రియో డి జనిరో: అధికారం కోసం మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సనారో మద్దతుదారులు ఆదివారం ఏకంగా దేశ రాజధానిలోని కీలక ప్రభుత్వ భవనాలను ఆక్రమించారు. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో బోల్సొనారో ఓటమిని అంగీకరించడానికి వారు నిరాకరిస్తూ సుప్రీంకోర్టు, కాంగ్రెస్( పార్లమెంటు), అధ్యక్ష భవనాల్లోకి చొచ్చుకు పోయారు. గత వారమే దేశాధ్యక్షుడిగా లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వాఅధికారం చేపట్టిన విషయం తెలిసిందే. దీనికి నిరసనగా వేలాది మంది బోల్సొనారో మద్దతుదారులు ఆదివారం భద్రతా వలయాలను ఛేదించుకుని కీలక భవనాల్లోకి చొరబడ్డారు.ఆకుపచ్చ, పసుపు దుస్తులు ధరించి జాతీయ జెండాలను చేతపట్టుకునిఆందోళనకారులు తలుపులు బద్దలు కొట్టి మరీ పార్లమెంటు భవనంలోకి చొరబడ్డారు. అయితే ఆ సమయంలో ఆ భవనాల్లో ఎవరూ లేరు. కొందరు ఆందోళనకారులు అక్కడి కిటికీలను, విలువైన సామగ్రిని ధ్వంసం చేశారు. బ్రెజిల్‌లో అధ్యక్ష కార్యాలయం, నేషనల్ కాంగ్రెస్, సుప్రీంకోర్టులను అధికార కేంద్రాలుగా భావిస్తారు.
ఈ చర్యతో సుప్రీంకోర్టు వద్ద భద్రతా దళాలు హెలికాప్టర్లనుంచి భాష్పవాయువును ప్రయోగించాయి. అక్కడ అల్లర్లను కవర్ చేస్తున్న జర్నలిస్టులపైన కూడా ఆందోళనకారులు దాడి చేశారు.సైన్యం జోక్యం చేసుకుని బోల్సొనారోకు అధికారం అప్పజెప్పడం కానీ, ప్రస్తుత అధ్యక్షుడు లూలాను గద్దె దింపడం కానీ చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 3000 మందికి పైగా అల్లరి మూకలు ఈ దాడుల్లో పాల్గొన్నట్లు భావిస్తున్నారు. నేషనల్ కాంగ్రెస్ భవనం వద్ద పోలీసులు ఇప్పటికే 300 మందిని అరెస్టు చేశారు. 2021 జనవరి21న అమెరికాలో అధ్యక్ష ఎన్నికల సమయంలో మాజీ అధ్యక్షుడు ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ హిల్‌పై జరిపిన దాడులను ఈ ఘటనలు గుర్తు చేస్తున్నాయి.
భద్రతా దళాల మోహరింపు
బ్రెజిల్ అల్లర్లపై అధ్యక్షుడు లూలా స్పందించారు. బోల్సొనారోనే అల్లరి మూకలను రెచ్చగొట్టారని ఆరోపించారు. ఈ మూకలను ఫాసిస్టు మతోన్మాదులుగా ఆయన అభివర్ణించారు. అల్లర్లను భద్రతా దళాలు నిర్దాక్షిణ్యంగా అణచివేయాలని ఆదేశించారు.‘ వారు చేసిన పనిని వర్ణించలేము. దోషులు శిక్ష అనుభవించాల్సిందే’ అని ఆయన అన్నారు. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో లూలాకు 50.9 శాతం ఓట్లు, బోల్సొనారోకు 49.1 శాతం ఓట్లు వచ్చాయి. అయితే ఎన్నికల ఫలితాలను అంగీకరించడానికి బోల్సొనారో నిరాకరిస్తున్నారు. దేశంలోని కోర్టులు, ఎన్నికల వ్యవస్థలు తనకు వ్యతిరేకంగా పని చేస్తున్నాయని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే ఈ దాడితో తనకు సంబంధం లేదని ఆయన బోల్సొనారో ప్రకటించారు. లూలా ఆరోపణలు నిరాధారమైనవన్నారు. అలాగే నిరసనకారులెవరైనా సరే శాంతియుతంగా వ్యవహరించాలన్నారు. ప్రస్తుతం బొల్సొనారో అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్నట్లు సమాచారం.
అల్లర్లను ఖండించిన మోడీ, ప్రపంచ దేశాల నేతలు
బ్రెజిల్‌లో జరిగిన అల్లర్లను ప్రపంచ నేతలు ఖండించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ బ్రెజిల్ అల్లర్లపై స్పందించారు. బ్రెజిల్‌లోని ప్రభుత్వ భవనాలవిధ్వంసం వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ప్రజాస్వామ్య సంప్రదాయాలను ప్రతిఒక్కరూ గౌరవించాలని సూచించారు. బ్రెజిల్ అధికారులకు తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ అల్లర్లను ఖండించారు. ‘శాంతియుత అధికార మార్పిడి, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిని ఖండిస్తున్నా. బ్రెజిల్‌లోని ప్రజాస్వామ్య వ్యవస్థలకు మా మద్దతు ఉంటుంది.ఆ దేశ ప్రజల ఆకాంక్షలను అణగదొక్కకూడదు. నేను భవిష్యత్తులో లూలాతో కలిసి పని చేయడంపై దృష్టిపెట్టాను’ అని బైడెన్ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్, బ్రిటన్ విదేశాంగమంత్రి జేమ్స్ క్లెవర్లీ కూడా ఈ దాడులను ఖండించారు.
బ్రాసిలియా గవర్నర్ సస్పెన్షన్
అయితే భద్రతా దళాల వైఫల్యం వల్లనే ఈ దాడులు జరిగాయని భావించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు బ్రాసిలియా గవర్నర్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. మూడు నెలలపాటు ఆయనను బాధ్యతలనుంచి తొలగిస్తున్నట్లు పేర్కొంది.అల్లర్లకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, దాడులపై వెంటనే దర్యాప్తు ప్రారంభించాలని ఆదేశించింది.