మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (టిఎస్‌టిడిసి) బ్రాండ్ అంబాసిడర్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు బిగ్‌బాస్ ఫేం దేత్తడి హారిక ప్రకటించారు. ఈ నియామకం వివాదాస్పదమైంది. దీంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గురువారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక వీడియోను షేర్ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున (ఈ నెల 8వ తేదీన) టిఎస్‌టిడిసికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోకుండా నియామకం చేపట్టారంటూ పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నిర్ణయం వివాదం కావడంతో ముఖ్యమంత్రి కార్యాలయం పర్యాటక అభివృద్ధి సంస్థను వివరణ కూడా అడిగింది. పైగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ, దేత్తడి హారిక ఎవరో తనకు తెలియదని వ్యాఖ్యానించారు. ఈ నియామకంపై తనకు ఎలాంటి సమాచారం కూడా లేదని ఆయన వ్యాఖ్యానించారు.
ఇలా టిఎస్‌టిడిసికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఆమె నియమితులైన రోజు నుంచే తీవ్ర స్థాయిలో విమర్శలు రావడం, రోజుకో వివాదం తలెత్తుతుండడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ క్రమంలోనే అలేఖ్య హారిక తాజాగా ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల తాను అంబాసిడర్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని తెలిపారు. తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. తాను తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిఒక్కరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ఇక నుంచి సిరీస్‌లపై ఎక్కువ దృష్టి సారిస్తానని హారిక పేర్కొన్నారు.
Dethadi Harika Resign to Tourism Brand Ambassador