అసలు పేర్లు ఉపయోగించ వద్దు
సురక్షితమైన అన్‌లైన్ గేమింగ్‌పై విద్యాశాఖ గైడ్‌లైన్స్
న్యూఢిల్లీ: కరోనా విజృంభణ కారణంగా పాఠశాలలు మూతపడ్డం, ఆన్‌లైన్ తరగతుల కారణంగా పిల్లలు మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్‌ను ఉపయోగించడం పెరిగిపోయిన విషయం తెలిసిందే. ఫలితంగా చాలా మంది పిల్లలు ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసలగా మారిపోతున్నారు. దీనిపై అటు తల్లిదండ్రులు, ఇటు ఉపాధ్యాయులతో పాటుగా మానసిక వైద్యులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో సురక్షితమైన ఆన్‌లైన్ గేమ్స్‌పై కేంద్ర విద్యాశాఖ ఏవి చేయవచ్చో, ఏవి చేయకూడదో తెలియజేస్తూ ఒక అడ్వైజరీని విడుదల చేసింది. తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఇన్ గేమ్ పర్చేజ్‌లను అనుమతించవద్దని, సబ్‌స్క్రిప్షన్ల కోసం యాప్‌లపై క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల రిజిస్ట్రేషన్‌లు జరపవద్దని, తమ అసలు పేర్లను వెల్లడించకుండా ఉండడం కోసం స్క్రీన్ నేమ్(అవతార్)లను ఉపయోగించడం, పిల్లలు ఏ తరహా ఆన్‌లైన్ గేమ్స్‌ను యాక్సెస్ చేయడానికి అవకాశం ఉందో మానిటరింగ్ చేయడం, లాగింగ్, కంటెంట్‌ను కంట్రోల్ చేయగల ఫీచర్లతో కూడిన ఇంటర్నెట్ గేట్‌వేలను ఇన్‌స్టాల్ చేసుకోవడం లాంటివి చేయాలని మంత్రిత్వ శాఖ ఆ గైడ్‌లైన్స్‌లో తెలియజేసింది.
విపరీతమైన ఆన్‌లైన్ గేమింగ్ కారణంగా పిల్లల్లో మానసికంగా, శారీరకంగా కలిగే దుష్ప్రభావాలనుంచి వారిని కాపాడేందుకు వీలుగా ‘పిల్లల సురక్షితమైన ఆన్‌లైన్ గేమింగ్’పైన మంత్రిత్వ శాఖ తల్లిదండ్రులు, టీచర్లకు వివిధ సూత్రాలను తెలియజేస్తూ ఈ గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది. అన్‌నోన్ వెబ్‌సైట్లనుంచి సాఫ్ట్‌వేర్, గేమ్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవద్దని పిల్లలకు చెప్పాలి. వెబ్‌సైట్లలో కనిపించే అనవసరమైన లింక్‌లు, ఇమేజ్‌లు, పాప్‌అప్‌లను క్లిక్ చేయవద్దని కూడా వారికిగట్టిగా చెప్పాలి. ఎందుకంటే వాటిలో వైరస్ ఉండవచ్చని, ఫలితంగా కంప్యూటర్లకు హాని చేయవచ్చని, అలాగే వారి వయసుకు తగని కంటెంట్ కూడా వాటిలో ఉండవచ్చని ఆ అడ్వైజరీ పేర్కొంది.