మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ‘దేవర’ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. కొరటాల శివ తెరకెక్కించిన దేవర చిత్రానికి ఆడియెన్స్ మరుపురాని హిట్‌ను అందించారు. సైఫ్ అలీఖాన్ భైరాగా, జాన్వీ కపూర్ ఫీమేల్ లీడ్‌గా ఎన్టీఆర్ ఆర్ట్, యువసుధ ఆర్ట్ బ్యానర్ల మీద కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవర మూవీ క్వాలిటీ, నిర్మాణ విలువలు, ఆకర్షణీయమైన కథనం, ప్రచార కార్యక్రమాలతో బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్‌ను సాధించింది. 500 కోట్లకు పైగా వసూలు చేసి గణనీయమైన లాభాలను ఆర్జించింది.
ఈ అద్భుతమైన విజయం ఎన్టీఆర్‌కు గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఈ అద్భుతమైన విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు, అభిమానులకు, చిత్ర బృందానికి, మీడియాకు ఎన్టీఆర్ హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతూ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ నోట్లో నటుడు సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ వంటి వారు పాత్రలకు ప్రాణం పోయడం, దర్శకుడు కొరటాల శివ తన అద్భుతమైన విజన్, టీమ్ పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చిందని అన్నారు. దేవర కోసం పని చేసిన సాంకేతిక నిపుణులను ఎన్టీఆర్ అభినందిస్తూ.. సినిమా విజయవంతమవడానికి అవసరమైన డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లను అభినందించారు.
సినిమా విజయానికి ముఖ్య సహకారం అందించిన నిర్మాతలు సుధాకర్ మిక్కిలినేని, హరికృష్ణ కొసరాజులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులకు, సినిమాను ఆస్వాదించిన ప్రేక్షకులకు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. “దేవర పార్ట్ 1కి వచ్చిన ఆదరణ, కురిపిస్తున్న ప్రేమను చూసి నాకు ఎంతగానో సంతోషం వేస్తోంది. ఈ చిత్రం నాకు ఎంతో ప్రత్యేకమైంది. ఇంత స్పెషల్ అయిన చిత్రానికి మీ అందరూ ప్రేమను, సపోర్ట్‌ను ఇచ్చి బ్లాక్‌బస్టర్ చేయడం చూసి మరింత ఆనందం వేస్తోంది. నా సహ నటులు సైఫ్ అలీ ఖాన్, జాన్వీ, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్… సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఇంత గొప్ప ప్రపంచాన్ని క్రియేట్ చేసిన కొరటాల శివకి థాంక్స్”అని ఎన్టీఆర్ అన్నారు.