ఏడుగురిని బలిగొన్న వానలు
హైదరాబాద్ ప్రగతినగర్‌లో మ్యాన్‌హోల్‌లో పడి
నాలుగేళ్ల చిన్నారి దుర్మరణం
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి
సంగారెడ్డిజిల్లాలో అలుగులో జారిపడి మరణించిన యువకుడు
వనపర్తి మండలంలో కుంటలో పడి ఆరేళ్ల బాలుడు, చెరువులో మునిగి మరో వ్యక్తి మృతి
మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలో నీటమునిగిన ఇంజినీరింగ్ విద్యార్థుల వసతి గృహాలు
జెసిబిల సహాయంతో విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు హైదరాబాద్ జంట
జలాశయాల గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల..
మూసీలో పెరుగుతున్న వరద మూసారాంబాగ్ బ్రిడ్జిపై వాహనాల రాకపోకలు బంద్
మరో రెండు రోజులు అతి భారీ వర్షాలు
మేడ్చల్, హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్ , ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ మేడ్చల్‌లో
142.8 మి.మీటర్ల వర్షపాతం నమోదు
మనతెలంగాణ/హైదరాబాద్ : అల్పపీడనం ముంచుకోస్తోంది. ఉపరితల ఆవర్తనాలు ..ఉరుములు ..పిడుగుల వానతో తెలంగాణ తల్లడిల్లుతోంది. రాష్ట్రమంతటా భారీ నుంచి అతిభారీ వ ర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటిగా గంటల తరబడి కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు ప్రాజెక్టుల్లోకి భారీగా వరదనీరు చేరుతుండటంతో ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతుతన్నారు. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరి కాలనీలను ముంచెత్తుతోంది. పలు మార్గాల్లో వదర నీరు వంతెనలెక్కి ప్రవహిస్తోంది. ఆయా మా ర్గాల్లో రాకపోకలు నిలిచి పోయాయి. జన జీవనం స్తంభించి పో తోంది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా రాష్ట్రంలో జరిగిన వేర్వేరు ఘ టనల్లో ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. జయశకంర్ భూపాలపల్లి జిల్లాలో పిడుగులు పడి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. శాంతినగర్ గ్రామానికి చెందిన సరిత , మమత మిరప చేలో పనులు చేస్తుండగా పిడుగులు పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.ఇదే జిల్లాల దామెరకుట గ్రామంలో పోలం పనిలో ఉన్న రాజేశ్వరరావు పిడుగుపడి మృతి చెందాడు. గ్రేటర్ పరిధిలోని బాచుపల్లిలో మ్యాన్‌హోల్‌లో పడి నాలుగేళ్ల మిధున్ అనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. తురక చెరువులో మిధున్ మృతదేహం లభ్యమైంది.సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం మంబాపూర్ చెరువు అలుగు వరద ప్రవాహంలోకొట్టుకుపోయి సు ధాకర్ అనే యువకుడు మృతి చెందాడు.
వనపర్తి మండలం పెద్దగూడెం శివారు కుంటలో పడి ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. చేపలు పట్టెందుకు వెల్లి చెరువులో మునిగి శంకర్ నాయక్ ప్రాణాలు కోల్పోయాడు. భారీ వర్షాల వల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించాయి. మూసీ నది పరవళ్లు తొక్కుతోంది. యాదాద్రి జిల్లా జూలూరురుద్రవెళ్లి గ్రామాల మధ్యన వంతెనపైకెక్కి ప్రవహిస్తోంది. అధికారులు ముందుజాగ్రత్తగా వంతెనమీదుగా వాహనాల రాకపోకలు నిలిపివేశారు. ముళ్లకంచె వేసి ప్రమాదహెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేశారు. జిల్లేడు చౌదరి గూడెం మండలంలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రావిర్యాల గుర్రంపల్లి వాగుల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వికారాబాద్, పరిగి మద్యలో ఉన్నవాగులు పొంగిపొర్లుతున్నాయి. ఈ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కడ్మూర్ ఈసీ వాగు, కంకల్ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. రంగారెడ్డి జిల్లాలో నస్కల్‌వాగు పొంగిపారుతోంది. మొమిన్‌పేట నుంచి సదాశివపేట్ వైపు రాకపోకలు నిలిచిపోయాయి. షాబాద్ మండలంలో చర్లవాగు, బొబ్బిలివాగు సండ్రోయి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సమీప గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కోయిల్ కొండ మండలంలో దమాయిపల్లి గణపతి రాయుని చెరువు అలుగు మీద వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. తాత్కాలికంగా నిర్మించిన వంతెన వరదనీటికి కొట్టుకుపోయింది.గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురిసింది. జుక్కల్ బస్వాపూర్ మద్య వాగు ఉధృతికి రోడ్డు కోతకు గురైంది.
ప్రాజెక్టులకు భారీగా వరద, గేట్లు ఎత్తివేత
గోదావరి నదీ పరీవాహక ప్రాజెక్టులకు భారీగా వదర నీరు చేరుతోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 75వేలక్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టులో నీటినిల్వ 90టింంసీల గరిష్ట స్థాయికి చేరటంతో ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తివేశారు. నిజాంసాగర్‌లోకి 29,800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ఈ ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తివేశారు. కడెం ప్రాజెక్టుకు 14వేలక్యూసెక్కుల నీరు చేరుతుండగా ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేశారు.మూసీ ప్రాజెక్టు 5గేట్లు ఎత్తివేసి వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
విద్యాసంస్థలకు సెలవులు
వర్షాల కారణంగా ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తూ ప్రభు త్వం ఆదేశాలు జారీ చేసింది. జిహెచ్‌ఎంసి పరిధి లో అత్యవసర సేవలకోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ కేం ద్రాలు ఏర్పాటు చేసింది. 9000113667తో పాటు 04021111111 నెంబర్లు ఏర్పాటు చేసింది.
మరో రెండు రోజులు అతి భారీ వర్షాలు
రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. జయశంకర్ భూపాలపల్లి ములుగు, ఖమ్మం, నల్లగొండ, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. కోమరంభీం, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, కొత్తగూడెం, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగాం, సిదిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చెల్, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
మేడ్చెల్‌లో 142.8 మి.మీ వర్షం
రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా మేడ్చెల్ జిల్లా మల్కాజిగిరిలో 142.8 మి.మి వర్షం కురిసింది. గాంధారిలో 135.8, కొండాపూర్‌లో 120, హకీంపేటలో 118, నర్సాపూర్‌లో 114, సంగారెడ్డిలో 113, వేములవాడలో 110, కామారెడ్డిలో 110, సిరిసిల్లలో 108, మోమిన్‌పేటలో 107, తూప్రాన్‌లో 105, దుండిగల్‌లో 103, హిమాయత్‌నగర్‌లో 101, షేక్‌పేట్‌లో 98,నాగిరెడ్డిపేటలో 98, నవాబ్‌పేటలో 98, కూకట్‌పల్లి జేఎన్‌టియూలో 98, సదాశివపేటలో 96, అంబర్‌పేటలో 93, జోగిపేటలో 93, బోయిన్‌పల్లిలో 89, పరిగిలో 85, జక్రాన్‌పల్లిలో 85 మి.మి వర్షం కురిసింది. మరో 85 ప్రాంతాల్లో 35నుంచి 85 మి.మి వర్షం కురిసింది.