Monday, December 23, 2024

పకడ్బందీగా ఓటరు జాబితా రూపకల్పన

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: జిల్లాలో డ్రాఫ్ట్ ఓటరు జాబితా రూపకల్పన పకడ్బందీగా చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుండి రాష్ట్రస్థాయి అధికారులతో కలిసి ఆయన రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈవీఎంలు, వీవీప్యాట్‌ల ఉపయోగం కోసం డిజిటల్ ఔట్రీచ్‌పై జిల్లా ఎన్నికల అధికారులతో చర్చించారు.

రెండవ విడత ఓటర్ జాబితా సవరణలో డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదల ముందు, వచ్చిన ప్రతి దరఖాస్తు స్క్రూటిని పూర్తి చేయాలన్నారు. ఓటరు జాబితా నుండి తొలగించిన ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో మరోసారి దృవీకరణ చేయాలన్నారు. ఇంటికి ఆరు కంటే ఎక్కువగా ఉన్న ఓటర్ల వివరాలను మరోసారి పరిశీలించాలన్నారు. ఓటరు జాబితాలో పెద్ద ఎత్తున ఓటర్ల వివరాలు తొలగించిన నేపథ్యంలో మరోసారి క్షేత్రస్థాయిలో వెళ్లి సర్వే చేపట్టాలన్నారు.

ఇంటి సర్వేలో వచ్చిన దరఖాస్తులు, ఆన్‌లైన్ ద్వారా ఫారం 6, 7, 8 దరకాస్తులను ఈ నెల 27 వరకు ఫీల్డ్ వెరిఫికేషన్ చేయాలన్నారు. జిల్లాలో పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సంఘం నిర్దేశాల మేరకు ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని మౌళిక వసతులు ఉండాలన్నారు. దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది అందుబాటులో ఉన్న సిబ్బందికి శిక్షణ అందించాలన్నారు. ప్రతి నియోజకవర్గ పరిధిలో ఈవీఎం, వీవీప్యాట్ వినియోగంపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

భారత ఎన్నికల సంఘం నిర్దేశం ప్రకారం ఈ నెల 28 నుంచి స్విప్ కార్యక్రమాలు విస్తృతం చేయాలని, వీటిపై రాజకీయ పార్టీలకు సమాచారం అందించాలన్నారు. సరిగా పని చేస్తున్న ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల వివరాలు రాజకీయ పార్టీలకు ఇవ్వాలన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలు తయారు చేయాలని ఆయన అన్నారు.

వీడియో సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ, జిల్లా అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, కుమార్ దీపక్‌లు కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ వారిగా వాహనాలు ఏర్పాటు చేసి ప్రతి గ్రామం, ఆవాసాల వారిగా పర్యటించి ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల వినియోగంపై అవగాహన కల్పించాలన్నారు.

ఈ నెల 20 నుంచి అవగాహన కార్యక్రమాలు ప్రారంభించాలని, వీటిపై అధికారులకు శిక్షణ ఇవ్వాలని, సెప్టెంబర్‌చివరి వరకు జిల్లాలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పూర్తిస్థాయి అవగాహన కల్పించేలా ప్రణాళిక రూపొందించుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ వీరబ్రహ్మచారి, ప్రాంతీయ రవాణా అధికారి రంగారావు, ఎన్నికల డీటీ ప్రవీణ్ తదితర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News