కరోనాకాలంలో పేద విద్యార్థులకు సాయం
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక డయానా అవార్డుకు ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీ విద్యార్థిని దేవాన్షీ రంజన్(21) ఎంపికయ్యారు. కొవిడ్19 మహమ్మారి విజృంభిస్తున్నవేళ అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా తన వంతు సాయమందించినందుకు దేవాన్షీని ఈ అవార్డుకు ఎంపిక చేశారు. లేడ్లీ ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న పాఠాశాల అనే కార్యక్రమంలో దేవాన్షీ చురుగ్గా పాల్గొన్నారు. ఢిల్లీలోని మురికి వాడలు, శివారు ప్రాంతాల్లోని పేద విద్యార్థులు చదువుకు దూరం కాకుండా సంస్థ తరఫున సహాయ కార్యక్రమాలు చేపట్టారు. దాదాపు 1000మందికిపైగా పేద విద్యార్థులకు పుస్తకాలు, ఇతర సామగ్రిని అందించడంతోపాటు తరగతులు నిర్వహించారు.
తనను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు మే 5నే తెలిసినప్పటికీ సన్నిహిత కుటుంబసభ్యులకు మినహా ఎవరికీ చెప్పలేదని దేవాన్షీ గుర్తు చేశారు. జూన్ 28న జరిగే వర్చువల్ ఫంక్షన్ వరకూ వేచి చూడాలని నిర్ణయించుకున్నానన్నారు. డయానా అవార్డుకు ఈసారి ప్రపంచవ్యాప్తంగా 400మందిని ఎంపిక చేశారు. బ్రిటీష్ యువరాణి దివంగత డయానా పేరుమీద అక్కడి ప్రభుత్వం ఈ అవార్డును ఏర్పాటు చేసింది. రెండేళ్లకోసారి ప్రపంచవ్యాప్తంగా 925 ఏళ్ల వయసులోని సామాజిక కార్యకర్తలను ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు.