అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో బిజెపి, బిఆర్ఎస్ నేతలు పోటీ పడ్డారు
ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ అరెస్ట్ విషయంలో రూలింగ్ పార్టీని వ్యతిరేకించడానికి బిజెపి, బిఆర్ఎస్ నేతలు పోటీ పడ్డారని కాంగ్రెస్ ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కానీ, ఎపి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ వాస్తవ పరిస్థితులు తెలుసుకొని మాట్లాడారని, మానవత్వం కోణంలో మాట్లాడాడరని ఆయన అన్నారు. ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. సోమవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో నిర్వహించిన చిట్ చాట్‌లో ఆయన మాట్లాడుతూ రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ మాట్లాడలేదన్నారు.
తమకు అనుకూలంగా పవన్ మాట్లాడారని తాను అనుకోవడం లేదని అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలన తెలంగాణలో లేదని పవన్ మాట్లాడారని ఆయన చెప్పుకొచ్చారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు విషయం దేశవ్యాప్తంగా చర్చ జరిగిందన్నారు. అల్లు అర్జున్ అరెస్టుతో సినిమాకు ఇంకా ఎక్కువ కలెక్షన్లు వచ్చాయని, ఇంకా రెండు నెలలు పుష్ప సినిమా నడుస్తుందని ఆయన జోస్యం చెప్పారు.
వైసిపి నేత అంబటి రాంబాబు మంచి కళాకారుడని, తరువాత సినిమాలో అంబటి రాంబాబుకి మంచి రోల్ ఇస్తారని, అంబటి నటించడంతో పాటు డాన్స్ కూడా బాగానే చేస్తాడన్నారు. ప్రతిపక్షాలు అడుగుతున్న గురుకుల హాస్టల్ విద్యార్థిని శైలజ కుటుంబాన్ని సిఎం ఎందుకు పరామర్శించలేదని అంటున్నా రని, అన్ని చోట్లకు సిఎం వెళ్లడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదని, ఇప్పుడు కావాలనే సిఎం రేవంత్‌ని టార్గెట్ చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.