కర్నాటక ఉప పోరుపై దేవెగౌడ వ్యాఖ్య
రాయచూర్(కర్నాటక): బెల్గామ్ లోక్‌సభ స్థానం, బసవకల్యాణ్, సిందగి, మస్కీ అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికలలో తమ పార్టీ పోటీచేయబోదని జెడి(ఎస్) వ్యవస్థాపకుడు, మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ బుధవారం వెల్లడించారు. ఈ స్థానాలలో ఉప ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకటించవలసి ఉంది. బుధవారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ ఉప ఎన్నికలలో పోటీ చేసేందుకు తమ వద్ద డబ్బు లేదని అన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీని సిద్ధం చేయడానికి తాను పూర్తిగా పార్టీ నిర్మాణంపై దృష్టి పెడతానని ఆయన చెప్పారు. నాయకులు, కార్యకర్తల సహకారంతో పార్టీని నిర్మించడానికి తాను శాయశక్తులా కృషిచేస్తానని ఆయన చెప్పారు.
ఈ ఏడాది నాలుగు రాష్ట్రాలకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఓటమి చవిచూడడం ఖాయమని దేవెగౌడ చెప్పారు. తమిళనాడులో బిజెపికి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధైర్యాన్నిఆయన మెచ్చుకున్నారు. మొత్తం బిజెపి నాయకులంతా పశ్చిమ బెంగాల్‌లో మకాం వేసినప్పటికీ మమతా బెనర్జీ విజయాన్ని అడ్డుకోవడం కష్టమని, కొన్ని సీట్లు తగ్గినప్పటికీ మళ్లీ మమతే అధికారంలోకి వస్తారని దేవెగౌడ జోస్యం చెప్పారు.
గత ఏడాది సెప్టెంబర్‌లో కొవిడ్-19 కారణంగా కేంద్ర మంత్రి సురేష్ అంగది, ఎమ్మెల్యే బి నారాయణ రావు మరణించడంతో బెల్గామ్ లోక్‌సభ స్థానానికి, బసవకల్యాణ్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఎమ్మెల్యే ప్రతాపగౌడ పాటిల్‌పై అనర్హత వేటు పడడంతో మస్కీ అసెంబ్లీ స్థానానికి ఖాళీ ఏర్పడింది. అనారోగ్య కారణాల వల్ల జెడి(ఎస్) సీనియర్ నాయకుడు, శాసనసభ్యుడు ఎంసి మనగులి గత నెల మరణించడంతో సిందగి స్థానానికి ఉప ఎన్నిక జరగనున్నది. ఇదిలా ఉండగా ఈ స్థానాలను చేజిక్కించుకోవడానికి అధికార బిజెపి, ప్రతిపక్ష కాంగ్రెస్ ఇప్పటికే పావులు కదుపుతున్నాయి. అభ్యర్థుల పేర్లను ఖరారు చేసే ప్రక్రియను ఆ పార్టీలు చేపట్టినట్లు వర్గాలు తెలిపాయి.