Monday, December 23, 2024

సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

- Advertisement -
- Advertisement -

రెండు ఫైళ్ళపై తొలి సంతకం

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బాధ్యతలు స్వీకరించారు. డా.బిఆర్ అంబేద్కర్ సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సచివాలయ అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన పలు శాఖలకు నిధులు మంజూరు చేశారు. వాటికి సంబంధించిన ఫైళ్ల పై సంతకాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారెంటీలు మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ కి నిధులు విడుదల చేశారు. డిప్యూటీ సిఎంకు ఎంఎల్‌ఎలు, పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.

డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క సచివాలయంలో ఉదయం 8.:21 గంటలకు తన చాంబర్లో వేద పండితుల మంత్రోచ్ఛనాలు, ఆశీర్వచనాల మధ్య మంత్రి బాధ్యతలను స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సిఎంకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ట్రాన్స్‌కో స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ, ఆర్థిక శాఖ కార్యదర్శులు శ్రీదేవి, హరిత తదితర ఉన్నతాధికారులు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్‌ఎల్‌ఎలు రాందాస్ నాయక్, అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్, సంజీవరెడ్డి, బీర్లు ఐలయ్య, రాగమయి, మల్ రెడ్డి రంగారెడ్డి, నాగరాజు, షబ్బీర్ అలీ, తదితరులు హాజరయ్యారు.

కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు కల్పిస్తున్న ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం సబ్సిడీని రూ. 374 కోట్ల రూపాయలు ఆర్టీసీకి విడుదల చేస్తూ తొలి సంతకం చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని 10 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రూ. 298 కోట్ల రూపాయలను వైద్య ఆరోగ్య శాఖకు విడుదల చేస్తూ రెండవ సంతకం చేశారు. విద్యుత్ సబ్సిడీ 996 కోట్ల రూపాయలు విడుదల ఫైలుపై సంతకం చేశారు. సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్ల కొరకు 75 కోట్ల రూపాయలు వివిధ శాఖల మంజూరుకు సిఫారసు చేసిన ఫైలుపై సంతకం చేశారు. అంతకు ముందు ఆర్దిక, ప్రణాళిక, విద్యుత్ మంత్రిత్వ శాఖల బాధ్యతలు స్వీకరించడానికి సచివాలయం చేరుకున్న డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క దంపతులకు పూర్ణ కుంభంతో వేద పండితులు స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులతో కలిసి తన చాంబర్లో ప్రత్యేక పూజలు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News