నరేంద్ర మోడీ ఒకప్పుడు తనకు సహాయపడిన ప్రతి వంతెనను కూల్చారు. ప్రతి సూక్ష్మ పరిశీలనను విరోధం చేసుకున్నారు. ప్రతి సంస్థకు శిరచ్ఛేదం చేశారు. ఇప్పడు వాటితోనే సయోధ్య నెరపవలసిన అగత్యం ఏర్పడింది. నరేంద్ర మోడీ బాల్యంలో బడికి వెళ్ళకుండా, రైల్వేస్టేషన్‌లో టీ అమ్మాల్సిన దుస్థితి ఏర్పడింది. బడికి వెళ్ళి చదువుకునే అవకాశమే వచ్చినట్టయితే, రెండు పాత సామెతల జ్ఞానం లభించేది. ‘నీ పక్కనున్న వంతెనను కూల్చకు, రేపు నీకది ఉపయోగపడుతుంది’ ‘నీవు ముందుకు సాగుతున్నప్పుడు ప్రజలతో మర్యాదగా వ్యవహరించు. నీవు తిరిగి వెళ్ళేటప్పుడు వారి అవసరం ఉంటుంది కనుక’ ఈ రెండు సామెతల జ్ఞానాన్ని పొందగలిగినట్టయితే ఈ రాజకీయ సంక్షోభ సమయంలో ప్రజలు ఆయనను ఒక బలమైన శక్తిగా నిలబెట్టగలిగేవారు.
భారత దేశంలో మోడీ సృష్టించిన విధ్వంసాన్ని మూడు దశలుగా చూడవచ్చు. మొదటిది; నోట్లు రద్దు చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థ పునాదులపైన దెబ్బకొట్టారు. వస్తు సేవల పన్నును తీసుకొచ్చారు. పత్రికారంగాన్ని బెదిరించడం ద్వారా దాన్ని నోరెత్తకుండా చేశారు. రెండవది; ప్రధానిగా రెండవ సారి అధికారం చేపట్టాక తొమ్మిది రాష్ర్ట ప్రభుత్వాలను దించేయడానికి ప్రయత్నించి ఫెడరలిజాన్ని దెబ్బ తీశారు. కశ్మీర్‌తో ఉన్న సంబంధాలను పునర్లిఖించారు. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరసత్వ నమోదు చట్టం, రామమందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు తీర్పు పొందడం ద్వారా హిందూ రాష్ర్ట ఏర్పాటును ముందుకు తెచ్చారు. మూడవది; అందరికీ వ్యాక్సిన్ వేయకుండా పార్లమెంటును సుషుప్తావస్తకు తీసుకెళ్ళారు. మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను తీసుకు రావడం, కార్మిక చట్టాలను సవరించడం, మన భూభాగంలో ఉన్న చైనా ఆక్రమణను అంగీకరించడం ద్వారా హిందూ రాష్ట్రా ఏర్పాటును కార్పొరేట్ హిందూ రాష్ర్ట ఏర్పాటుగా స్థాయిని పెంచారు.
సాధారణ సంస్థలతో పాటు రాజ్యాంగ వ్యవస్థలను కూడా అణచివేసి, పెద్ద ఎత్తున ఎన్‌ఫోర్స్‌మెంట్, పోలీసు వ్యవస్థలను దుర్వినియోగం చేశారు. అంతులేని అహంకారంతో ప్రజాభిప్రాయాన్ని లెక్కచేయకుండా, అసమ్మతిని అణచివేసి, తప్పుడు ప్రచారం ద్వారా గోబెల్స్‌ను అనుసరించారు. మెజారిటీ ప్రజల (హిందూ) రాజ్యాన్ని నిర్మించడంలో తాము సాధించిన ఘన కార్యాలుగా, చరిత్రలో మైలు రాళ్ళుగా ఈ మూడు దశలను భావిస్తున్న మోడీ, అతని అనుచరులు ఎన్ 95 మాస్కును మూతి, ముక్కుకు బదులు కళ్ళకు కట్టుకున్నారు. కానీ వీటిని తాము కనుగొన్న గొప్ప విజయాలుగా వారిప్పుడు భావిస్తున్నారు. ఈ దేశాన్ని పాలించడానికి ఇక ఏమాత్రం అర్హుడు కాని విధంగా మోడీని తయారు చేశారు. ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వం పని చేసే విధానాన్ని నాశనం చేశారు. ఇప్పుడు దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై ఎక్కుపెట్టాల్సిన బాణాలను వదిలేసి అస్త్రసన్యాసం చేశారు. ప్రకృతి విధ్వంసం విలయతాండం చేస్తున్న ఈ సమయంలో తీరని అధికార దాహంతో, మితిమీరిన విశ్వాసంతో చేసిన ఈ పనులకు తనను తానే నిందించుకోవాలి.
కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటంలో విభేదాలను పక్కనపెట్టి ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పక్షాన నిలబడాలని మోడీ ఇప్పుడు పిలుపునిస్తున్నారు. ఇది కప్టం కాకపోతే వ్యంగ్యం అయినా కావచ్చు. ఈ ఏడు సంవత్సరాల పాలనా కాలంలో మరింత రాజకీయాధికారాన్ని చేపట్టడానికి కులం, మతం, ప్రాంతం పేరుతో జాతిని విచ్ఛిన్నం చేశారు. రైతులు, విద్యార్థులు, మేధావులు, జర్నలిస్టులు, శాస్త్రవేత్తలు, కార్మికులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యావేత్తలు, సంఘసేవకులు; ఇలా ఒకరేమిటి సమాజంలోని అన్ని వర్గాల పైనా ప్రతీకారం తీర్చుకుంటున్నారు.
నూతన కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా 2020 నవంబర్‌లో 250 మిలియన్ల కార్మికులు, ఆయుర్వేద వైద్యులు ఆపరేషన్లు చేయడానికి అనుమతివ్వడానికి నిరసనగా అదే ఏడాది డిసెంబర్‌లో 11న పది లక్షల మంది వైద్యులు, బ్యాంకులను, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ పది లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు ఆందోళనలకు దిగారు. రైతుల ఆందోళన ఇంకా కొనసాగుతునే ఉంది. అయినా మోడీ ఏమాత్రం రాజీపడకుండా మూర్ఖంగానే వ్యవహరిస్తున్నారు. వలస కార్మికుల దయనీయ స్థితి గురించి నోరెత్తి మాట్లాడ లేదు. కానీ ఇప్పుడు మాత్రం వీరంతా తనకు మద్దతుగా రావాలని భావిస్తున్నారు.
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ఆయన వైఫల్యాన్ని ప్రతిపక్షాలు తప్పుపట్టకుండా ఉండడానికి ఫెడరలిజం అన్న పదాన్ని కో ఆపరేటివ్ ఫెడరలిజం అని తెలివిగా ఎలా చెపుతున్నారో చూడండి. ప్రతిపక్షమే లేకుండా చేయడానికి ‘కాంగ్రెస్ ముక్తి’ అని ఎంత గట్టిగా అంటున్నారో చూడండి. ఎందుకంటే రేపు భారత దేశం ‘ఒకే జాతి ఒకే పార్టీ’ అని చెప్పడానికి ఇదొక ఎత్తుగడ. దీన్ని సాధించడానికి, రాజకీయ పార్టీలను దెబ్బతీయడానికి సిబిఐ, ఎన్‌ఐఎ, ఇడి, ఆదాయ పన్ను శాఖ, ఫ్రండ్లీ పోలీస్ ఫోర్స్‌ను ఉపయోగిస్తున్నారు. ప్రజాస్వామ్యయుతంగా తొమ్మిది రాష్ట్రాలలో ఎన్నికైన ప్రభుత్వాలను దించేయడానికి వేల కోట్ల రూపాయల ఎలక్ట్రోల్ బాండ్లను ఉపయోగించుకున్నారు.
మోడీ ఫెడరలిజాన్ని ఎగతాళి చేస్తున్నారు. గొప్పదనాన్ని ఎవరితోనూ పంచుకోనట్టుగానే, అధికారాన్ని కూడా ఎవరితోనూ పంచుకోరు. ఎన్నికల్లో రెండు కోట్ల మంది ఢిల్లీ ప్రజలు అతని పార్టీని తన్ని తరిమేసి ఆవ్‌ు ఆద్మీ పార్టీకి అధికారం అప్పచెప్పినా, చట్టం ద్వారా లెఫ్టినెంట్ గవర్నర్‌నే ప్రభుత్వంగా నిలబెట్టడం ద్వారా, వివాదాస్పద వ్యవసాయ చట్టాలను, జిఎస్‌టిని తేవడం ద్వారా రాష్ట్రాల అధికారాలలోకి మోడీ చొరబడడం చాలా ప్రమాదకరం. కేంద్ర రెవెన్యూ నుంచి రాష్ట్రాల వాటాను లాగేయడానికి ఫైనాన్స్ కమిషన్ నిబంధనలను మార్చేశారు.
రాష్ట్రాలకు ఇవ్వాల్సిన జిఎస్‌టి బకాయిలను ఎగరగొట్టారు. రాష్ర్ట పోలీసులను అడ్డుకోవడానికి ఎన్‌ఐఎ, సిబిఐ, ఇడి లను ఉపయోగింస్తున్నారు. వ్యాక్సిన్ ఉత్పత్తిలో కానీ, అమ్మకాలు, పంపిణీలో కానీ, కోవిడ్‌ను ఎదుర్కోవడానికి చేపట్టే విధాన రూపకల్పనలోకానీ, స్టాండింగ్ ఆపరేషన్ ప్రాసెస్(ఎస్‌ఓఎస్)లో కానీ, లాక్‌డౌన్‌లో కానీ కోవిడ్ మహమ్మారి చట్టం ద్వారా అన్ని అధికారాలను లాగేసుకుని తనే అట్టిపెట్టుకున్నారు. ఇప్పుడతని ముఖంలో చేతకాని తనంతోకూడిన అహంభావం స్పష్టంగా కనిపిస్తోంది. నిరాశతో బంతిని రాష్ట్రాల వైపు కొడుతున్నారు. పైగా రాష్ట్రాలు తనకు సహకారం ఇవ్వాలని కోరుతున్నారు!
ప్రతిపక్షాలు తనతో సహకరించాలని కోరుతున్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోడానికి మాజీ ప్రధాని మన్‌మోహన్‌సింగ్, సోనియా గాంధీ స్పష్టమైన సలహాలిస్తూ లేఖ రాస్తే ‘కుబ్లై ఖాన్’(చంఘిజ్ ఖాన్ మనుమడు, మంగోలు సామ్రాజ్య చక్రవర్తి) లాగా అహంకారంతో వాటిని నిర్లక్ష్యం చేశారు. ఒక మహిళా ముఖ్యమంత్రిని గట్టిగా విజిల్ వేసి పిలవడం ద్వారా ఆమెను అవమానపరిచారు. ప్రతిపక్షాల సహకారం అందని బాధితుడిగా తనను తాను చిత్రీకరించుకుంటున్నారు. ఇంత కంటే భ్రమల్లో మరెవరూ బతకరు. ప్రభుత్వానికి సలహాలిచ్చి మార్గ నిర్దేశం చేసే సంస్థలను, పాలకులకు, ప్రజలకు మధ్య వారధులుగాను, తనకు కాపలా కుక్కలుగాను భావించారు. పార్లమెంటు పనిచేయడంలేదు.
సుప్రీంకోర్టును కూడా తన కిందకు తెచ్చుకున్నారు. ఎన్నికల కమిషన్‌ను తన కింద పని చేసే ప్రభుత్వాంగంగా భావించారు. సమాచార శాఖ విడుదలచేసే సమాచారం కంటే, అది దాచి పెట్టే సమాచారం ఎక్కువగా ఉంది. లోక్‌పాల్ ఆచూకీ లేకుండా పోవడం అనేది ఈ దశాబ్దంలోనే అతి పెద్ద అంతుచిక్కని రహస్యం. జాతీయ మానవహక్కుల కమిషన్, మైనారిటీ కమిషన్‌లు ప్రభుత్వ సంస్థలకు నోటీసులు ఇవ్వడానికే పరిమితమయ్యాయి. ఆ నోటీసులను ఎవరూ లెక్కచేయడం లేదు. ‘కాగ్’ తమ నివేదికల్లో ప్రభుత్వ నిధుల దుర్వినియోగం గురించి కంటే, తిరిగి మార్చి రాయడానికే పరిమితమయ్యాయి.
ప్రధాన మంత్రి కార్యాలయం తీసుకునే నిర్ణయాల కోసం దాని కిటికీ దగ్గర కూర్చుని ఎదురుచూస్తూ యూనియన్‌క్యాబినెట్ ముస్తాబవుతోంది. కరోనా తీవ్రంగా విజృంభించిన ఈ సమయంలో మంత్రులంతా ఎందుకు దాక్కున్నారు? ఇంత మంది మంత్రులు ఉన్నారని చెప్పుకోడానికే తప్ప ఎందుకూ కొరగారని అన్ని నివేదికలు చెపుతున్నాయి. కార్యదర్శులు విధాన రూపకర్తలుగా కన్నా, ప్రధాన మంత్రి కార్యాలయ ఆదేశాలను బట్వాడా చేసేవారిగా మాత్రమే ఉన్నారు. చాలా మంది మేధావులైన అధికారులు తమ తమ రాష్ట్రాలలోనే ఉండాలనుకుంటున్నారు కానీ, కేంద్ర ప్రభుత్వంలోకి రావాలని కోరుకోవడం లేదు. తమకు విధేయులుగా ఉండి తమ ముందు హాజరు వేయించుకోవడానికి తహతహలాడే అధికారులను, ముఖ్యంగా గుజరాత్‌కు చెందిన అధికారులను మాత్రమే వారు కోరుకుంటున్నారు. ప్రధాన సైన్యాధికారి జనరల్ బిపిన్ రావత్ నాయకత్వంలో రక్షణ బలగాలన్నీ ఒక ప్రమాదకరమైన స్థితికి చేరుకుంటున్నాయి. ఇవి రాజ్యాంగపరమైన అదుపులోకంటే పౌర, రాజకీయాల అదుపులోకి వెళ్ళిపోతున్నాయి.
మోడీ వాస్తవాలకు దూరంగా తన ప్రతిధ్వనిలో తనను తానే బంధీ అయిపోయారు. కోరోనా మహమ్మారితో పోరాడే ఆలోచన కానీ, తగిన యంత్రాంగం కానీ లేదు. రాజ్య వ్యవస్థ పనిచేయడం మానేసింది. న్యాయవ్యవస్థ పర్యవేక్షించే బాధ్యతను పునరుద్ధరించుకోడానికి చాలా కాలం పట్టేలా ఉంది. విస్తృతమైన ప్రజాబాహుళ్యం ఏకాకై పోయింది. ప్రధానికి సహకరించడమంటే పులిపైన స్వారీ చేసినట్టేనని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. శాస్త్ర విజ్ఞాన నిపుణులను పక్కకు నెట్టేశారు. మాటల్లో కానీ, చేతల్లో కానీ మోడీని నమ్మడం సాధ్యం కాదని ప్రజలు భావిస్తున్నారు. ఎక్కువో, తక్కువో కరోనా మహమ్మారి విధ్వంసం సాగుతోంది. క్రమంగా అది తగ్గుముఖం పట్టవచ్చు.
‘సెంట్రల్ విస్టా’ దుమ్ము ధూళి నుంచి, శకలాల నుంచి ప్రధాని తన గొప్పదనాన్ని చాటుకుంటూ లేచి నిలబడతారు. కానీ, గంగానదిలో ప్రవహించే శావాలు మాత్రం ఈ సమయంలో భిన్నమైన కథ చెబుతాయి. ప్రధాని మోడీ ఇప్పుడు సైన్యం, ఆయుధాలు లేని సైన్యాధికారిలాగా నిలబడ్డారు. ఏ ఒక్కరి సహాయం లేకుండా నిలబడ్డాననే గర్వం అతనిని సంతృప్తి పరిచింది. అంతులేని నిధులతో, వాక్చాతుర్య విన్యాసాలతో, అధికార యంత్రాగాన్ని దుర్వినియోగం చేయడంతో, ప్రతిపక్షాలు మరింత దెబ్బతినడంతో 2024 ఎన్నికల్లో ఆయన మళ్ళీ గెలవవచ్చు. బహుశా అధికారం కొనసాగవచ్చు. కానీ పరిపాలించే శక్తిని కోల్పోతారు. అది కరోనా మహమ్మారి వల్ల కాదు, మన సమష్టి విషాదం వల్ల.