రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు
పాత విధుల్లోకి తహసీల్దార్‌లు ?
మనతెలంగాణ/హైదరాబాద్: ఇక నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ బాధ్యతలను డిప్యూటీ తహసీల్దార్‌లకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నట్టుగా సమాచారం. ఇప్పటికే డిప్యూటీ తహసీల్దార్‌లకు ధరణి పోర్టల్‌లో లాగిన్ సౌకర్యాన్ని కూడా కల్పించినట్టు తెలిసింది. ప్రస్తుతం ధరణి పోర్టల్‌ను ప్రారంభించి సంవత్సరం పూర్తి కావడంతో పాటు అనుకున్న విధంగా అది విజయవంతం కావడంతో తహసీల్దార్‌లను ఆ బాధ్యతల నుంచి తప్పించి డిప్యూటీలకు ఆ బాధ్యతలను అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా సమాచారం. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి రిజిస్ట్రేషన్ బాధ్యతలను తహసీల్దార్‌లు నిర్వర్తిస్తుండడంతో మిగతా రెవెన్యూ పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంటుంది. గతంలో తహసీల్దార్‌లకు రిజిస్ట్రేషన్‌లు బాధ్యతలు లేనప్పుడు వారు కీలకమైన 50కి పైగా బాధ్యతలను కలిగి ఉండేవారు. ప్రస్తుతం ఆ బాధ్యతలను పరిష్కరించడానికి వీరికి సమయం లేకపోవడంతో చాలా పనులు పెండింగ్ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు జిల్లాల నుంచి ప్రభుత్వానికి వీటిపై ఫిర్యాదులు అందుతుండడంతో ప్రభుత్వం వీరి నుంచి రిజిస్ట్రేషన్ బాధ్యతలను తప్పించాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. దీంతోపాటు తమకు పనిభారం ఎక్కువయ్యిందని రెవెన్యూ సంఘాల నాయకులు తహసీల్దార్‌ల తరపున సిఎం కెసిఆర్‌కు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది.
అదనపు విధులతో సతమతం
భూ దస్త్రాల నిర్వహణతో పాటు ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన విధులను రెవెన్యూ ఉద్యోగులు నిర్వర్తిస్తున్నారు. రెవెన్యూ వ్యవస్థలో తహసీల్దార్లే కీలకం కావడంతో అనేక బాధ్యతలు, విధులతో నిత్యం ప్రజలతో నేరుగా సంబంధాలు జరిపే కీలక అధికారికిగా వారికి గుర్తింపు ఉంది. నిత్యం ఒత్తిళ్లు, ప్రభుత్వ పాలన, పథకాల అమల్లో వారు అప్రమత్తంగా వ్యవహారించాల్సి ఉంటుంది. లబ్ధిదారుల గుర్తింపు, మెజిస్ట్ట్రేరియల్ అధికారాలతో పాటు భూములకు సంబంధించి అనేక అధికారాలు తహసీల్దార్‌లకే వర్తిస్తాయి. కీలకమైన 50కి పైగా అధికారాలతో పాటు మండలంలో అనేక బాధ్యతలను తహసీల్దార్‌లు నిర్వహిస్తున్నారు. ధరణి వచ్చినప్పటి నుంచి వారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు రిజిస్ట్రేషన్ బాధ్యతలు ఎక్కువగా ఉంటుండడంతో మిగతా పనులపై వారు దృష్టి సారించలేక పోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు పూర్తిస్థాయిలో తహసీల్దార్‌లు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది.
మెజిస్ట్రేట్ విధులతో పాటు శాంతిభద్రతలతో పాటు…
విఆర్‌ఓ, విఆర్‌ఏలపై పర్యవేక్షణ, అర్జీలపై సమీక్షలు, ఫ్రొటోకాల్ విధులు, కుల, ఆదాయ, నేటివిటి, ఫ్యామిలీ మెంబర్స్ ధ్రువీకరణ పత్రం, మెజిస్ట్రేట్ విధులతో పాటు శాంతిభద్రతలు, శవపంచనామా, రైల్వేలైన్ల బందోబస్తు నిర్వహణ, వెట్టి నిర్మూలన, ఇరిగేషన్ వనరుల తనిఖీ, సాగునీటి పంచాయతీల పరిష్కారం, వ్యవసాయ అవసరాలకు, పారిశ్రామిక అవసరాలకు నీటి కేటాయింపుల ఉత్తర్వులు, అనుమతుల జారీ, చెట్ల నరికివేత నియంత్రించడం, అక్రమ క్వారీలకు ఆపడం, అజమాయిషీల నిర్వహణ, ప్రభుత్వ ఆలయ భూములపై సమీక్షలు, భూ కబ్జాల నియంత్రణ, వ్యవసాయానికి, ఇళ్లకు భూ పంపిణీ, పట్టాల జారీ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, పింఛన్ల జారీ, భూ సేకరణ బాధ్యతలు తదితర వాటిని తహసీల్దార్లు పర్యవేక్షిస్తున్నారు.
574 తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ సౌకర్యం ధరణి పోర్టల్‌ను ప్రారంభించి గత అక్టోబర్ నెలకు సంవత్సరం పూర్తయ్యింది. 574 తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. సంవత్సర కాలంలో ధరణి పోర్టల్ ద్వారా 5.17 కోట్ల విలువ గల 10 లక్షల లావాదేవీలు జరగ్గా ధరణి ద్వారా 1,80,000 ఎకరాల భూములకు సంబంధించి పట్టాదార్ పాసు పుస్తకాలను అధికారులు జారీ చేశారు. ధరణి వెబ్ పోర్టల్ 5.17 కోట్ల హిట్‌లను సాధించింది. దీంతోపాటు ధరణిలో 31 లావాదేవీల మాడ్యూల్స్, 10 ఇన్ఫర్మేషన్ మాడ్యూల్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. సంవత్సర కాలంలో బుక్ చేసిన స్లాట్‌లు 10,45,878 కాగా, 10,00,973 లావాదేవీలు పూర్తయ్యాయి. దీంతోపాటు ధరణి పోర్టల్ మరో 20 సమస్యలు గుర్తించిన ప్రభుత్వం వాటిని పరిష్కరించడానికి ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసింది. ప్రస్తుతం వచ్చే నెలలోపు వాటిని కూడా పరిష్కరించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకెళుతోంది.