Monday, December 23, 2024

కావేరీ నదీ జలాల వివాదంపై ప్రధాని మోడీకి దేవెగౌడ లేఖ

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కావేరీ నదీ జలాల వివాదంపై కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తగు విధంగా స్పందించాల్సి ఉందని మాజీ ప్రధాని, జెడిఎస్ నేత హెచ్‌డి దేవెగౌడ పిలుపు నిచ్చారు. కావేరీ వివాదం తిరిగి కర్నాటకలో రగులుకున్న దశలో సోమవారం ఈ సీనియర్ నేత స్పందించారు. కావేరీ పరీవాహక ప్రాంతాల్లోని రిజర్వాయర్ల అధ్యయనానికి వెంటనే ఓ బాహ్య సంస్థను ఏర్పాటు చేయాల్సి ఉందని ప్రధాని మోడీకి సూచించారు. కావేరీ జలాల వివాద సంబంధిత రాష్ట్రాలు లేకుండా స్వతంత్ర, బయటి సంస్థకు ఈ బాధ్యత అప్పగించాలని ప్రధానికి సూచించారు. దీని వల్ల వాస్తవిక పరిస్థితి తెలిసివస్తుందని, తగు విధమైన న్యాయానికి దారితీస్తుందని మాజీ ప్రధాని అభిప్రాయపడ్డారు.

దుర్భిక్ష పరిస్థితుల దశలో సంబంధిత రాష్ట్రాలు కట్టుబడి ఉండేలా చేసేందుకు తగు విధమైన విపత్తు సహాయక ఫార్మూలాను రూపొందించుకోవల్సి ఉందని సూచించారు. కర్నాటక, తమళనాడులోని కొన్ని ప్రాంతాలలో ఈ సారి నైరుతి రుతుపవనాల మందగమనంతో కర్నాటకలోని నాలుగు ప్రధాన కావేరీ బేసిన్ రిజర్వాయర్లలో సరైన నీటి నిల్వలు లేవని మాజీ ప్రధాని తెలిపారు. ఈ పరిస్థితిలో సాగునీటి సరఫరాల సంగతి పక్కకు పెడితే ప్రజలకు అవసరం అయిన తాగునీటికి కూడా గడ్డు పరిస్థితి ఉంటుందని వివరించారు. కావేరీ నదీజలాల వివాదం, ప్రస్తుత పరిస్థితిపై ఈ నెల 23వ తేదీన ప్రధాని మోడీకి తాను పంపించిన లేఖ ప్రతిని దేవెగౌడ సోమవారం మీడియాకు విడుదల చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News