హైదరాబాద్ : అర్ధరాత్రి వేళ ఐఎఎస్ స్మితా సబర్వాల్ ఇంట కలకలం చోటు చేసుకుంది. తెలంగాణ సిఎంఒ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్ ఇంట్లోకి ఒక అధికారి చొరబడే ప్రయత్నం చేశారు. భద్రతా సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేయగా వారితో దురుసుగా ప్రవర్తించారు. ఉద్యోగ విషయం మాట్లాడేందుకు వచ్చానంటూ ఇంట్లోకి ప్రవేశించిన ఆ వ్యక్తిని మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా డిప్యూటీ తహశీల్దార్ ఆనంద్‌గా గుర్తించారు. అర్ధరాత్రి ఇంటికి రావటంతో అధికారిణి స్మితా కేకలు వేశారు. భద్రతా సిబ్బంది అప్రమత్తమై అతడిని పట్టుకున్నారు. కేసు నమోదు చేశారు. అతడితో పాటుగా వచ్చిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. ఇద్దరినీ జ్యూడిషియల్ కస్టడీకి తరలించారు. జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఈ ఘటన శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్మితా సబర్వాల్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు.
స్మితా సబర్వాల్ ట్వీట్లు ఆ అధికారి ఒకట్రెండు సార్లు ట్వీట్ చేశారు. తాజాగా స్మితా సబర్వాల్ ఉండే నివాస ప్రాంగణానికి మరో వ్యక్తితో కలిసి కారులో చేరుకున్నారు. స్నేహితుడిని కారులోనే ఉంచి డిప్యూటీ తహసీల్దార్ మాత్రం స్మితా సబర్వాల్ ఇంటికి వెళ్లాడు. ముందు ఉన్న స్లైడింగ్ డోర్‌ను తెరచుకుని లోపలకు ప్రవేశించి గది తలుపును తట్టాడు. తలుపు తీసిన అధికారిని వెంటనే అప్రమత్తమయ్యారు. అర్థరాత్రి సమయంలో తెలియని మనిషి రావటంతో షాక్‌కు గురైనా వెంటనే తేరుకుని ఎవరు? ఎందుకు వచ్చారు? అంటూ నిలదీశారు. గతంలో తాను ట్వీట్ చేసిన విషయాన్ని డిప్యూటీ తహసీలాదర్ గుర్తు చేశాడు. తన ఉద్యోగం గురించి మాట్లాడేందుకు వచ్చానని చెప్పే ప్రయత్నం చేశాడు. దీంతో, వెంటనే అధికారి ఆగ్రహంగా బయటకు వెళ్లాలంటూ గట్టిగా అరిచారు. అక్కడకు చేరుకున్న భద్రతా సిబ్బంది డిప్యూటీ తహసీల్దార్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.
స్మితా సబర్వాల్ స్పందన..
ఈ ఘటనపైన స్మితా సబర్వాల్ స్పందించారు. ట్వీట్ ద్వారా జరిగిన విషయాన్ని వెల్లడించారు. అర్ధరాత్రి బాధాకరమైన అనుభవం ఎదురైందని పేర్కొన్నారు. ఓ వ్యక్తి తన ఇంట్లోకి అక్రమంగా చొరబడ్డారని వివరించారు. ధైర్యం, చాకచక్యంతో తనను తాను రక్షించుకోగలిగాను అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఎంత భద్రత ఉన్నప్పటికీ.. మనల్ని మనం కాపాడుకునేలా ఉండాలి. రాత్రి వేళ తలుపులు, తాళాలను పరిశీలించుకోవాలని సూచించారు. అత్యవసర స్థితిలో 108కి ఫోన్ చేయాలంటూ స్మితా సబర్వాల్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
డిప్యూటీ తహసీల్దార్‌కు మానసిక సమస్యలు..!?
కాగా, ఈ ఘటనకు పాల్పడిన డిప్యూటీ తహసీల్దార్ కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. ఉద్యోగంలో చేరకముందు.. ఓ సంస్థలో జర్నలిస్ట్‌గా కూడా పనిచేసినట్లు తెలుస్తోంది. మొత్తం వ్యవహారంపై పోలీసుల నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.