Thursday, January 23, 2025

మీ స్ఫూర్తితోనే రైతు విధానాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగం అభివృద్ధి కోసం డా. స్వా మినాథన్ ఇచ్చిన నివేదిక అమలు చేస్తున్నట్టు గా నటిస్తూ ఇటు రైతులను, అటు దేశ ప్రజలను కేంద్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోంద ని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం చెన్నైలోని స్వామినాథ న్ నివాసంలో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసి, పలు విషయాలపై చర్చించా రు. అనంతరం మంత్రి స్వామినాథన్‌కు వివరించామని తెలిపారు. మీ స్ఫూర్తితోనే రైతు అనుకూల విధానాలను అమలు చేస్తున్నట్లు తెలిపాం అన్నారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరంటు, సాగునీరు, పంటల కొనుగోళ్ల తీరు, ప్రత్యామ్నాయ పంటల సాగు ఆవశ్యకత, రైతువేదికలు వంటి వాటిని వారి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.

ఐక్యరాజ్యసమితి ఎఫ్‌ఏవో సంస్థ మానవాళిని ప్రభావితం చేసిన 20 బృహత్ పథకాలలో తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబంధు, రైతుభీమా పథకాలున్నాయి అన్న విషయం వారి దృష్టికి తీసుకెళ్లామని వెల్లడించారు. అన్ని విషయాలు తనకు తెలుసని తాను గతంలో ఎఫ్‌ఏఓ చైర్మన్ గా పనిచేసినట్లు డా.స్వామినాథన్ తమకు వివరించారిని తెలిపారు. 98 ఏళ్ల వయసులోనూ వారి ఇంత గొప్ప జ్ఞాపకశక్తి అమోఘం అన్నారు.వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావును పరిచయం చెయ్యగానే గతంలో చూసినట్లు గుర్తు చేశారు.స్వామినాథన్ తన ఆరోగ్యం కుదుటపడగానే తెలంగాణకు వచ్చి అన్ని పథకాల అమలును పరిశీలిస్తానని తెలిపారన్నారు.

98 ఏళ్ల వయసులో వారు స్వయంగా తెలంగాణకు వస్తాను అని చెప్పడమే గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నాం అన్నారు. ఈ దేశంలో ఉన్న కోట్లాదిమంది ప్రజల ఆకలి తీర్చిన వ్యవసాయ సంస్కరణల, సస్యవిప్లవ పితామహుడు స్వామినాథన్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వ్యవసాయ మంత్రిగా కలవడం అదృష్టంగా, జన్మకు లభించిన సార్ధకతగా భావిస్తున్నామని మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. ఇక్రిషాట్ ఏర్పాటుకు ఆద్యుడు స్వామినాథన్‌గారే అని ,వ్యవసాయరంగంలో వచ్చిన అనేక నూతన ఆవిష్కరణలకు ఐకార్ డైరెక్టర్ గా పనిచేసిన స్వామినాథన్ కారణం అన్నారు. వ్యవసాయ విస్తరణ, విద్య, సాంకేతిక పరిజ్ఞానం అన్నింటికీ ఆయనే ఆద్యుడు అని వెల్లడించారు. 2004 యూపీఏ ప్రభుత్వంలో వేసిన వ్యవసాయ కమిషన్ కు నాయకత్వం వహించిన స్వామినాథన్ భారత అవసరాలే కాకుండా ప్రపంచ అవసరాలను తీర్చే దేశం భారతదేశం అన్నారని, రైతుల ఆదాయం పెరగాలి,

వారి ఆదాయం సుస్థిరంగా ఉండాలి అని సూచనలు చేశారన్నారు. 2007 లో స్వామినాధన్ నివేదిక ఇచ్చినప్పటికీ , 2014 వరకు దానిని యూపీఎ ప్రభుత్వం అమలు చేయలేదని అందుకు ఆయన ఎంతో బాధపడ్డారని తెలిపారు.స్వామినాధన్ నివేదిక అమలు చేయలేదని, ఇది స్వామినాథన్‌ను అవమానించడమేనని యూపీఏను ప్రశ్నించిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధికారంలోకి రాగానే అమలు చేస్తామని 2013 లో ప్రకటించారని గుర్తు చేశారు. 2014 లో ఎన్డీఎ అధికారంలోకి వచ్చి , మోడీ ప్రధాని అయ్యాక స్వామినాథన్ కమిటీపై అశోక్ దల్వాయితో మరో కమిటీ వేసి ప్రధాని మోడి అవమానించారన్నారు. దల్వాయ్ కమిటీ మీద వచ్చిన నివేదికతో 2022 నాటికి దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం అని ప్రకటించిన ప్రధాని నరేంద్రమోడి ఇప్పటికి 2023 గడిచిపోతున్నా రైతుల ఆదాయం రెట్టింపు సంగతి పక్కన పెట్టేశారన్నారు.నరేంద్రమోడీ ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలుకాలేదన్నారు.

ఉపాధిహామీ పథకం వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని, స్వామినాథన్ సిఫార్సులు అమలుచేస్తామని హామీలు ఇచ్చిన వాటిని గాలికి వదిలేశారన్నారు. పైగా స్వామినాథన్ సిఫార్సులు అమలు చేస్తున్నట్లు దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. యూపీఎ, ఎన్డీఎ ప్రభుత్వాలు స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయకపోవడం అత్యంత బాధాకరం అని మంత్రి ఆవేదన వెలిబుచ్చారు. ఈ దేశంలో రైతుకేంద్రంగా, రైతు విధానాలు కేంద్రంగా దేశంలో గొప్ప మార్పు రావాల్సి ఉన్నదని, ఆ దిశగా దేశం ఆలోచిస్తున్నదని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. హరిత విప్లవ పితామహుడు ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్‌ను వారి నివాసంలో కలిసిన అనంతరం , స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెంట రాష్ట్ర వ్యవసాయ శాఖా కార్యదర్శి రఘునందన్ రావు, విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు, డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News