వాషింగ్టన్ : అమెరికాలో ప్రతిష్టాత్మక 2023 స్క్రిప్స్ జాతీయ స్పెల్లింగ్ బి ఛాంపియన్ షిప్ పోటీల్లో భారతీయ సంతతి బాలుడు 14 ఏండ్ల దేవ్ షా విజేత అయ్యారు. అత్యంత క్లిష్టమైన సామోఫైల్ పదాన్ని ఈ ఎనిమిదో తరగతి బాలుడు స్పష్టంగా ఉచ్ఛరించి తన అక్షర ప్రతిభను చాటుకున్న దశలో కరతాళధ్వనుల మధ్య బాలుడికి కిరీటం తొడిగారు. 95వ నేషనల్ బి పోటీలో విజేత అయిన దేవ్ షాకు పారితోషికంగా 50వేల డాలర్లు బహుకరించారు. భారతీయ కరెన్సీలో ఇది రూ 41 లక్షల వరకూ ఉంటుంది. మేరీలాండ్‌లోని నేషనల్ హార్బర్‌లో ఈ పోటీ జరిగింది. తనకు చాలా భయం వేసిందని, ఇప్పటికీ తన కాళ్లు వణుకుతున్నాయని ఈ బాలుడు ఆనందం పట్టలేక తెలిపాడు.
ఇసుక ప్రాంతాలలో సంచరించే ఓ ప్రాణి పదాన్ని సరిగ్గా పలికినందుకు ఈ సత్కారం దక్కించుకున్నాడు. ఇంతకు ముందు ఈ పోటీలకు ఆయన రెండుసార్లు హాజరయ్యారు.పట్టుదల వీడకుండా మూడోసారి విజయం దక్కించుకున్నట్లు న్యూయార్క్ టైమ్స్‌పత్రిక తెలిపింది. తమ బాబు సాధించిన విజయంతో అక్కడనే ఉన్న తల్లిదండ్రులు సంతోషంతో గంతేశారు. ఈ పోటీలలో రెండో స్థానాన్ని వర్జినియాకు చెందిన 14 ఏండ్ల బాలుడు క్లారెట్ వాల్ష్ దక్కించుకున్నారు. బాలల్లో ఉచ్ఛారణ, పదాల పొందిక పట్ల ఆసక్తి పెంపొందింపచేసేందుకు 1925లో ఈ పోటీని ప్రవేశపెట్టారు