Sunday, December 22, 2024

గ్రామాల్లో జరిగే అభివృద్ధిలో జాప్యం చేయరాదు

- Advertisement -
- Advertisement -

అధికారులు అంకిత భావంతో విధులు నిర్వహించాలి
పెండింగ్ జీతాలు రూ.46 కోట్లు విడుదల చేసిన మంత్రి సీతక్క

మన తెలంగాణ/ హైదరాబాద్: గ్రామాలలో అన్ని మౌళికసదుపాయాలను కల్పించాలని, గ్రామాలలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలలో ఎలాంటి జాప్యం జరగకూడదని అధికారులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆదేశించారు. శుక్రవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా గ్రామాలలో జరిగే అభివృద్ధి ఇతర కార్యక్రమాల వివరాలను అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు.

ఈసందర్భంగా మాట్లాడుతూ అధికారులంతా నిబద్దతతో అంకితభావంతో ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని, క్రింది స్థాయి అధికారులు కూడా శాఖ పురోగతికి, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయటానికి తమ సూచనలు, సలహాలను ఇవ్వాలన్నారు. అధికారులతో ఆమె పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్వచ్ఛ భారత్ మిషన్, రూర్బన్, పి.ఎం.కె.ఎస్.వై, సాగీ, డి.డి.యు.జి.కె.వై తదితర పథకాల వివరాలను, పురోగతిని సమీక్ష చేశారు. ప్రజలు తమ సమస్యలతో అధికారుల వద్దకు వస్తే వెంటనే పరిష్కరించాలని, కార్యాలయాలకు పలుమార్లు తిప్పించుకోవద్దని సూచించారు. అదేవిధంగా ప్రజలకు ఉపయోగపడే కొత్త పథకాలను రూపొందించేందుకు అందరూ సలహాలు ఇవ్వాలని కోరారు. మంత్రి దృష్టికి వచ్చిన గ్రామీణాభివృద్ధి అధికారుల రెండు నెలల వేతనాల సమస్యను వెంటనే పరిష్కరించి రూ.46 కోట్లు విడుదల చేయించారు.

గ్రామపంచాయతీలలో పనులు చేసి బిల్లులు పెండింగ్ లో ఉండి, సర్పంచులు ఇబ్బంది పడుతున్న విషయాలను చర్చించారు. గత ప్రభుత్వ హయాంలో సుమారు రూ.800 కోట్ల విలువగల సర్పంచులు చేసిన పనులకు బిల్లులు చెల్లించలేకపోయారని తెలిపారు. ఈ ప్రభుత్వం హయాంలో ఉపాధిహామీ పనుల కింద ఈసారి ఫాంపాండ్స్, ఫిష్ పాండ్స్, గ్రామపంచాయతీ భవనాలు, అంగన్ వాడి భవనాలు, మహిళా భవనాలకు ప్రాధాన్యత ఇచ్చేలా కార్యచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హనుమంతరావు, స్పెషల్ కమిషన్ ప్రదీప్ శెట్టి తదితర అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News