ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ప్రపంచంలో చాలా మంది డిప్రెషన్ ( కుంగుబాటు ) లో కూరుకుపోయినట్టు వింటుంటాం. వ్యక్తిని మానసికంగా కుంగదీసి ఆత్మహత్యలకు ప్రేరేపించే ఈ మానసిక రుగ్మతను గుర్తించడానికి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ 2016లో భారత్ లోని 12 రాష్ట్రాల్లో సర్వే చేపట్టింది. దీని ప్రకారం దేశంలో 14 శాతం మంది డిప్రెషన్ వంటి మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. వీరిలో10 శాతం మందికి తక్షణం వైద్యసహాయం అందించాల్సిన అవసరం ఉందని తేలింది. ఇదిలా ఉండగా 20 శాతం మంది భారతీయులు తమ జీవితంలో ఏదో ఒకసారి డిప్రెషన్ బారిన పడుతున్నారని. ప్రతి ఇరవై మందిలో ఒకరు డిప్రషన్‌తో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా వెల్లడించింది.
Also Read: త్వరలో అందుబాటు లోకి డెంగ్యూ వైరస్ వ్యాక్సిన్
అయితే భారత్‌లో మానసిక వైద్య సహాయం అవసరమైన ప్రతి 10 మందిలో కేవలం ఒక్కరే వైద్యసాయం పొందగలుగుతున్నారని సైన్స్ జర్నల్ లాన్సెట్ వెల్లడించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రపంచంలో మానసిక సమస్యలతో బారిన పడిన వారిలో మూడింట ఒకవంతు మనదేశం లోని ప్రజలే ఉండవచ్చని ఆ నివేదిక వెల్లడించింది. జీవితంలో పరాజయాలు, ఒంటరితనం, ఆత్మవిశ్వాసం కోల్పోవడం, నిరుద్యోగం, బాధ, కోపం, నిరుత్సాహం, ఆందోళన వంటి భావోద్వేగాలు అందరికీ వస్తుంటాయి. అయితే డిప్రెషన్ బాధితుల్లో ఈ సమస్యలు చిరకాలం వెంటాడుతుంటాయి. అంతేకాదు వారి జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంటాయి. ఈ డిప్రెషన్ చాలా కారణాల వల్ల వస్తుంది. ఒక్కొక్కరికి ఈ డిప్రెషన్ రాడానికి కారణాలు వేర్వేరుగా ఉంటాయి.
ఆప్తుల్ని కోల్పోవడం, భాగస్వామి దూరం కావడం, మొండి జబ్బులు, అనుకున్నది దక్కలేదనే ఆందోళన, నిద్ర సమస్యలు, కొన్ని ఔషధాల దుష్ప్రభావం, మంచి ఆహారం తీసుకోకపోవడం, ఫిట్‌నెస్ లేక పోవడం, మెనోపాజ్ మొదలైనవి డిప్రెషన్‌కు దారి తీస్తుంటాయి. కొన్నిసార్లు జన్యు పరమైన కారణాల వల్ల కూడా కుంగుబాటు వస్తుంది. ఈ లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా కనిపిస్తుంటాయి. అయితే అందరి లోనూ కనిపించే కొన్ని లక్షణాలు , భావోద్వేగాలు గురించి తెలుసుకుందాం. దీర్ఘకాలం బాధల్లో ఉండటం, ఎప్పటికప్పుడు ఏడుపు వచ్చినట్టు అనిపించడం, తరచూ నిరాశ చెందడం, సర్వం కోల్పోయినట్టు అనిపించడం, ఎక్కువగా ఆందోళన పడడం, చిన్నచిన్న విషయాలకే చిరాకు పడడం, సహనం కోల్పోవడం, ఏదోతప్పు చేసిన భావన కలగడం, ప్రతికూల ఆలోచనలు ఎక్కువగా ఉండడం, ఆత్మన్యూనత , ఏకాగ్రత లేకపోవడం, నిర్ణయాలు తీసుకోలేక పోవడం వంటివి కనిపిస్తాయి., కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు, ఇష్టపడే పనులనూ పక్కన పెట్టడం, తరచూ చేసే, అలవాటు పడిన పనులపై అశ్రద్ధ, కుటుంబం, స్నేహితులను దూరంగా పెట్టడం, ఆఫీసులో పనిచేయడానికి ఇబ్బంది పడడం , తనకు తానే హాని చేసుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
అనేక రోగాలకు దారి తీసే పరిస్థితి
డిప్రెషన్ అంటే మానసిక కుంగుబాటు మాత్రమే కాదు, అనేక రోగాలకు కారకం కూడా. ఇది రోగ నిరోధక శక్తిని తగ్గించి, రోగాలను పెంచుతుంది. గుండె జబ్బులున్నవారు డిప్రెషన్ గురైతే హార్ట్ ఎటాక్ రావచ్చు. డయాబెటిస్ రోగులైతే వ్యాధి మరీ తీవ్రమౌతుంది మతిమరుపు పెరుగుతుంది. థైరాయిడ్, పక్షవాతం, మూర్ఛ, పార్కిన్‌సన్ , మెదడులో కణతులు, మూర్ఛవంటి నరాల సంబంధ వ్యాధులు ఉన్నవారిలో డిప్రెషన్ ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే ఆస్టియో ఆర్థరైటిస్ తదితర ఎముకల సమస్యలు ఎక్కువగా రావచ్చు. నిద్రమాత్రలు, పెయిన్ కిల్లర్స్, బీపీ మందులు అతిగా తీసుకున్నా డిప్రెషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంటుంది ఆల్కహాలు, ఓపియం, డ్రగ్స్ డిప్రెషన్‌ను మరింత పెంచుతాయి.
శారీరక లక్షణాలు…
భౌతికంగా శారీరక లక్షణాలు పరిశీలిస్తే నిద్రపట్టకపోవడం, నిస్సత్తువ ఆవరించడం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, కారణం లేకుండా నొప్పులు రావడం, వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు దీర్ఘకాలం ఉంటే వైద్యులను సంప్రదించాలి. మానసిక వైద్య నిపుణులను సంప్రదించాలి. రెండు వారాల కంటే ఎక్కువ కాలం ఈ లక్షణాలు పదేపదే కనిపిస్తే ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఈ ఆలోచనల గురించి స్నేహితులు, బంధువులు ఇలా ఎవరో ఒకరితోనే మాట్లాడాలి. డిప్రెషన్ ఉన్నవారితో మాట్లాడినప్పుడు మొదట వారు చెప్పేవన్నీ జాగ్రత్తగా వినాలి. ఒక్కోసారి మాట్లాడడం, భావాలను పంచుకోవడం, కూడా డిప్రెషన్ తగ్గడానికి సహాయపడతాయి. అయితే వారి మాటలు వినేటప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదు. వారిని ప్రోత్సహించేలా, భావాలను పంచుకునేలా మాట్లాడాలి. డాక్టర్ దగ్గరకు వెళ్లేలా డిప్రెషన్ బాధితుల్ని ప్రోత్సహించాలి. అయితే ఎంజాయ్ చెయ్, చీర్‌ఆఫ్ లాంటి పదాలు వారికి చెప్పకపోవడమే మంచిది.
చికిత్స
డిప్రెషన్ రోగులను స్వల్ప, మధ్యస్థం, తీవ్రం అనే మూడు కేటగిరీలుగా విభజిస్తారు. వీటి ఆధారం గానే వైద్యులు చికిత్స చేస్తారు. సాధారణంగా ఎక్కువ మందికి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (సిబిటి)తో చికిత్స ప్రారంభిస్తారు. ఇది ఒక కౌన్సెలింగ్ ప్రక్రియ. దీనిలో భాగంగా నెగిటివ్ ఆలోచనలు, తీవ్రమైన బాధకు కారణాలు గుర్తించి, వాటిని అధిగమించేందుకు వైద్యులు సూచనలు, సలహాలు ఇస్తుంటారు. ప్రతికూల ఆలోచనల మూలాలతోపాటు వాటిని అధిగమించే మార్గాలు తెలుసుకోవడం ద్వారా ప్రతికూల ప్రవర్తనల జోలికి పోకుండా అడ్డుకోవచ్చు.
కుంగుబాటు తీవ్రంగా ఉంటే యాంటీ డిప్రెషన్ ఔషధాలను వైద్యులు సూచిస్తారు. ఇవి భావోద్వేగాలను ప్రభావితం చేసే మెదడు లోని రసాయన చర్యలను క్రియాశీలం చేస్తాయి. దీంతో కొంతవరకు నిస్సత్తువ, నిరాశ, భావోద్వేగ సమస్యలను అడ్డుకోవచ్చు. అయితే ఈ ఔషధాలతో కొన్ని ప్రతికూల ప్రభావాలూ ఉంటాయి. కొంతమంది రోగులకు ధ్యానం, వ్యాయామం, మ్యూజిక్ , ఆర్ట్ థెరపీలను సూచిస్తారు. డిప్రెషన్ వచ్చిందని భయపడనక్కర లేదు. సైకోథెరపీ, ఎలెక్ట్రోకన్వల్సిన్ థెరపీ (ఈసీటీ)తో డిప్రెషన్‌ను దూరం చేయవచ్చు. ఈసీటీలో రోగికి షాక్ ఇస్తారు. ఇందులో వినియోగించే కరెంట్ రోగికి షాక్ కొట్టదు. ఈ చికిత్స తర్వాత చాలా మంది రోగులు తిరిగి ఆరోగ్యవంతులై చక్కని జీవితం గడుపుతున్నారు. డిప్రెషన్ రోగులకు ఒంటరి తనం నుంచి దూరం చేయాలి. వారికి మనోనిబ్బరం కలిగించే ప్రయత్నం చేయాలి.