Monday, December 23, 2024

తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లె అభివృద్ధి

- Advertisement -
- Advertisement -

జగిత్యాల : తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లె అభివృద్ధి చెందిందని, ఏ పల్లె చూసినా గతానికి, నేటికి తేడా స్పష్టంగా కనిపిస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. ఆదివారం జగిత్యాల రూరల్ మండలం కన్నాపూర్ గ్రామంలో రూ. 25 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణ పనులకు, రూ. 20 లక్షలతో చేపట్టనున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి జెడ్‌పి చైర్‌పర్సన్ దావ వసంతతో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గతంలో గ్రామాల్లో వ్యవసాయం సరిగా నడవక, ఉపాధి లేక జీవనోపాధి కోసం ఎంతో మంది ఇతర దేశాలకు, రాష్ట్రాలకు వలస వెళ్లేవారని, నేడు వలస వెళ్లిన వారంతా గ్రామాలకు తిరిగి వచ్చారని, తెలంగాణలో వరి నాట్లు వేసేందుకు, ఇతర పనులు చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలస వస్తున్నారన్నారు.

వ్యవసాయం దండగ అంటూ గత పాలకులు వ్యవసాయ రంగాన్ని నిర్లక్షం చేస్తే ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యవసాయం దండగ కాదు… పండగ అని నిరూపించేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా వినూత్న పథకాలు తీసుకొచ్చి, దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణను తీర్చిదిద్దారన్నారు. 44 లక్షల మంది రైతులకు రూ. 5 లక్షల బీమా వర్తింపజేసి, ఏ కారణంగా రైతు చనిపోయినా కేవలం వారం రోజుల్లోపే మృతుడి కుటుంబానికి బీమా పరిహారం అందించడం జరుగుతోంద న్నారు.

నిరుపేద ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక సాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు తీసుకురావడం జరిగిందని, ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల మందికి ఆర్థిక సాయం అందించినట్లు వివరించారు. కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా గురుకుల, మోడల్ పాఠశాలలను ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మందికి సన్న బియ్యంతో భోజనం అందిస్తున్నామన్నారు.

గతంలో జగిత్యాల నియోజకవర్గంలో 22 వేల ఎకరాల్లో పంటలు సాగు కాగా, నేడు పంటల సాగు విస్తీర్ణం 62 వేలకు చేరుకుందన్నారు. సిఎం కెసిఆర్ ముందు చూపుతో వ్యవహరించి సాగు నీటి కష్టాలు తీర్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, మిషన్ కాకతీయ ద్వారా చెరువులు, కుంటల అభివృద్ధి, 24 గంట ల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించేలా ఏర్పాట్లు చేయడం వల్లే రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగడంతో పాటు పంటల దిగుబడి కూడా పెరిగిందన్నారు.

చిన్నపల్లెగా ఉన్న కన్నాపూర్ గ్రామానికి ఇప్ప టి వరకు రూ.14 కోట్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. గ్రామంలో విద్యుత్ స్తంభాలు, ట్రాన్ప్‌ఫార్మర్ల కోసం రూ.22 లక్షలు ఖర్చు చేశామని ఎమ్మెల్యే వివరించారు. గ్రామంలో 41 మంది ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా ఆర్థిక సాయం అందించామని, అలాగే రైతుబంధు పథకం ద్వారా 372 మంది రైతులకు రూ.2.15 కోట్ల మొత్తాన్ని అం దించామన్నారు.

గ్రామంలో వివిధ కారణాలతో చనిపోయిన 9 మంది రైతులకు రూ.5 లక్షల చొప్పున రైతుబీమా పరిహారం అం దినట్లు తెలిపారు. 226 మందికి ఆసరా ఫించన్ల కింద ప్రతి నెలా రూ. 5.55 లక్షలు అందిస్తున్నామని, 133 మంది బీడి కార్మి కులకు ప్రతి నెలా రూ.2.68 లక్షలు అందుతున్నాయన్నారు. సిఎం సహాయ నిధి ద్వారా 25 మందికి రూ. 6 లక్షల మేర ఆర్థిక సాయం అందించామని ఎమ్మెల్యే వివరించారు.

ఈ కార్యక్రమంంలో సర్పంచ్ కొక్కు సుధాకర్, ఎంపిపి పాలెపు రాజేంద్రప్రసాద్, ఎఎంసి చైర్మన్ నక్క రాధరవీందర్‌రెడ్డి, ఉప సర్పచ్ లక్ష్మిశివరాం, నాయకులు వేణు, గంగారెడ్డి, మురళి, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News