Wednesday, January 22, 2025

విద్యా సంస్థల మంజూరులో వివక్ష

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : విద్య ఎక్కడ ఉంటుందో అభివృద్ధి అక్కడే ఉంటుందlని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ విద్యాదినోత్సవాన్ని రవీంద్రభారతిలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా మహమూద్ అలీ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ భారత ప్రభుత్వం ప్రకటించిన పలు ఇండెక్స్‌లలో రాష్ట్రం మొదటి స్థానాల్లో ఉందన్నారు.

ఐదు రంగాలకు సిఎం కెసిఆర్ ప్రాధాన్యతనిచ్చారని, విద్య, వైద్యం. వ్యవసాయ రంగం, పార్రిశామిక రంగం, విద్యుత్ రంగాల్లో రాష్ట్రం అద్భుత ప్రగతిని సాధించి మొదటి స్థానంలో ఉందన్నారు. విద్యా రంగం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి, సిఎం కెసిఆర్ వెయ్యికి పైగా రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించారని, దేశంలో అత్యధిక గురుకులాలున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. రాష్ట్రంలో విద్యాశాఖది అతిపెద్ద కుటుంబమని ప్రకటించి మండలి చైర్మన్ విద్యాశాఖ నిర్వహణ అతి కష్టమైన బాధ్యతగా చెప్పారు. మరీ ముఖ్యంగా ఉపాధ్యాయుల ప్రాత కీలకమైనది, ఉపాధ్యాయులు బడుల్లోని చిన్నారులను తన సొంత కుటుంబంలా భావించాలన్నారు. తాము చిన్నప్పుడు పాఠశాల ముగియగానే ఏదో ఒక ఆటలో నిమగ్నమయ్యేవారి మని, ఇదే తరహాలో పాఠశాలల్లో స్పోర్ట్‌ను కచ్చితంగా అమలుచేయాలని, ప్రత్యేకంగా పీరియడ్‌ను కేటాయించడమే కాకుండా పిఇటి పోస్టులను భర్తీ చేయాలన్నారు. గురుకులాల్లో సీట్లు దొరకని పరిస్థితి ఉందని, సీట్ల కోసం సిఫారసు లేఖల కోసం ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిల వద్దకు వస్తున్నారని, గురుకులాల అద్భుత పనితీరుకు ఇదే నిదర్శనమన్నారు.

విద్యారంగంపై ఏటా 23వేల కోట్లు- సబితా ఇంద్రారెడ్డి

విద్యారంగంపై గతంలోని ప్రభుత్వాలు రూ. 8వేలకోట్లు మాత్రమే ఖర్చుచేస్తే, తెలంగాణ ప్రభుత్వం రూ.23 వేల కోట్ల రూపాయలు విద్యారంగంపై ఖర్చు చేస్తోందన్నారు. దీనిని ఖర్చుగా భావించడంలేదని, భావితరాలపై పెట్టుబడిగా భావిస్తోందన్నారు. రాష్ట్రంలోని 90కి పైగా డిగ్రీ కాలేజీలకు న్యాక్ గుర్తింపు రావడం ఒక రికార్డుగా అభివర్ణించారు. పాఠశాలలు ప్రారంభమైన రోజే యూనిఫారాలు, పాఠ్యపుస్తకాలివ్వడం గతంలో ఎన్నడూ జరగలేదన్నారు. పాఠ్యపుస్తకాల కవర్‌పేజీలను కొత్తగా రూపొందించామని, గతంలో వీటి కోసం రూ. 130కోట్లు ఖర్చుచేస్తే, ఈ ఏడాది రూ. 190కోట్లను ఖర్చుచేశామన్నారు. ప్రభుత్వ పాఠశాల్లోని విద్యార్థులు నోటుబుక్స్ కోసం ఇబ్బంది పడోద్దని, ఈ ఏడాది నుంచి 23 లక్షల విద్యార్థులకు నోటుబుక్స్‌ను అందజేస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాల లో చదివే పేద విద్యార్థులు నోట్ బుక్స్ కోసం ఇబ్బంది పడతారు నోటుబుక్స్ కూడా మనమే ఇద్దామని సిఎం కెసిఆర్ చెప్పారని, ఈ ఏడాది నుంచి నోట్ బుక్స్ కూడా ఉచితంగా అందజేస్తున్నామన్నారు. కాలికడుపుతో బడికొచ్చే చిన్నారుల ఆకలిని తీర్చడంలో భాగంగా వారంలో మూడు రోజులపాటు విద్యార్థులకు రాగిజావను ఈ ఏడాది నుంచే అందజేస్తున్నామన్నారు. ఇక మహిళా యూనివర్సిటీ ఏర్పాటుచేసిన సిఎం కెసిఆర్‌కు మహిళలందరి తరపున ధన్యవాదాలు తెలిపారు.

విద్యలేకపోతే అభివృద్ధి లేదు : హోం మంత్రి మహమూద్ అలీ

విద్యలేకపోతే అభివృద్ధి లేదని, ఈ కారణంగా సిఎం కెసిఆర్ విద్యకు అధిక ప్రాధాన్యతనిచ్చారని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతనిచ్చి, మన ఊరుమనబడి ద్వారా ప్రభుత్వం పాఠశాలలో అద్భుతంగా తీర్చిదిద్దుతోందని, ప్రభుత్వం బడ్జెట్లో అధిక నిధులు కేటాయించి, ఖర్చుచేస్తోందన్నారు. తెలంగాణ ర్రాష్టం ఏర్పడిన తరువాత పెద్ద ఎత్తున గురుకులాలు ఎర్పాటు చేసిందని, గతంలో మైనార్టీల కోసం 12 గురుకులాలుంటే కేవలం 2వేల మంది విద్యార్థులు మాత్రమే చదువుకున్నారని గుర్తుచేశారు. సిఎం కెసిఆర్ చొరవతో రాష్ట్రంలో మైనార్టీ గురుకులాల సంఖ్య 204కు చేరుకుందని, నేడు 50వేల మందికి పైగా మైనార్టీ విద్యార్థులు గురుకులాల్లో చదువుతున్నారని గుర్తుచేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ ఎంఎల్‌సి ఎవిఎన్‌రెడ్డి , విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఉన్నతవిద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్తమ ఫలితాలను సాధించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులను సత్కరించారు, ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేసారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News