేగంగా 29 పరుగులు సాధించాడు. దీంతో సెంట్రల్ స్కోరు 261 పరుగులకు చేరింది. తర్వా త బ్యాటింగ్‌కు దిగిన సౌత్‌జోన్ 48.2 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. వన్‌డౌన్‌లో వచ్చిన సాయి సుదర్శన్ అజేయ శతకంతో జట్టును గెలిపించాడు. సెంట్రల్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న సుదర్శన్ 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో అజేయంగా 132 పరుగులు చేశాడు. అతనికి రోహిత్ రాయుడు (37), వాషింగ్టన్ సుందర్ 43 (నాటౌట్) అండగా నిలిచారు.
తుది పోరుకు ఈస్ట్‌జోన్
మరోవైపు ఈస్ట్‌జోన్ కూడా ఫైనల్‌కు దూసుకెళ్లిం ది. మంగళవారం వెస్ట్‌జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈస్ట్‌జోన్ 157 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఈస్ట్‌కు ఫైనల్ బెర్త్ సొంతమైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఈస్ట్‌జోన్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిమాన్యు ఈశ్వరన్ (38), ఉత్క్రష్ సింగ్ (50) శుభారంభం అందించారు. విరాట్ సింగ్ (42) పరుగులు చేశాడు.
ఇక రియాన్ పరాగ్ విధ్వంసక శతకంతో అలరించాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లను హడలెత్తించిన రియాన్ 68 బంతుల్లోనే ఐదు సిక్సర్లు, ఆరు బౌండరీలతో అజేయంగా 102 పరుగులు చేశా డు. వికెట్ కీపర్ కుమార్ కుశగ్రా (53) తనవంతు పాత్ర పోషించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వెస్ట్‌జోన్ 34 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలింది. ఈస్ట్ బౌలర్లలో మణిశంకర్ ఐదు, ఉత్క్రష్ సింగ్ మూడు వికెట్లు తీశారు. ఇక గురువారం జరిగే ఫైనల్లో సౌత్‌జోన్‌తో ఈస్ట్ తలపడుతుంది.