Tuesday, November 5, 2024

రూ.5లక్షల వరకు సురక్షితం

- Advertisement -
- Advertisement -

Depositors to Get 5 lakh in 90 Days if Bank Under Moratorium

బ్యాంక్ దివాలా తీసినా సురక్షితంగా కస్టమర్ల సొమ్ము
90 రోజుల్లో డబ్బు పొందొచ్చు
డిఐసిజిసి చట్టంలో సవరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం

బ్యాంక్ డిపాజిటర్లకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. కస్టమర్ల సొమ్ముకు భద్రత కల్పిస్తూ డిఐసిజిసి(డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్) చట్టంలో సవరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ఆమోదం పొందడం వల్ల బ్యాంకు మూసివేతకు గురయితే వినియోగదారుల సొమ్ము రూ.5 లక్షల వరకు సురక్షితంగా ఉంటుంది. డిపాజిటర్లు ఈ మొత్తాన్ని 90 రోజుల్లో పొందొచ్చు. ప్రస్తుతం బ్యాంకు కస్టమర్లకు రూ.1 లక్ష మాత్రమే తిరిగి పొందే హామీ ఉంది.

న్యూఢిల్లీ : డిఐసిజిసి చట్టంలో సవరణతో 90 రోజుల్లో బ్యాంకు ఖాతాదారులు తమ రూ.5 లక్షల బీమా పొందుతారు. మారటోరియం ఆంక్షలు ఎదుర్కొంటున్న బ్యాంకులకు నగదు అందుబాటులోకి వచ్చేందుకు ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) ఆయా బ్యాంకులను నిధులను అందించేంత వరకు వేచిచూడాల్సిన అవసరం ఉండేది. అయితే తాజా నిర్ణయంతో వినియోగదారులకు ఎక్కువ కాలం వేచిచూడాల్సిన అవసరం ఉండదు. కెబినేట్ సమావేశం తర్వాత కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, బ్యాంకుపై మారటోరియం (తాత్కాలిక నిషేధం) ఉన్నా కూడా డిపాజిటర్లు 90 రోజుల్లో డిపాజిట్ బీమా మొత్తాన్ని పొందుతారని అన్నారు.

కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ, బ్యాంకులపై ఆర్‌బిఐ మారటోరియం విధించిన తర్వాత సమస్యలు ఎదుర్కొనే కస్టమర్ల కోసం డిఐసిజిసి అనే సంస్థ ఉందని తెలిపారు. బ్యాంకు మూసివేతకు గురయితే డిపాజిటర్లు 90 రోజుల్లో నగదు పొందవచ్చని అన్నారు. 2020లోనే డిపాజిట్ బీమా పరిమితిని 5 రెట్లు పెంచాలని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పుడు ఈ నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనికి పార్లమెంటు అనుమతి పొందాల్సి ఉంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెడతామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2020లో పంజాబ్, మహారాష్ట్ర కో-ఆపరేటివ్ (పిఎంసి) బ్యాంక్ మునిగిపోవడంతో డిపాజిటర్లు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఉదంతం తరువాత డిపాజిట్ బీమాను పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. కేంద్ర బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ 1961 డిఐసిజిసి చట్టంలో సవరణలను ప్రకటించారు, కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా బడ్జెట్ సెషన్ వాయిదా పడింది.

పిఎంసి, లక్ష్మి విలాస్, యెస్ బ్యాంక్ కస్టమర్లకు లబ్ధి

1993 నుండి ఇప్పటి వరకు, అంటే దాదాపు 27 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా డిపాజిట్ బీమాలో ప్రభుత్వం మార్పులు చేపట్టింది. తాజా నిర్ణయం 2020 ఫిబ్రవరి 4 నుండి అమల్లోకి వస్తుంది. అంటే పిఎంసి, లక్ష్మి విలాస్ బ్యాంక్, యెస్ బ్యాంక్ కస్టమర్లకు కూడా ప్రయోజనం లభించనుంది. డిఐసిజిసి చట్టం 1961లోని సెక్షన్ 16 (1) ప్రకారం, ఒక బ్యాంక్ మునిగిపోతే లేదా దివాలా తీస్తే డిఐసిజిసి ప్రతి డిపాజిటర్‌కు చెల్లించాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే డిపాజిటర్లు జమ చేసిన మొత్తానికి రూ.1 లక్ష వరకు బీమా కవర్‌ను కల్గివుంటారు. ఈ పరిమితిని ప్రభుత్వం ఇప్పుడు రూ.5 లక్షలకు పెంచింది. ఒకే బ్యాంకులోని వివిధ శాఖలలో కస్టమర్‌కు ఖాతా ఉంటే, అన్ని ఖాతాలలో డిపాజిట్ మొత్తాన్ని, వడ్డీని కలపడం ద్వారా రూ.5 లక్షల వరకు సొమ్ము సురక్షితంగా పరిగణిస్తారు.

డిఐసిజిసి పరిధిలో బ్యాంక్ డిపాజిట్లు

బ్యాంకుల్లో ఉండే అన్ని డిపాజిట్లు డిఐసిజిసి పరిధిలోకి వస్తాయి. దీనిలో సేవింగ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు సహా కరెంట్ ఖాతాలు ఉంటాయి. ఏదైనా బ్యాంకును నమోదు చేసేటప్పుడు డిఐసిజిసి వారికి ముద్రిత ఫారమ్ ఇస్తుంది. దానిలో డిపాజిటర్లకు అందుబాటులో ఉన్న బీమా వివరాలు ఉంటాయి. గ్యారెంటీ మొత్తాన్ని పెంచడం వల్ల ప్రజలు హామీ బ్యాంకుల్లో డబ్బు జమ చేయడం గురించి ఆందోళన చెందరు. దీనివల్ల బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల నమ్మకం పెరుగుతుంది. దీంతో సేవింగ్స్ పెరిగి, బ్యాంకులు ఎక్కువ రుణాలు ఇచ్చేందుకు అవకాశం లభిస్తుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News