జగిత్యాల: జగిత్యాల పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. శనివారం జగిత్యాల పట్టణంలోని మున్సిపల రోటరీ పార్కులో రూ. 50 లక్షలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అప్పుడెప్పుడో నిర్మించిన పార్కులో కనీస వసతులు, అభివృద్ధి లేక వెలవెలబోతోందని, ఆహ్లాదం పంచేలా పార్కును అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు. అమరవీ రుల స్తూపం వద్ద అన్ని హంగులతో పార్కును నిర్మించామన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగిత్యాల పట్టణం గణనీయమైన అభివృద్ది సాధించిందన్నారు. జగిత్యాల పట్టణాన్ని అన్ని విధాల తీర్చిదిద్ది ఆదర్శ పట్టణంగా నిలపడమే ధ్యేయంగా తాము ముందుకు సాగుతున్నామన్నారు. గతంలో 5 కోట్ల రూపాయల నిధులు వస్తేనే గొప్పగా చెప్పుకునేవారని, తెలంగాణ ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు చేస్తూ పట్టణంలో మౌళిక వసతుల కల్పనకు కృషి చేస్తోందన్నారు. పట్టణంలోని అంతర్గత రోడ్లు, మురికి కాల్వలను అభివృద్ది చేయడంతో పాటు పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కనీస సౌకర్యాలు కల్పించేందుకు కోట్లాది నిధులు ఖర్చు చేస్తున్నామన్నారు.
గత పాలకులు పట్టణ అభివృద్దిని ఏ మాత్రం పట్టించుకోలేదని, దాంతో సమస్యలు రాజ్యమేలుతూ పట్టణ వాసులు పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావన్నారు. గతంలో జోన్‌ల వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారై కొత్తగా నిర్మాణాలు చేపట్టేందుకు మున్సిపల అనుమతులు రాక, బ్యాంకు రుణాలు అందక కొందరు తీవ్ర ఇబ్బందులు పడగా, మరి కొందరు తమ ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేసుకోవడం వల్ల ఇరుకిరుకు రోడ్లు, మురికి కాల్వలు లేక ఆ ప్రాంత వాసులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ఒకే సారి 14 జోన్‌లను మార్చి ప్రజల ఇబ్బందులు తీర్చామని, జోన్‌ల మార్పుకు కృషి చేసిన మంత్రి కెటిఆర్‌కు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. పట్టణ ప్రగతిలో పచ్చదనం, పరిశుభ్రత పెంపొందడంతో పాటు వార్డుల్లో నెలకొన్న సమస్యలకు పరిష్కారం లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్ దాసరి లావణ్య, మున్సిపల్ కమిషనర్ డాక్టర్ నరేశ్, డిఇ రాజేశ్వర్, కౌన్సిలర్లు, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.