ఇస్లామాబాద్: సుప్రీం కోర్టులో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. అవిశ్వాస తీర్మానం విషయంలో డిప్యూటీ స్పీకర్ ఖాసీం సూరీ తీసుకున్న నిర్ణయం తప్పుడు నిర్ణయమని సుప్రీం స్పష్టం చేసింది. అవిశ్వాస తీర్మానం విషయంపై గురువారం సుప్రీం కోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం డిప్యూటీ స్పీకర్ వైఖరిని తప్పు పట్టింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉమర్ అతా బండియాల్ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. అంతా రాజ్యాంగం ప్రకారమే నడుస్తుంటే మరి దేశంలో రాజ్యాంగ సంక్షోభం ఎక్కడుంది? అంటూ రాష్ట్రపతి తరఫు న్యాయవాదిని సీజే బండియాల్ ప్రశ్నించారు. అసలు పాక్‌లో రాజ్యాంగ సంక్షోభం ఉందా లేదా అన్న విషయంలో ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదని సీజే ఆయనను సూటిగా ప్రశ్నించారు. అన్ని నియమాలనూ తుంగలో తొక్కి ప్రధానిని కాపాడితే.. సరైన దేనా? అని కూడా ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని రక్షించే విషయంలో ఏఏ నిబంధనలైతే ఉన్నాయో… వాటి ప్రకారమే జరిగిందని రాష్ట్రపతి తరఫు న్యాయవాది బదులిచ్చారు. ఇక అవిశ్వాసం విషయంలో తుది తీర్పు ఇంకా వెలువడవలసి ఉంది.
Deputy Speaker’s Rejection of no-trust vote wrong: Pak SC