- రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ అయాచితం శ్రీధర్
ఆదిభట్ల: జిల్లా వ్యాప్తంగా చేపట్టిన గ్రంథాలయాల అభివృద్ధ్ది పనులను శరవేగంగా నిర్వహించాలని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ అయాచితం శ్రీధర్ ఆదేశించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యక్రమాలపై జిల్లా చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డితో కలసి శనివారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. శంషాబాద్, ఆమనగల్లు నూతన గ్రంథాలయ భవనాలు పూర్తికావచ్చాయని అధికారులు తెలపగా వాటిని త్వరితగతిన ప్రారంభోత్సవానికి సిద్ద్ధం చేయాలని ఆయన సూచించారు. కొత్తూర్, షాబాద్ గ్రంథాలయ భవనాల నిర్మాణ పనులు మందకొడిగా సాగతుండటం పట్ల అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో పూర్తిచేయని పక్షంలో కాంట్రాక్టర్‌లపై చర్యలు చేపడతామని ఆయన హెచ్చరించారు.
వనస్థలిపురం, మాడ్గులలో నూతన భవనాల నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు ఆయన తెలిపారు. త్వరలోనే టెండర్ ప్రక్రియ చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. చేవేళ్ల, మొయినాబాద్, కొందుర్గు, ఇబ్రహీంపట్నం, శేరిలింగంపల్లి నూతన భవనాల కోసం ప్రతిపాదనలు పంపాలని ఆయన సూచించారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో డిజిటల్ లైబ్రరీని ప్రారంభించనున్నట్లు జిల్లా ఛైర్మన్ సత్తు తెలిపారు. జిల్లాలో మరో 30 పౌరపఠన మందిరాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర గ్రంథాలయాల అదనపు డైరెక్టర్ అపర్ణ, జిల్లా కార్యదర్శి మనోజ్‌కుమార్, ప్రతాప్‌తోపాటు ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.