ఇద్దరు గిరిజన నేతలదీ అదే పంథా
ధంగార్‌లకు ఎస్‌టి హోదా డిమాండ్‌కు నిరసన
ముంబయి : మహారాష్ట్రలో షెడ్యూల్డ్ తెగల (ఎస్‌టి) జాబితాలో ధంగార్‌లను చేర్చాలన్న డిమాండ్ పట్ల నిరసన సూచకంగా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ సహా ఆదివాసీ నేతలు శుక్రవారం రాష్ట్ర సచివాలయం మంత్రాలయ భవనం మూడవ అంతస్తులోనుంచి కిందకు దూకారు. కానీ వారు సరిగ్గా ఆ దిగువ అంతస్తు వద్ద ఉన్న సేఫ్టీ నెట్‌లో పడ్డారు. ఆరు అంతస్తుల మంత్రాలయ సముదాయంలో ఉద్విగ్న క్షణాలు చూసిన ఆ ఘటనలో ఎవరికీ గాయాలు తగలలేదు, జిర్వాల్, ఆయన సహచర ఎన్‌సిపి శాసనసభ్యుడు కిరణ్ లహమాతె, బిజెపి ఆదివాసీ ఎంపి హేమంత్ సవర మూడవ అంతస్తు నుంచి రెండవ అంతస్తు వద్ద ఏర్పాటైన సేఫ్టీ నెట్‌లోకి దూకారు.
గతంలో ఆ ప్రదేశంలో జరిగిన ఆత్మహత్య యత్నాలకు స్పందనగా ముందు జాగ్రత్తగా ఆ సేఫ్టీ నెట్ అమర్చారు. శుక్రవారం మధ్యాహ్నం సుమారు 12.40 గంటలకు ఆ ఘటన సంభవించిందని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ఆదివాసీ సమస్యల పట్ల ప్రభుత్వ వ్యవహరణ తీరుపై ఉద్రిక్తతలు పెరుగుతుండడాన్ని ఆ నిరసన సూచించింది. నెట్‌లో నుంచి ఆ నేతలను పోలీసులు తప్పించిన అనంతరం ఆ ఆదివాసీ ప్రతినిధులు కింది అంతస్తు ప్రయాణ మార్గంలో బైఠాయించారు. కోటా అంశంపై చర్చించేందుకు తమతో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సమావేశం కావడం లేదని వారు ఆరోపించారు.