Friday, December 20, 2024

సమర్థ నాయకత్వంతో అభివృద్ది సాధ్యం

- Advertisement -
- Advertisement -

ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్
బారత్ సిరమ్ వ్యాక్సినేషన్ కొత్త యూనిట్‌కు భూమి పూజ చేసిన కెటిఆర్

మన తెలంగాణ / హైదరాబాద్: సమర్దవంత నాయకత్వంతో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ది చెందుతుందని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. హైదరాబాద్ శివారులోని జినోమ్ వ్యాలీలో బిఎస్‌వి కంపెనీ కొత్త యూనిట్‌కు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావం అనంతరం అనేక సందేహాలు, ఆందోళనలు నెలకొన్నాయని వాటన్నింటిని పటాపంచలు చేస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకునే విధంగా అన్ని విధాలుగా అభివృద్ది చేశారన్నారు.

ఏ దేశమైనా,రాష్ట్రమైనా ప్రవేట్ పెట్టుబడులను ఆహ్వానించనిదే అభివృద్ది సాధ్యం కాదన్నారు. కంపెనీలను రాష్ట్రానికి తీసుకు రావడమంటే కొబ్బరి కాయ కొట్టినంత సులభం కాదన్నారు. పరిశ్రమలను ఏర్పాటు చేయాలంటే ఇక్కడి అనుకూలతలను ఆయా పరిశ్రమలను వారికి వివరించాలి. ఇతర ప్రాంతాలతో పోలిస్తే వారికి కలిగే ప్రయోజనాలను,మనం అందించే సబ్సిడీలు, మౌళిక వసుతుల ఏర్పాటు తదితర వివరాలను పూర్తిగా తెలియ చేయాలి.ఈ విధంగా ఎన్నో కసరత్తుల అనంతరం పరిశ్రమల ఏర్పాటు సాధ్యపడుతుందన్నారు. పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా ఆయా ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు వస్తాయని తద్వారా సంపద సృష్టి జరగుతుందన్నారు. ఆ విధంగా సృష్టించిన సంపదను సంక్షేమ పథకాలను వినియోగిస్తారన్నారు.

65 సంవత్సరాల్లో తెలంగాణలో కేవలం 5మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే రాష్ట్ర ఏర్పాటు అనంతరం జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఇప్పటికే 26 మెడికల్ కాలేజీలు,వాటికి అనుసంధానంగా ఆసుపత్రులు ఏర్పాటు చేసుకున్నామని మరో 8 కాలేజీలు ప్రాంరంభానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. దేశంలోనే అత్యంత మానవ వనరులు కలిగిన రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటిఆర్ అన్నారు. హైదరాబాద్ శివారులోని జినోమ్ వ్యాలీలో బిఎస్‌వి కంపెనీ కొత్త యూనిట్‌కు మంత్రి కేటిఆర్ భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ మాట్లాతూ భారత్ సీరం సంస్థకు అన్ని రకాల సహకారం అందిస్తామని తెలిపారు. ప్రస్తుతం జినోమ్ వ్యాలీలో ఫేజ్ 3లో ఉన్నామని, దీన్ని మరో 250 ఎకరాల్లో విస్తరిస్తామని మంత్రి కెటిఆర్ ప్రకటించారు.

దేశంలో ఎక్కడా లేని అనుకూలతలు తెలంగాణలో ఉన్నాయని మంత్రి కెటిఆర్ అన్నారు. ఎక్కడా లేనంత వేగంగా పారీశ్రామీకరణ, ఉపాధి కల్పనలో తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందనడం నిర్వివాదమన్నరు. మాకు కేంద్రానికి పడదు, తెల్లారి లేస్తే మేము వాళ్ళు తిట్టుకుంటాం, విమర్శలు చేసుకుంటాం. బిజెపి ,బిఆర్‌ఎస్ మధ్య ఎప్పుడూ ఏదో పంచాయితీ నడుస్తూనే ఉంటుంది. అయినప్పటికి ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో నంబర్ వన్ అని ఎవరైనా అడిగితే తెలంగాణ అని వాళ్ళు కూడా ఒప్పుకునే పరిస్థితి సీఎం కేసిఆర్ తీసుకు వచ్చారన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్‌లో ఉందన్నారు. దేశ సగటు తలసరి ఆదాయం 1,49,000 ఉండగా, తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,7,0000 ఉందన్నారు. సమర్దవంతమైన నాయకత్వం ఉంటే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని తెలంగాణ ప్రభుత్వం నిరూపిస్తోందని మంత్రి కేటిఆర్ అన్నారు.

ప్రపంచానికి వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్ మారిందని ప్రపంచంలో ఎక్కడకు వెళ్ళినా గర్వంగా చెప్పగలమన్నారు. ప్రపంచంలో తయారయ్యే 33 శాతం హైదరాబాద్ జినోమ్ వ్యాలీ నుంచే ఉత్పత్తి అవుతున్నాయన్నారు. హైదరాబాద్ సంవత్సరానికి 900 కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతున్నాయన్నారు. వచ్చే ఏడాది 1400 కోట్ల వ్యాక్సిన్లు ఇక్కడ నుంచే ఉత్పత్తి అవుతాయన్నారు. ప్రపంచ వ్యాక్సిన్ ఉ్పత్తిలో 50 శాతం మనదే అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. దీనికి నిపుణులైన యువకులు ఉండటం, వాళ్ళను చూసి కంపెనీలు ఇక్కడకు రావడం వారికి ప్రభుత్వం సహకరించడమే ఇందుకు ప్రధాన కారణమన్నారు. దేశంలో 150 కోట్ల జనాభా వుంటే వారిలో 65 శాతం జనాభా 35 ఏళ్ళ లోపు ఉన్నవారు ఉన్నారని వీరి సమర్థత, నైపుణ్యాన్ని ఉపయోగించుకుంటే మరింత అభివృద్ది సాధించ వచ్చన్నారు.ఈ కార్యక్రమంలో టిఎస్‌ఐఐసి డైరక్టర్ వి. నరసింహరెడ్డి, లైఫ్ సెన్సెస్ సీఈవో నాగప్పన్, బిఎస్‌వి ఎండి సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందు ఎమర్జెన్సీ అలారం మోగడంతో ఏదైనా సమస్య వచ్చిందా అని మంత్రి కేటిఆర్ ఆరా తీశారు. సాధారణ కార్యక్రమంలో భాగంగానే ఆలారం మోగిందని అధికారులు చెప్పడంతో తన ఉపన్యాసాన్ని కొనసాగించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News