Wednesday, December 18, 2024

ఉస్మానియా గ్లోబల్ అలుమ్నీ మీట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధిలో పూర్వ విద్యార్థులు భాగస్వాములు కావాలని వైస్ ఛాన్స్‌లర్ డి.రవీందర్ పిలుపునిచ్చారు. దేశ విదేశాలలో ఉన్న ఒయు పూర్వ విద్యార్థుల మేధస్సు, సహాయ సహకారాలతో యూనివర్సిటీని మరింత అభివృద్ధి చేసేందుకు జనవరి 3,4 తేదీలలో ఉస్మానియా గ్లోబల్ అలుమ్నీ మీట్‌ను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఒయులో చదువుకుని ప్రపంచవ్యాప్తంగా స్థిరపడ్డ పూర్వ విద్యార్థులంతా గ్లోబలర్ అలుమ్ని మీట్ 23లో పాల్గొనాలని కోరారు. ఒయు క్యాంపస్‌లోని ఠాగూర్ ఆడిటోరియంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలిపారు.

విభాగాల వారీగా అలుమ్నీ సమావేశాలు జరుగుతున్నా…. ఉస్మానియా మొత్తంగా పూర్వ విద్యార్థుల సమావేశం జరగటం ఇదే తొలిసారని వివరించారు. ఒయు సమగ్ర అభివృద్ధి, బ్రాండింగ్ విషయంలో పూర్వ విద్యార్థులను భాగస్వామ్యం చేసే దిశగా సెక్షన్ 8 కంపెనీ కింద ఇప్పటికే ఉస్మానియా ఫౌండేషన్ ఏర్పాటు చేశామని వివరించారు. సిఎస్‌ఆర్, అలుమ్ని, బ్రాండింగ్ కోసం సి.ఎ.బి డైరెక్టరేట్‌ను రూపకల్పన చేశామని, ప్రస్తుతం ఈ గ్లోబల్ అలుమ్ని సి.ఎ.బి పర్యవేక్షణలో జరుగుతుందని చెప్పారు. ఒయు రిజిస్ట్రార్ పి. లక్ష్మినారాయణ, క్యాబ్ డైరెక్టర్ రాజశేఖర్, స్టీవెన్‌సన్, శ్రీనివాసులు, ప్యాట్రిక్, నాజియలతో కలిసి గురువారం విసి రవీందర్ యాదవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

కనెక్ట్ టు రీ కనెక్ట్ పేరుతో పూర్వ విద్యార్థులందరినీ ఉస్మానియన్లుగా ఒకే వేదిక ద్వారా కలిపే ప్రయత్నంలో భాగంగా గ్లోబల్ అలుమ్ని మీట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గ్లోబల్ అలుమ్ని మీట్‌లో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న ఉస్మానియా పూర్వ విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. స్పాట్ రిజర్వేషన్లకు కూడా అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ ఉస్మానియా పూర్వ విద్యార్థులు గ్లోబల్ అలుమ్ని మీట్‌లో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతూ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు.
ఉస్మానియా ఫౌండేషన్ ఏర్పాటు
ఒయు పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న విద్యాలయానికి పూర్వ విద్యార్థులు నుంచి సహకారం తీసుకునేందుకు నిబంధనలు ఇబ్బందిగా ఉండేవని విసి రవీందర్ అన్నారు. విదేశాల నుండి విరాళాలు స్వీకరించడంలో ఉన్న అడ్డంకులను ఉస్మానియా ఫౌండేషన్ ఏర్పాటు ద్వారా అధిగమించనున్నామని తెలిపారు. పూర్వ విద్యార్థుల ఆర్థిక సహకారంతో రీసెర్చ్ అవార్డులు, ప్రసంగాలు,నూతన నిర్మాణాలు,భవనాలను దాతల తల్లిదండ్రులు పేర్లు లేదా వారు సూచించిన వారి పేర్లు పెట్టనున్నట్లు వెల్లడించారు.

అలాగే దాతలకు 80(జి) కింద పన్ను మినహాయింపు ఇచ్చే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు. ఈ సమ్మేళనంలో ఉస్మానియా వర్సిటీలో ఇటీవల చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను నివేదిస్తామని అన్నారు. బోధనా అభ్యాసన వనరులను బలోపేతం చేయడం, విద్యార్థులకు సౌకర్యాలను మెరుగుపరచటం, గ్రీన్ క్యాంపస్ కార్యక్రమాలు, మౌళిక సదుపాయాల కల్పన, క్యాంపస్ సుందరీకరణ సహా పలు ప్రతిపాదిత ప్రాజెక్టులలో పూర్వ విద్యార్థుల భాగస్వామ్యాన్ని తీసుకుంటామని తెలిపారు.
పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకునేలా ఏర్పాట్లు
ఉస్మానియా ఫౌండేషన్ ద్వారా విశిష్ట పూర్వ విద్యార్థులు, విశ్రాంత ఉప-కులపతులు, విద్యావేత్తలు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో కీలక భూమిక పోషిస్తున్న ఉస్మానియా పూర్వ విద్యార్థులను భాగస్వామ్యం చేసేందుకు 16 కమిటీలు పనిచేస్తున్నాయని విసి రవీందర్ తెలిపారు. గ్లోబల్ అలుమ్నిమీట్(జిఎఎం) జనవరి 3వ తేదీన మధ్యాహ్న భోజన సెషన్‌తో ప్రారంభమవుతుందని, ఒయు అభివృద్ధి, ఇతర అంశాలపై విశిష్ట పూర్వ విద్యార్థులతో ప్యానల్ డిస్కషన్ నిర్వహించనున్నట్లు చెప్పారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లాన్‌లలో 3వ తేదీన సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని వివరించారు.

4వ తేదీన.. అలుమ్ని రెండో రోజు పూర్వ విద్యార్థులు ఆయా విభాగాలను సందర్శించి, అధ్యాపకులు, విద్యార్థులతో మమేకమై తమ జ్ఞాపకాలను నెమరు వేసుకునేలా సంబంధిత హాస్టళ్లలో భోజనం చేసే ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. గ్లోబల్ అలుమ్ని మీట్ సందర్భంగా ఉస్మానియా క్యాంపస్ సహా అనుబంధ కళాశాలలను సుందరంగా తీర్చితిద్దుతున్నారని వివరించారు. ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా పర్యటనలో భాగంగా విదేశాల్లో స్థిరపడ్డ పూర్వ విద్యార్థుల కమిటీలు చేసిన సూచనల మేరకు ఉస్మానియా ఫౌండేషన్ ఏర్పాటు చేశామని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News