ఈ 70 ఏళ్ల ఎన్నికల భారతావనిలో అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, అసలు మనం ఎక్కడ ఉన్నాం! అని ఒకసారి అవలోకనం చేసుకుంటే అనాథలకు దిక్కులేదు, సంచార జాతుల అభివృద్ధి జాడ మచ్చుకైనా కానరాదు. కనీసం పరిపాలనలో బలహీన వర్గాల భాగస్వామ్యం ఉండదు. ఇక మూలవాసుల (ఆదివాసుల) కష్టాలు, వారి కథలు చెప్పుకుంటే ఇప్పటికి కూడా 1000 ఏళ్ల వెనక్కే ఉన్నారు. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు దాటినా మారుమూల ప్రాంతాలకు కనీస సదుపాయాలు ఇప్పటికీ కానరావు. మరి ఎవరి అభివృద్ధి జరిగింది? ఇంకా ఎన్నేళ్లు సబ్బండ వర్గాలు అభివృద్ధిలో భాగమయ్యేది? ఇంకా ఎన్ని రోజులు ఈ బ్యూరోక్రాట్లు ఉన్నత వర్గాల పంచన చేరి ఈ దేశానికి సరైన పాలసీలు రూపకల్పన చేయకుండా నియంతృత్వ పోకడలతో అట్టడుగు వర్గాలను అణచివేసుకుంటూ ఇంకా ఎన్నేళ్లు ఈ దేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంచుతారు.
ఇంకా ఎన్ని సంవత్సరాలకు ఈ దేశానికి విముక్తి (అభివృద్ధి చెందిన దేశంగా) కల్పిస్తారు. 75 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో దేశాన్ని ఎక్కడ నుండి ఎక్కడ దాకా తీసుకువచ్చారు. ఒకవైపు కులవృత్తులు కనుమరుగు అవుతుంటే బయట దేశాల ఉత్పత్తులు భారత దేశంలో వెల్లువెత్తుతుంటే ప్రజలకు కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేయకుండా, వారికి సరైన పాలసీలు రూపొందించకుండా కులవృత్తుల స్థానంలో ఉపాధి సృష్టి కోసం రిప్లేస్‌మెంట్ జరపాల నే ఆలోచన లేని నాయకుల అజ్ఞానం వల్ల ఆకలి చావులు, ఆత్మహత్యలు, వలసలు నిత్యకృత్యం ఈ దేశంలో జరుగుతూనే ఉన్నాయి. అసలు ఇప్పుడు చెబుతున్న చదువుల వల్ల సంవత్సరానికి ఎంత మంది నిరుద్యోగులు బయటకు వస్తున్నారు అనే ఆలోచన ఎప్పుడైనా చేశారా. వేల మంది చదువుకున్న నిరుద్యోగులు ప్రతి సంవత్సరం యూనివర్శిటీల నుంచి బయటకు వస్తూనే ఉన్నారు. మరి వారిలో ఎంతమందికి ఉపాధి దొరుకుతుంది, వారు ఏం చేస్తున్నారు.
అనే ఆలోచన ఎప్పుడైనా చేశారా!చరిత్రను గనుక ఒకసారి మనం పరిశీలిస్తే ఉత్పత్తికి కేంద్రంగా మసిలిన గ్రామాలు, ఈ దేశం తదనంతర కాలంలో నిర్జీవంగా ఇలా ఎందుకు తయారైంది? కారణం బ్రిటిష్‌వారి ఆర్థిక దోపిడీ, సామాజిక సంఘర్షణ, వారి కుట్రల పుణ్యమా అని కుటీర పరిశ్రమలన్నీ నాడు అలా నాశనం అయిపోయాయి. అలా నాడు ఉత్పత్తికి కేంద్రంగా విలసిల్లిన గ్రామాలు నేడు ఇలా నిర్జీవమైపోయాయి. అయినా ఈ దేశంలో మేధావులు అనే వారు అసలు ఉన్నారా! మేధావులు ఉంటే ఈ దేశం ఇలా ఉండేదా, ఇప్పటికీ ప్రతి గ్రామానికి కనీస అవసరాలు అయినా మంచి నీళ్ళు, కరెంటు, రోడ్డు సౌకర్యం ప్రతి గ్రామానికి కల్పించలేకపోయారు. అయితే ఒకసారి అభివృద్ధి గురించి మాట్లాడుకుందాం. అసలు అభివృద్ధి అంటే ఏమిటి, అది ఎలా జరగాలి? అభివృద్ధి అనేది ఏ రూపంలో ఉండాలి, ఎలా అయితే వేగంగా మన దేశం అభివృద్ధి చెందుతుంది? ప్రపంచ దేశాలలో మనం నేడు చూస్తూనే ఉన్నాం. దేశంలోని ప్రతి పౌరుని తలసరి ఆదాయం,
దేశం జిడిపి ఈ రెండు రూపాలలో మనం సంపదను కొలుస్తున్నాం. కానీ అన్నింటి కంటే ముఖ్యమైన పర్యావరణాన్ని హరించే అభివృద్ధితో నేడు ఈ ప్రపంచం ఎన్నో ప్రకృతి విపత్తులను ఎదుర్కొంటుంది. కానీ దీనికి భిన్నంగా మధ్యే మార్గంగా పర్యావరణ అనుకూల ప్రాకృతికమైన అభివృద్ధి జరగాలి. 70 ఏళ్ల ఎన్నికల భారతంలో ఘనాపాటి నాయకుల పరిపాలనలో ఇప్పటికీ ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం కోసం 80 కోట్ల మంది ప్రజలు ఎదురుచూస్తున్నారు.అంటే ఇది వారి పరిపాలన విజయం. ప్రజలను ఉచితాల వైపు మళ్ళించి తరతరాలుగా ప్రభుత్వాలపై ఆధారపడే విధంగా వారిని తయారుచేస్తూ పాలక వర్గాల చెప్పుచేతుల్లో ప్రజలను ఉండేలా చేసుకుంటూ కాలాన్ని వెళ్ళదీసుకుంటూ కుట్రపూరితంగా పరిపాలనలో సబ్బండవర్గాలను భాగస్వామ్యం చేయకుండా, ప్రజలను తమ కాళ్ళ మీద తాము ఆధారపడి బతకడానికి కావలసిన భూమి,
ఆర్థిక తోడ్పాటు ను అందించకుండా నిత్యం వారిని బిచ్చగాళ్ళుగానే ఉంచుతున్నారు. ఇప్పటికైనా అధికారంలో సబ్బండ వర్గాలను భాగస్వామ్యం చేయకుండా, అభివృద్ధి వికేంద్రీకరణ చేయకుండా, ముఖ్యంగా పర్యావరణ ప్రాకృతికమైన అభివృద్ధిని చేయకుండా, అభివృద్ధి చెందిన భారత దేశాన్ని మనం ఎన్నటికీ చూడలేము.