డియోఘర్ (ఝార్ఖండ్): ఝార్ఖండ్ లోని ప్రఖ్యాత త్రికూట పర్వతాల్లో రోప్‌వే మార్గంలో సంభవించిన ప్రమాదంలో మరో అపశ్రుతి చోటుచేసుకుంది. సహాయక చర్యల్లో భాగంగా మంగళవారం ఓ మహిళ కిందపడి మృతి చెందింది. మృతురాలు 60 ఏళ్ల శోభాదేవిగా గుర్తించినట్టు డియోఘర్ సివిల్ సర్జన్ సికె షాహీ చెప్పారు. దాంతో మృతుల సంఖ్య మూడుకు చేరిందని అదనపు డిజిపి ఆర్‌కె మాలిక్ చెప్పారు. ఈ రోప్‌వే కారుల్లో చిక్కుకుపోయిన వారిని దాదాపు 45 గంటల పాటు శ్రమించి సురక్షితంగా తీసుకువచ్చే ప్రక్రియ మంగళవారం మధ్యాహ్నంతో ముగిసింది.
కేబిల్ కార్‌లో ఉన్న 15 మందిని మంగళవారం రక్షించారు. వైమానిక దళం, ఆర్మీ, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ కలిసి చేపట్టిన ఈ ఆపరేషన్‌లో 40 మందికి పైగా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడిన 12 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రిస్కూ చేసిన వారిని ఆస్పత్రికి తరలించారు. రోప్‌వే ఘటనపై సీఎం హేమంత్ సోరెన్ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు గవర్నర్ రమేశ్ బయీస్ తీవ్ర సంతాపం తెలిపారు. ఈ త్రికూట పర్వతం రోప్‌వే 766 మీటర్ల పొడవుతో దేశం లోనే అత్యంత ఎత్తులో ఉందని ఝార్ఖండ్ పర్యాటక విభాగం వెల్లడించింది.