Saturday, December 28, 2024

చెక్కపెట్టేలో మృతదేహం.. వీడిన మిస్టరీ

- Advertisement -
- Advertisement -

ఎపిలోని పశ్చిమగోదావరి జిల్లాలో సంచలనం సృష్టించిన చెక్కపెట్టేలో మృతదేహం కేసు దర్యాప్తు పూర్తయిందని ఎస్పీ నయీంఅస్మీ శుక్రవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ కేసులో శ్రీధర్ వర్మ, అతని రెండో భార్య రేవతి, ప్రియురాలు సుష్మలను ప్రధాన నిందితులుగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఈ నెల 19న సమాచారం రాగానే దర్యాప్తు ప్రారంభించామని పలు కోణా ల్లో విచారించి అసలు నిందితులను గుర్తించినట్లు వివరించారు. ’గ్రామానికి చెందిన రంగరాజు కుమార్తెలు తులసి, రేవతిల మధ్య గొడవలు ఉన్నాయి. 2016లో రేవతికి శ్రీధర్ వర్మతో వివాహం జరిగింది. తులసిని భర్త వదిలేయడంతో పుట్టింటికి వచ్చి ఉంటోంది. రంగరాజుకు 2.5 ఎకరాల పొలం, కొంత స్థలం, బంగారం ఉన్నాయి. ఈ ఆస్తి కోసం కుట్ర పన్నిన వర్మ తులసి అవసరాన్ని ఆసరాగా తీసుకుని ఈ కుట్రలో ఇరికించాలని యత్నించాడు. క్షత్రియ సేవా సమితి పేరిట తులసి ఇంటి నిర్మాణానికి సహకరిస్తున్నట్లు కొన్నాళ్లు రేవతి, వర్మ నాటకమాడారు.

ఈ క్రమంలోనే కొన్ని వస్తువులను శ్రీధర్‌వర్మ పంపారు. ఇందులో భాగంగానే పర్లయ్య మృతదేహం పంపించారు.’ అని ఎస్పీ తెలిపారు. డెడ్‌బాడీతో తులసిని భయపెట్టి ఆస్తి జోలికి రాకుండా చేయడమే లక్ష్యంగా శ్రీధర్ వర్మ పన్నాగం పన్నినట్లు ఎస్పీ తెలిపారు. ’పర్లయ్యను పట్టించుకునే వారే లేకపోవడంతో ఆయన్ను చంపేశారు. బాగా మద్యం తాగించి సుష్మకి చెందిన పొలానికి తీసుకెళ్లి నైలాన్ తాడుతో కట్టి చంపారు. తొలుత మృతదేహాన్ని చూసి భయపడినా తులసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహం ఎక్కడి నుంచి వచ్చిందన్న కోణంలో విచారించగా అసలు నిందితుడు శ్రీధర్‌వర్మ పాత్ర బయటపడింది. నిందితుడిని మచిలీపట్నం సమీపంలో అరెస్ట్ చేశాం. మామ ఆస్తి, అందులో తులసి వాటాపై కన్నేసి నిందితుడు ఈ పథకం రచించాడు. జూన్ నుంచే ఈ తతంగానికి కుట్ర పన్నారు. దాదాపు 100 మంది పోలీస్ సిబ్బంది ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్నారు.’ అని ఎస్పీ వివరించారు. చెక్కపెట్టెలో మృతదేహాన్ని చూసిన తులసిని శ్రీధర్‌వర్మ బెదిరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆందోళనలో ఉన్న ఆమెతో శవం విషయం బయటకు పొక్కకుండా చూసుకుంటానని ఆస్తి పత్రాలపై సంతకాలు చేయాలని తీవ్రంగా ఒత్తిడి తెచ్చాడు.

’సంతకం పెడతావా లేదా నువ్వూ శవమవుతావా.?’ అని ఆమెను బెదిరించినట్లు సెల్ ఫోన్ సైతం లాక్కున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తులసి తన దగ్గరున్న మరో ఫోన్‌తో తనకు తెలిసిన వారికి చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలపగా అలానే చేసింది. కాగా, నిందితుడు శ్రీధర్‌వర్మ తన ప్రియురాలు సుష్మ, తన కుమార్తెతో కలిసి కారులో కృష్ణా జిల్లా బంటుమిల్లి మీదుగా ముంగినపూడి బీచ్‌కు చేరుకున్నాడు. తర్వతా సమీపంలోని ఓ ఇల్లు అద్దెకు తీసుకోగా పోలీసులు గాలిస్తున్న సమయంలో తమ ప్రాంతానికి ముగ్గురు కొత్త వారు వచ్చారన్న గ్రామస్థుల సమాచారంతో నిందితులను పట్టుకున్నారు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు శ్రీధర్‌వర్మ 40కి పైగా సిమ్ కార్డులు ఉపయోగించాడు. అతని ఖాతాలో రూ.2 కోట్లు ఉన్నాయని తెలుసుకున్న పోలీసులు విస్తుపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News