Wednesday, January 22, 2025

అభివృద్ధి సంక్షేమ పథకాలు రాష్ట్రానికి మణిహారాలు

- Advertisement -
- Advertisement -

చుంచుపల్లి : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మణిహారాలని కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు తెలిపారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం చుంచుపల్లి మండలంలోని ఎన్‌కెనగర్‌లో నిర్వహించిన తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, జిల్లా కలెక్టర్ అనుదీప్ హాజరయ్యారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు లేకపోతే ఈ సృష్టే లేదని అన్నారు.

రాష్ట్ర ఏర్పాటు జరిగి 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 21 రోజుల పాటు వివిధ కార్యక్రమాలను చేపట్టిందని వివరించారు. అంగన్‌వాడీలు ప్రతీ మారుమూల గ్రామానికి వెళ్లి సేవలందిస్తున్నారని చెప్పారు. సఖీ కేంద్రం ద్వారా మహిళలకు ఆసరాగా నిలుస్తూ వారు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నారని ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. కొత్తగూడెం నియోజకవర్గంలో నలుగురు మహిళలను ఎంపిపిలను చేశామని గుర్తు చేశారు.

బాలల ఎదుగుదల ఇక్కడి నుంచే ప్రారంభమవుతుందని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. మారుమూల జిల్లాలో సిబ్బంది అద్భుతంగా సేవలు అందిస్తున్నారని అభినందించారు. రాష్ట్ర ఏర్పాటు తదుపరి అంగన్‌వాడీ ఆయా పోస్టును టీచర్‌గా నామకరణం చేసి గౌరవప్రదమైన వేతనాలు చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. మిగితా జిల్లాలతో పోలిస్తే మన జిల్లాలో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉందని అన్ని విధాలుగా ఎంతో మేలు చేసే చిరుధాన్యాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు 1030 అంగన్‌వాడీ కేంద్రాల్లో చిరుధాన్యాలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నట్లు చెప్పారు.

బాల్యం బాగుపడాలంటే అది అంగన్‌వాడి నుంచే సాధ్యమవుతుందని, తద్వారా ఆరోగ్యవంతమైన సమసమాజం ఏర్పడుతుందని తెలిపారు. బలమై ఆరోగ్య తెలంగాణ లక్షంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమ శాఖ ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. భద్రాద్రి జిల్లా ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతమని, సుదూరంగా ఉన్న, గ్రామాలు, గూడాలలో నివసిస్తున్న ప్రజలకు అంగన్‌వాడీ అద్భుతమైన సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. శిశువు జన్మించిన తరువాత న్యూట్రీషన్ లోపంతో బాధపడే కంటే పుట్టక మునుపే పౌష్టికాహార లోపం లేకుండా మంచి ప్రోటీన్లు ఉన్న ఆహారాన్ని అందిస్తున్నట్లు చెప్పారు.

అంగన్‌వాడీ కేంద్రాల్లో చేపట్టిన చర్యల వల్ల నేడు 3 కేజీల బరువున్న పిల్లలు జన్మిస్తున్నారని తెలిపారు. బాలింత నుంచి సరైన పోషణ అందిస్తే బిడ్డ ఎదుగుదల సక్రమంగా ఉంటుందని, తద్వారా ఆరోగ్యవంతంగా పెరుగుతారని అన్నారు. ఆకుకూరలతో బలవర్థక ఆహారం అందించేందుకు వీలుగా అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో న్యూట్రీ గార్డెన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అనంతరం చిన్నారుల కళా ప్రదర్శనలు,ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను అద్దం పట్టే విధంగా ఉన్నాయని ప్రశంసించారు.ఈ సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రగతి నివేదికలు సిడిపివో స్వర్ణలత, లెనీనా చదివి వినిపించారు. అనంతరం వివిధ శాఖల్లో ఉత్తమ సేవలందించిన మహిళా ఉద్యోగులను శాలువాలు, ప్రశంసా పత్రాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు, చుంచుపల్లి ఎంపీపీ బాదావత్ శాంతి, లక్ష్మీదేవిపల్లి ఎంపీపీఈ భూక్యా సోనా, సర్పంచ్ బాదావత్ సుగుణ, మునిసిపల్ వైస్ చైర్మన్ దామోదర్, పలువురు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News