మన తెలంగాణ/హైదరాబాద్: పార్టీ మారతారంటూ జరుగుతోన్న ప్రచారంపై తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ వివరణ ఇచ్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసున్న ఫోటో బయటకు రావడంతో పద్మారావు గౌడ్ వివరణ ఇచ్చారు. ఈ మేరకు టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్‌తో పద్మారావు భేటీ అయ్యారు. పార్టీ మారేదేమి లేదని కెటిఆర్‌కు పద్మారావు వివరణ ఇచ్చారు. అటు ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా స్పందించారు. పద్మారావు కొడుకు పెళ్లికి వెళ్లి ఆశీర్వదించానని పెళ్లికి వెళ్తే టచ్‌లో వున్నట్టా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కాగా తెలంగాణలో బలపడాలని చూస్తోన్న బిజెపి ఆపరేషన్ ఆకర్ష్‌కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా టిఆర్‌ఎస్ , కాంగ్రెస్ పార్టీలలోని కీలక నేతలకు గాలం వేస్తోంది. ఇప్పటికే మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ను పార్టీలోకి ఆహ్వానించింది. అలాగే అధికార పార్టీకి చెందిన మరో ఇద్దరు నేతలపైనా ఫోకస్ పెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో కిషన్ రెడ్డితో పద్మారావు గౌడ్ వున్న ఫోటోలు బయటకు రావడంతో టిఆర్‌ఎస్ ఉలిక్కిపడింది. అటు పద్మారావు గౌడ్ కూడా స్పందించారు. తాను పార్టీ వీడుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తనపై దుష్ప్రచారం చేస్తోన్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని పద్మారావు గౌడ్ హెచ్చరించారు.
Deputy Speaker Padmarao goud meets KTR