Thursday, November 14, 2024

రూపాయి పతనంలో మరో రికార్డు

- Advertisement -
- Advertisement -

 

Rupee to depreciate to 77.5 vs US dollar by march 2023

ఎనిమిది సంవత్సరాల పాలనలో నరేంద్ర మోడీ సాధించిన ఘనతలు లేదా విజయాలు అంటూ వాట్సాప్ పండితులు జనాలకు వండి వడ్డిస్తున్నారు. యజమానులు చెప్పినట్లుగా వారి పని వారు చేస్తున్నారు. వంటలు ఎంత కష్టపడి చేశారని కాదు, అవి తినేందుకు పనికి వస్తాయా లేదా అన్నది గీటురాయి. ఎనిమిదేండ్లుగా తిన్నవారికి అవెలాంటివో తెలియటం ఇప్పుడే ప్రారంభమైంది. ఎప్పటికీ రుచి పచీ తెలియని జనాలు కొందరుంటారు. వారికి సానుభూతి తెలుపుదాం. బిజెపి నుంచి తాత్కాలికంగా పక్కన పెట్టిన అధికార ప్రతినిధి నూపూర్ శర్మ చిల్లర మాటల వివాదం తరువాత వాట్సాప్ పండితులు నరేంద్ర మోడీ “ఘనతల” గురించి ప్రచారం మొదలు పెట్టారు. వాటిలో చమురు గురించి కూడా ఉంది. వాటితో పాటు దాని కంటే ముందే చమురు రంగంలో “ఘనత ” గురించి గురించి చూద్దాం.

మన దేశం కొనుగోలు చేస్తున్న ముడి చమురు ధర పదేండ్ల నాటి స్థాయికి పెరిగిందన్న వార్తలను కొద్ది మందైనా చదివే ఉంటారు. 201112 లో మన దేశం కొనుగోలు చేసిన ముడి చమురు సగటు ధర 111.89 డాలర్లు. ఆ ఏడాది అంటే 2012 మార్చి నెలలో ఉన్న సగటు ధర 123.66 డాలర్లుంది. 2012 మార్చి 29 నుంచి ఏప్రిల్ పదకొండు వరకు సగటు ధర 121.28 డాలర్లు. కేంద్ర ప్రభుత్వ సంస్థ పిపిఎసి వెల్లడించిన సమాచారం ప్రకారం 2022 జూన్ పదవ తేదీన మనం కొనుగోలు చేసిన చమురు ధర 121.28 డాలర్లు. ఇక్కడే మనం నరేంద్ర మోడీ ఘనత గురించి చెప్పుకోవాలి. అదే ధరకు 2012లో మన చెల్లించిన మొత్తం మన కరెన్సీలో రూ. 6,201.05 కాగా, ఎనిమిదేండ్ల పాలనలో నరేంద్ర మోడీ అదే డాలర్లకు చెల్లించిన మొత్తం రూ. 9,434.29. అంటే మంచి రోజుల పేరుతో అధికారాన్ని పొంది బాదుడే బాదుడు అన్నట్లుగా చమురు మీద పెంచిన పన్నులను పక్కన పెడితే రూపాయి విలువ పతనాన్ని అరికట్టలేని అసమర్ధత కారణంగా ఈ రోజు మనం ప్రతి పీపాకు పదేండ్ల నాటి కంటే అదనంగా రూ. 3,233.24 చెల్లిస్తున్నాము.

పదేండ్ల క్రితం రూపాయి విలువ డాలరుకు 51.13 ఉండగా, మోడీ ఏలుబడిలో 2022 జూన్ పదిన అది 77.79కి దిగజారింది, పదమూడవ తేదీన 78.29 కి పతనమై మరో కొత్త రికార్డు నమోదు చేసింది. అందువలన పదేండ్ల క్రితం, ఇప్పుడు ముడి చమురు ధర ఒకే విధంగా ఉన్నప్పటికీ మనం చెల్లించే మొత్తం భారీగా పెరిగింది. రూపాయి విలువను కాపాడలేదంటూ నరేంద్ర మోడీతో సహా బిజెపి నేతలందరూ మన్మోహన్ సింగ్ సర్కార్‌ను దులిపి వేశారు. మోడీ సర్కార్ నిర్వాకానికి ఇప్పుడు దేశ ప్రజలందరూ మూల్యం చెల్లించాల్సి వస్తోంది.

గతేడాది నవంబరు నుంచి ఈ ఏడాది మార్చి వరకు 137 రోజుల పాటు చమురు ధరలను స్తంభింప చేశారు. తరువాత పదిహేను రోజుల్లో 13 సార్లు పెంచారు. తిరిగి ఏప్రిల్ ఆరు నుంచి ధరల స్తంభన కొనసాగుతోంది. ఏప్రిల్ నెలలో మన దేశం కొనుగోలు చేసిన ముడి చమురు సగటు ధర 102.97, మే నెలలో 109.51, జూన్ నెలలో పదవ తేదీ వరకు 118.34 డాలర్లుగా ఉంది. జూన్ 14న 124 డాలర్లుంది. అందువలన ఏ క్షణంలోనైనా తిరిగి ధరలు పెరగవచ్చు. గతంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం ధరలను స్తంభింప చేస్తే శ్రీలంక పరిణామాలను చూసిన తరువాత ఇప్పుడు ధరల పెరుగుదలను అరికట్టేందుకుగాను కొంత మేర పన్ను తగ్గింపు, ధరల స్తంభన కానసాగిస్తున్నారు. ఇది మంచిదే కదా అని ఎవరైనా అనవచ్చు. ఎప్పుడు మంచిది అవుతుంది అంటే ఏప్రిల్ ఆరు నుంచి పెరిగిన ధరల భారాన్ని ప్రభుత్వం భరిస్తే, అలా గాక తిరిగి ఆ మొత్తాన్ని జనం మోపితే పరిస్థితి ఏమిటి? ఇప్పటికే ఎనిమిది సంవత్సరాల ద్రవ్యోల్బణ రికార్డును మోడీ సర్కార్ అధిగమించిన ఘనత సాధించింది.

2022 23 బడ్జెట్‌ను ముడి చమురు ధర 75 డాలర్లు ఉంటుందనే అంచనాతో రూపొందించారు. ఈ ఏడాది తొలి మూడు నెలల్లో సగటున ఎంత ఉందో పైన చూశాము. ఆర్‌బిఐ, ఇతర సంస్థలు మన జిడిపి వృద్ధి గురించి వేసిన అంచనాలన్నిటినీ కుదింపులతో సవరిస్తున్నాయి. పెట్రోలు, డీజిలుకు కూరగాయల సాగు కు నేరుగా సంబంధం లేకున్నా రవాణా,సాగు, ఇతర ఖర్చు పెరిగి వాటి ధరలు కూడా పెరుగుతాయి. మే నెల మూడవ వారం ప్రారంభంలో ఉన్న ముడి చమురు ధరలను బట్టి డీజిలు ధర లీటరుకు రూ. 34, పెట్రోలు ధర రూ. 23 వరకు పెంచవచ్చని ప్రభుత్వం లీకులు వదిలింది. మరో వైపు డీజిలు మీద 2530, పెట్రోలు మీద పది వరకు నష్టాలు వస్తున్నట్లు కొందరు గుసగుసలాడుతున్నారు. చమురు దిగుమతి బిల్లు 202021లో ఏడాదికి 62.2 బిలియన్ డాలర్లుంటే 2021 22కు అది 119.2 బి.డాలర్లకు పెరిగింది. ఈ ఏడాది ఎంత అవుతుందో చెప్పలేము. చమురు రంగానికి సంబంధించి నరేంద్ర మోడీ ఘనత గురించి చెప్పుకోవాలంటే ఇంకా ఉన్నాయి. 2014తో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో మన దేశంలో ఉత్పత్తి చేసిన ముడి చమురు 35.9 మిలియన్ టన్నులు. అది 2020 21కి 29.1కి, 2021 22లో ఖరారు కాని లెక్కల ప్రకారం 28.4 మి.టన్నులని పిపిఎసి సమాచారం వెల్లడించింది. పరిస్థితి ఇది కాగా వాట్సాప్ పండితులు లేదా పండిత పుత్రులు తిప్పుతున్న ఒక పోస్టులో అంశాల గురించి చూద్దాం.

“భాగస్వామ్య పద్ధతిలో రష్యాతో కలిసి కొత్త ఆయిల్ బావుల అన్వేషణ కోసం ఒప్పందం చేసుకోవాల్సిందిగా ఒఎన్‌జిసితో పాటు ప్రభుత్వరంగ ఆయిల్ సంస్థలను కోరారు మోడీజీ. కొత్త్త ఆయిల్ బావుల అన్వేషణ భారీ ఖర్చుతో కూడిన వ్యవహారం అవడంతో ప్రస్తుతం ఆ ఖర్చును రష్యా భరించే స్థితిలో లేకపోవటంతో కొత్త ఆయిల్ బావుల అన్వేషణ కోసం భారత్‌ను కోరింది రష్యా.” వెనుకటికి ఎవడో సన్యాసి నాకు పది వేల రూకలిస్తే మీకు బంగారం తయారు చేసే ఉపాయం చెబుతా అన్నాడట. వాడే బంగారాన్ని తయారు చేసుకొని కోట్లు సంపాదించవచ్చు కదా! చమురు దిగుమతులను తగ్గించి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేస్తానని చెప్పిన నరేంద్ర మోడీ గత ఎనిమిదేండ్లలో ఉన్న ఉత్పత్తిని కూడా కొనసాగించలేని స్థితిలోకి చమురు సంస్థలను నెట్టారు. ఐదు లక్షల కోట్ల డాలర్లు కాకున్నా ఇప్పుడు జిడిపిలో రష్యా కంటే మెరుగైన స్థితిలో ఉన్న మన దేశం మన కొత్త బావుల సంగతి చూడకుండా రష్యా వెళ్లమని మోడీ కోరారట, వినేవారుంటే కథలు భలే చెప్తారు కదా! ఈ రోజు రష్యా సమస్య కొత్తవాటిని తవ్వటం గురించి కాదు, ఉన్న వాటి నుంచి తీసిన చమురును అమ్ముకోవటం ఎలా అన్నదే. మనతో నిమిత్తం లేకుండానే అది గతంలో బావులను తవ్వుకుంది. మనతో సమంగా దాని దగ్గర కూడా విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్నాయి. చమురు కొనుగోలు చేసి మనమే ప్రతి నెలా దానికి సమర్పించుకుంటున్నాము. నరేంద్ర మోడీకి గొప్పతనాన్ని ఆపాదించేందుకు ఇలాంటి కట్టుకథలను ప్రచారం చేస్తారు.

“మోడీజీ ఒఐసి (ఇస్లామిక్ ఆర్గనైజేషన్ దేశాలు) దేశాల నుంచి దిగుమతి చేసుకొనే క్రూడ్ ఆయిల్‌లో కోత విధించి దానిని రష్యా నుంచి దిగుమతి చేసుకోవాలని ఆయిల్ కంపెనీలను కోరారు”. ఇది ఒక పచ్చి అబద్ధ్దం. నూపూర్ శర్మ చిల్లర మాటల వివాదానికి ముందు నుంచే తక్కువ ధరకు వస్తున్నందున రష్యా నుంచి దిగుమతిని భారీగా పెంచారు. “ఇప్పటి వరకు అమెరికా, రష్యా నుంచి ముడిచమురు బారెల్‌కు 30 డాలర్లు పెట్టి దిగుమతి చేసుకొని దానిని శుద్ధి చేసి తిరిగి ఐరోపా దేశాలకు అమ్ముతున్నది. ఇప్పుడు భారత్ కూడా తక్కువ రేటుకి రష్యా నుంచి కొని దాన్ని శుద్ధి చేసి ఐరోపా దేశాలకు అమ్ముతున్నది. ఇది పరోక్షంగా గల్ఫ్ దేశాల ఆయిల్ వ్యాపారానికి చెంపదెబ్బ” ఈ పోస్టును రచించిన వారికి ముందేమి రాస్తున్నామో వెనకేమి రాశామో అన్న ఆలోచన ఉన్నట్లు లేదు. పైన పేర్కొన్న రాతకు ఎగువన ఏం రాశారో తెలుసా! “మన దేశంలో ఉన్నట్లు ఇయు దేశాలలో భారీ రిఫైనరీలు లేవు.

నేరుగా రష్యా నుంచి పెట్రోలును పైప్‌లైన్ నుంచి దిగుమతి చేసుకుంటూ వచ్చాయి.” ఉక్రెయిను సంక్షోభానికి ముందు వరకు రష్యా నుంచి పెట్రోలు, డీజిలు, పెట్రోలియం ఉత్పత్తులను అమెరికా దిగుమతి చేసుకునేది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఒకటుంది. కరోనా సంక్షోభంలో కార్పొరేట్ శక్తులను నరేంద్ర మోడీ సర్కార్ ఎలా ఆదుకున్నదో, జనం అప్పులపాలై దివాలా తీస్తే ధనికుల దగ్గర సంపద ఎలా పోగుపడిందో చూశాము. ఇప్పుడు ఉక్రెయిను సంక్షోభం కారణంగా మన దేశంలో జనం ధరల పెరుగుదలతో అల్లాడిపోతుంటే రష్యా నుంచి చవకగా దిగుమతి చేసుకున్న ముడి చమురును శుద్ధి చేసి ఐరోపా దేశాల కోసం ఎగుమతి చేస్తున్నారంటే దీని వలన లబ్ధి పొందేది ఎవరు? మన జనమైతే కాదు, పోనీ ఐరోపా దేశాల నుంచి వాటికి ప్రతిగా నరేంద్ర మోడీ పలుకుబడితో తక్కువ ధరలకు సరకులను దిగుమతి చేసుకుంటున్నామా అంటే అదీ లేదు. రష్యా నుంచి దిగుమతుల వలన మన జనానికి కలిగిన, కలుగుతున్న మేలు ఇదీ అని ఎవరినైనా చెప్పమనండి!

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News