మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఫలితాలు సోమవారం (జూన్ 27) విడుదల చేస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొన్నప్పటికీ, దీనిపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. టెట్ ఫలితాలు సోమవారం వెల్లడిస్తారా..? లేదా అని టీచర్ అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. అయితే ఫలితాల తేదీపై అధికారులు గోప్యత పాటిస్తున్నారు. ఐదు సంవత్సరాల తర్వాత పరీక్ష జరగడం వల్ల అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పరీక్షకు హాజరయ్యారు. ఈ నెల 12వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 2,683 పరీక్షా కేంద్రాలలో జరిగిన టెట్ పరీక్షకు 90 శాతానికిపైగా హాజరు నమోదైంది. పేపర్-1కు బి.ఇడి, డి.ఇడి అభ్యర్థులు.. పేపర్ 2కు బీఈడీ అభ్యర్థులు పోటీపడ్డారు. పేపర్ 1కు 3,18,506 హాజరు కాగా, పేపర్ 2కు 2,51,070 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇటీవల టెట్ ప్రాథమిక కీ ని విడుదల చేయగా, అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చాయి. ఈసారి టెట్ ఫలితాలతో పాటే తుది కీ ని విడుదల చేయనున్నారు. తాజా నిబంధనల ప్రకారం టెట్ ఉత్తీర్ణత.. జీవితకాలం వర్తిస్తుంది.