Friday, December 20, 2024

’దేవరగట్టు’ కర్రల సమరంలో చిందిన రక్తం 

- Advertisement -
- Advertisement -

70 మందికి గాయాలు… ఇద్దరి పరిస్థితి విషమం

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపిలోని దేవరగట్టు కర్రల సమరంలో ఎలాంటి హింస జరగకుండా ఆపేందుకు పోలీసులు ముందస్తుగా చేపట్టిన చర్యలు, అధికారులు వేసిన ప్రణాళికలు ఫలించలేదు. తత్ఫలితంగా కర్రల సమరంలో 70 మంది గాయపడ్డారు. గాయపడిన వాళ్లను ఆసుపత్రికి తరలించగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. ఎపిలోని కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టు ప్రాంతంలో ఏటా దసరా రోజు అర్ధరాత్రి బన్ని ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవంలో కర్రల సమరం ఉంటుంది.

అంటే కర్రలతో రెండు గ్రూపులు కొట్టుకుంటాయి. ఈ కర్రల సమరంలో ఈసారి వేడుకల్లో 70 మంది గాయపడ్డారు. దేవతామూర్తుల కోసం ఈ కర్రల సమరం జరుగుతుంది. హింసకు తావులేకుండా బన్ని ఉత్సవాన్ని నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలు ఎలాంటి సత్ఫలితాలను ఇవ్వలేదు. ఈసారి కూడా ఎప్పటిలాగే హింస చెలరేగింది. రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరులో 70 మంది గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషయంగా ఉంది. గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు.

దసరా సందర్భంగా కర్రల దేవరగట్టు ప్రజలు కర్రల సమరాన్ని దశబ్దాలుగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఏటా జరిపే ఈ ఉత్సవం ఆనవాయితీగా వస్తోంది. కర్నూలు జిల్లా ఆలూరు సమీపంలోని దేవరగట్టు వద్ద కొండపై వెలిసిన మాళమల్లేశ్వరస్వామి ఆలయం ఉంది. ఎప్పటిలాగే దేవతామూర్తులైన మాళమ్మ, మల్లేశ్వరస్వామికి దసరా రోజు అర్ధరాత్రి 12 గంటలకు కల్యాణం నిర్వహించారు. అనంతరం కొండకు సమీప ప్రాంతాల్లో పాదాలగట్టు, రక్షపడ, శమీవృక్షం, ఎదురుబసవన్న గుడి మీదుగా దివిటీల వెలుగుల్లో ఆ దేవతామూర్తుల విగ్రహాలను ఊరేగించారు. ఈ సందర్భంగా దేవతా మూర్తుల విగ్రహాలను దక్కించుకోవడమే లక్ష్యంగా 5 గ్రామాల ప్రజలు ఓ వర్గంగా, మరో 3 గ్రామాల ప్రజలు ఇంకో వర్గంగా ఏర్పడి కర్రలతో సమరానికి దిగుతారు.

దీనినే దేవరగట్టు కర్రల పోరు అంటారు. మాళమ్మ, మల్లేశ్వర స్వామివార్లు రాక్షసున్ని సంహరించిన అనంతరం బన్ని ఉత్సవం నిర్వహిస్తారు. తమ ఇలవేల్పు అయిన దేవతామూర్తులను స్వాధీనం చేసుకోవటం కోసం నెరణికి, నెరణికితండా, కొత్తపేట గ్రామాల ప్రజలు ఓ జట్టుగా ఏర్పడ్డారు. సుళువాయి, ఆలూరు, ఎల్లార్తి, అరికెర, నిడ్రవట్టి, బిలేహాల్ తదితర గ్రామాల ప్రజలు మరో జట్టుగా కర్రలతో తలపడ్డారు. ఇందులో ఇరువర్గాలకు చెందిన వారు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ కర్రల సమరాన్ని చూడటానికి రాష్ట్రం నలుమూలనుంచే నుంచే కాకుండా కర్ణాటక నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. బన్ని ఉత్సవంలో హింసను నివారించడానికి 800 మంది పోలీసులు మోహరించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దేవగట్టు పరిసర ప్రాంతాల్లో సిసి కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిఘాను పటిష్ఠం చేసినప్పటికీ రక్తం చిందింది. గాయపడ్డవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల ఆదోని ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News