Friday, December 27, 2024

పాకిస్థాన్‌లో పట్టాలు తప్పిన రైలు

- Advertisement -
- Advertisement -

కరాచీ : దక్షిణ పాకిస్థాన్‌లో ఆదివారం ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిన దుర్ఘటనలో కనీసం 20 మంది మృతి చెందారు. 80 మందికి పైగా గాయపడ్డారు. దక్షిణ సింధు ప్రాంతంలోని నవాబ్‌షా నగరానికి సమీపంలోని సహారా రైల్వే స్టేషన్ వద్ద హజారా ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిందని ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఇది చాలా భారీ విషాద ఘటన, ప్రమాదంలో పలువురు మృతి చెందడం పట్ల విచారిస్తున్నామని రైల్వే మంత్రి ఖవాజా సాద్ రఫీఖ్ ప్రకటన వెలువరించారు.

45 మంది వరకూ గాయపడ్డారని, వీరిని చికిత్సకు ఆసుపత్రికి తరలించారని తెలిపారు. పెద్ద ఎత్తున సహాయక బృందాలు ఈ ప్రాంతానికి తరలివెళ్లుతున్నాయి. ప్రమాదానికి కారణాలు నిర్థారణ కాలేదు. యాంత్రిక లోపం వల్ల ప్రమాదం జరిగి ఉంటుంది. లేదా ఎవరో కావాలనే దుర్ఘటన జరిగేలా చేసి ఉంటారు. ఇది విద్రోహ చర్యగా భావించాల్సి ఉంటుందని, కారణాలు ఏమిటనేవి దర్యాప్తు చేస్తున్నామని మంత్రి తెలిపారు. హజారా ఎక్స్‌ప్రెస్ కరాచీ నుంచి అబోటాబాద్‌కు ప్రయాణిస్తూ ఉండగా పది వరకూ బోగీలు పట్టాలు తప్పాయి.

పట్టాలు తప్పిన రైలు బోగీలులో పలువురు చిక్కుపడ్డారు. చాలా మంది బయటికి రావడానికి కిటికి అద్దాలు పగులగొట్టేందుకు యత్నించడం, పలువురు ఆర్తనాదాలతో ఈ ప్రాంతం అంతా భయానకంగా మారింది. హరారా ఎక్స్‌ప్రెస్ డైలీ ఎక్స్‌ప్రెస్‌గా ఉంది. రేవు పట్టణం కరాచీ నుంచి బయలుదేరి ఖైబర్ ఫక్తూన్‌క్వా ప్రాంతంలోని హవేలియన్‌కు 33 గంటలలో చేరుతుంది. ఇక్కడ వాహనాలు వెళ్లే ప్రధాన రహదారికి రైల్వేలైన్‌కు మధ్య ఓ కాలువ ఉండటంతో సహాయక బృందాలు , స్థానికులు రైలు వద్దకు వెళ్లేందుకు కాలువలో నుంచే వెళ్లాల్సి వస్తోంది.

గాయపడ్డ పలువురిని చికిత్సకు అంబులెన్స్‌ల వద్దకు తీసుకువెళ్లారు. పాకిస్థాన్‌లో అత్యంత పురాతనమైన దాదాపు 7వేల కిలోమీటర్ల ( 4600 మైళ్ల) రైల్వేలైన్ ద్వారా ఏడాది ఎనిమిది కోట్ల మంది ప్రయాణిస్తూ ఉంటారు. ఇప్పటికి సరైన విధంగా భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో పలుసార్లు రైళ్లు పట్టాలు తప్పడం, ప్రమాదాలు చోటుచేసుకోవడం జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News