సత్తుపల్లిః సత్తుపల్లి ఎంఎల్ఎ సండ్ర వెంకట వీరయ్య ఆచూకీ తెలపండని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్, ఐఎన్టియుసి సెంట్రల్ కౌన్సిల్ సెక్రెటరీ రావి నాగేశ్వరరావు, సత్తుపల్లి మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు దేశిరెడ్డి సత్యనారాయణరెడ్డిలు సత్తుపల్లి సిఐ కరుణాకర్‌కి బుధవారం ఉదయం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అకాల వర్షాల కారణంగా తడిచిన వరి మొక్కజొన్న పంటలను కొనుగోలు చేయకపోవడంతో రైతులు పుట్టెడు దుఃఖంలో ఉంటే మన ఎంఎల్ఎ సండ్ర వారికి అందుబాటులో లేరని తెలిసిందని, ఎంఎల్ఎ సండ్ర ఎక్కడ..? అని మేము ఆచూకీ కోసం ప్రయత్నిస్తే వారు విహారయాత్రల కోసం విదేశాలకు వెళ్లినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయన్నారు.
ఇది నిజమో కాదో.. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఎక్కడ ఉన్నారో తమరు కనుక్కొని ఎమ్మెల్యే దృష్టికి రైతుల పడుతున్నటు వంటి కష్టాలు తెలిపి రైతులకు మేలు చేయవలసిందిగా కోరుతున్నామని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మానవతారాయ్ మాట్లాడుతూ సత్తుపల్లి రైతులు దుఃఖంలో ఉంటే ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విదేశాల్లో విహారయాత్ర చేయడం ఎంత వరకు సబబు అని మండి పడ్డారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మండల కాంగ్రెస్ నాయకులు ఐ. కృష్ణ, ఎండి ఫజల్ రహమాన్ బాబా, అర్ఫత్ పాషా తదితరులు పాల్గొన్నారు.