కర్నూలు: నేడు విజయదశమి సందర్భంగా అర్ధరాత్రి దేవరగట్టులో కర్రల సమరం జరుగనుంది. ప్రతి ఏటా వందలాది మంది తలలు పగిలి రక్తం కారినా ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. ఈ ఉత్సవాలను చూసేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. ఈ కర్రల సమరం హింసాత్మకం కాదని, భక్తితో కూడుకున్న సంప్రదాయమని అంటుంటారు.
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హోళగుంద మండలంలోని నెరణి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల మధ్యన సముద్ర మట్టానికి దాదాపు 2000 అడుగుల ఎత్తులో దేవరగట్టు అనే దట్టమైన అటవీ ప్రాంతంలో ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో గాయపడిన వారికి స్వామి వారికి చల్లే పసుపునే అంటిస్తారు. ఈ ఉత్సవాల్లో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు 800 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ పర్యవేక్షణలో ఈ బందోబస్తు ఏర్పాటు చేశారు. 100 నైట్ విజన్ సిసి కెమరాలు, 700 ఎల్ఈడి లైట్లు, 5 డ్రోన్ కెమెరాలు, వీడియో కెమెరాల మధ్య నేటి రాత్రి ఈ కర్రల సమరం జరుగనున్నది.